ప్రేమ సంగీతం
A successful marriage requires falling in love many times.. always with THE SAME PERSON.. ఈ మాట ఈ జంట విషయంలో ప్రూవ్ అయిన సత్యం! పదిహేడేళ్ల వీళ్ల కాపురంలో ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డది ఎన్నిసార్లో! ఆయన జయవంత్‌నాయుడు.. ‘జయవంత్ గిటార్ ఇన్వెన్షన్’తో జగమెరిగిన సంగీతవాయిద్య కారుడయ్యాడు. ఆమె.. మాధవి! భర్తలోని కళను అభిమానించే కళత్రం! సంగీతమంటే చెవికోసుకుంటుంది. అందుకే ఈ సంగీతకారుడికి పంచప్రాణాలూ అర్పించింది! పాట ముడివేసిన ఈ జంట అనుబంధం "You and I’ గా ఒక్క చూరుకిందకి చేరి ‘we’గా సాగుతోంది! ఆ ముచ్చట్లు...
‘మాది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులప్పుడు మా ఇద్దరికీ నచ్చిన కామన్ థింగ్ మ్యూజిక్. ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అన్నా నాకు చాలా ఇష్టం. అప్పటికే ఆయన పేరున్న గిటారిస్ట్. మేం ఒకరినొకరు ఇష్టపడ్డానికి, ఆ చూపులు పెళ్లిగా మారడానికి మెయిన్ పాయింట్ అయింది అదే’ అని అప్పటి జ్ఞాపకాన్ని తలచుకొని మురిసిపోయింది మాధవి. ‘తను మ్యూజిక్ లవర్ కావడం నాకు చాలా ప్లస్‌పాయింట్ అయింది. బై ప్రొఫెషన్ ఐయామ్ చార్టర్డ్ అకౌంటెంట్. ప్రవృత్తి మాత్రం సంగీతం మీదే. కన్‌సర్ట్ ఉన్నప్పుడు నా దృష్టంతా ప్రాక్టీస్ మీదే ఉంటుంది. చాలా టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నన్ను అస్సలు డిస్టర్బ్ చేయదు’ అని జయవంత్ నాయుడు చెప్తుంటే ‘ఆడియెన్స్ కన్నా ముందు వినే భాగ్యం కలుగుతