నా దారి.. రహదారి అంటున్న రాందాస్
నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్.. సమస్యలున్నప్పుడు పరిష్కారాలు దొరుకుతాయి ! ఆ అన్వేషణతోనే రాందాస్ రాథోడ్
ఇలా పరిచయమవుతున్నాడు..
రాందాస్ సొంతూరు నాగార్జునసాగర్‌లోని కుంకుడునెట్టు తండా. ఇంటర్మీడియెట్ అయిపోగానే హైదరాబాద్ వచ్చేశాడు. నాగోల్‌లో ఉన్న వాళ్ల అక్క దగ్గరే ఉండేవాడు. ఓ వైపు పని చేసుకుంటూనే ఓపెన్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. సికింద్రాబాద్ ఎస్.పి కాలేజీలో ఎం.ఏ సోషియాలజీ పూర్తి చేశాడు. తర్వాత తారామతి బారాదరిలోని హరిత రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేరాడు. మూడేళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. మొదట్లో నాగోల్ నుంచి తారామతి వెళ్లేవాడు. ట్రాఫిక్ సముద్రం ఈది అక్కడకు చేరుకోవడానికి రెండు గంటలకు పైగా పట్టేది. సాయంకాలమైతే మరింత ఆలస్యం ! లాభం లేదని తారామతికి దగ్గర్లోని రాందేవ్‌గూడకు మకాం మార్చాడు.
ఆలోచన ఆగలేదు..
బస అయితే మారింది కానీ ఆ ట్రాఫిక్ జర్నీ అనుభవాలు రాందాస్‌లో కొత్త ఆలోచనలుగా టేకాఫ్ అయ్యాయి. దానికి తోడు అక్కవాళ్లింటి పక్కనే ఉన్న మూసీ జ్ఞాపకాలు ఊరికే ఉండనివ్వలేదు. పైగా నాగోల్ నుంచి తారామతి వరకు తన ప్రయాణమంతా మూసీ పక్కనుంచే! ఆ ఆలోచనలు. జ్ఞాపకాలు కలగాపులగమై ఏదో కొత్తదారి చూపించసాగాయి. అంతా అస్పష్టంగా ఉంది.. నిర్ధారణకు రాలేకపోతున్నాడు. ఈ మూల నుంచి ఆ మూల వరకు పరచుకున్న దారి ఒక్కటే ఆయన మస్తిష్కంలో ముద్ర వేసుకుంది.
షేరింగ్..
కొన్ని రోజుల తర్జనభర్జన తర్వాత మెదడులో మెరిసిన ఆలోచన రాందాస్‌కు అర్థమైంది. అవగాహన కోసం ఒకసారి ఉప్పల్ నుంచి గోల్కొండ దాకా.. మూసీ వెంట నడక సాగించాడు. దారిపొడుగునా.. ఖాళీ ప్రాంతాలు, కబ్జా ఏరియాలు, కట్టడాలు.. ట్రాఫిక్ అన్నింటినీ గమనించాడు. కాస్త అధ్యయనమూ చేశాడు. గోల్కొండ చేరేసరికి తన గమనానికి లక్ష్యం దొకినట్టయింది. వెంటనే తన కొలీగ్స్ సీనియర్ షెఫ్ శ్యామ్‌ప్రసాద్, వెయిటర్లు యాదగిరి, శ్యామ్, ఎలక్ట్ట్రీషియన్ శివశంకర్‌తో తన ఐడియా పంచుకున్నాడు. అది అందరికీ నచ్చి రాందాస్‌కు మద్దతిచ్చారు.
ఆ బారు వంతెన..
స్నేహతుల ప్రోత్సాహంతో తన ఐడియాను పేపర్ మీద పెట్టాడు. గండిపేట దగ్గర్లోని నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్‌ను టచ్ చేస్తూ మొదలైన ఓ దారిని హైదరాబాద్ సిటీలోంచి తీసుకెళ్తూ ఘట్‌కేసర్ సమీపంలోని రింగ్ రోడ్ దగ్గర ముగిస్తూ స్కెచ్ గీశాడు. ఇదంతా మూసీపై నుంచే వెళ్తుంది. మధ్యలో ఉన్న సెంటర్స్‌కు అనుసంధానం అవుతూ సాగుతుంది. 35 కిలోమీటర్ల వంతెన ఇది. ఉప్పల్ నుంచి గండిపేటకు ప్రయాణ సమయాన్ని అరగంటకు కుదించే ఫ్లై ఓవర్ ఇది.
ప్రభుత్వానికి అప్పీల్..
ప్లాన్ అయితే స్కెచ్ వేశాడు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇదే విషయం షెఫ్ శ్యాంప్రసాద్‌తో చెప్పాడు. ‘ఇటీవల వరంగల్‌లో ఘంటా చక్రపాణి అధ్యక్షతన తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవచ్చని ఆహ్వానించారు. దాన్ని అవకాశంగా మలచుకుందామ’ని ఆయన సలహా ఇచ్చాడు. వెంటనే తన దగ్గరున్న ప్లాన్ తీసుకెళ్లి ఘంటా చక్రపాణికి ఇచ్చి విషయాన్ని వివరించారు. పరిశీలనకు పెడతామని ఆయన రాందాస్‌కు మాటిచ్చారు. ఆ నిరీక్షణలో ఉన్న ఈ యువకుడు ‘నా ఈ ఫోర్‌వే ఎక్స్‌ప్రెస్ ప్లాన్ ప్రయాణ భారాన్నే కాదు ట్రాఫిక్‌ను, పొల్యూషన్‌ను తగ్గిస్తుంది. మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమి గురించి, అందులో కబ్జాకు గురైన భూమి గురించి కొంత తెలుసుకున్నాను. వాటిని యుటిలైజ్ చేసుకుంటూ మూసీని ఆనుకుని ఉద్యానవనాలు పెంచొచ్చు. దీనివల్ల అభివృద్ధే కాదు మన సిటీ క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుతుంది. నా ప్లాన్‌లో సాధ్యాసాధ్యాలను గవర్నమెంట్ త్వరగానే స్టడీ చేసి ఓ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. అది అమలైతే గనుక హైదరాబాద్ టూరిజానికీ ఎంతో ఉపయోగం ఉంటుంది.
ముక్తాయింపు
ఇంజనీరింగ్ డిగ్రీలు, మాస్టర్‌ప్లాన్స్ ఎక్స్‌పీరియన్స్ లేని సాదాసీదా యువకుడు కేవలం తన అనుభవంలో నుంచి వచ్చిన ఓ ఆలోచనతో ఇచ్చిన ఫ్లై ఓవర్ ఆన్ మూసీ. గండిపేట్ టు ఉప్పల్ అనే ప్రణాళిక గురించి చాలామంది చాలారకాల అభిప్రాయాలు వెలిబుచ్చార ని చెబుతున్నారు జీహెచ్‌ఎంసీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధ్యాన్ సింగ్. ‘మూసీ నది, హుస్సేన్ సాగర్ నాలాలపైనా ఇలాంటి వంతెనలను నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఐడియా బాగుంది. మంచి సజెషనే. అయితే పర్యవసానాలేంటో ఆలోచించాలి. హైదరాబాద్ ట్రాఫిక్ మీద కెనడాకు చెందిన లీ అసోసియేట్స్ మూడేళ్లు కాంప్రెహెన్సివ్ స్టడీ చేసింది. వాళ్లు ఇలాంటి ప్లాన్ అయితే సజెస్ట్ చేయలేదు. 20 ఏళ్లుగా ఇలాంటి ప్లాన్ పెండింగ్ పెట్టడానికి కారణాలెన్నో. ముంబైలో ట్రాఫిక్‌లా మన దగ్గరా ఎగ్జాస్ట్ అయినప్పుడు మాత్రమే దీన్ని లాస్ట్ చాన్స్‌గా పెట్టుకుంటారు. అయితే ఈ ప్లాన్ వల్ల అటు నాగోల్ నుంచి అత్తాపూర్ వెళ్లే వరకూ చాలా అడ్వంటేజ్ ఉంటుంది. సాధ్యాసాధ్యాలు స్టడీ చాయాల్సిన అవసరం ఉంది’ అంటూ ధ్యాన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
- సరస్వతి రమ
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్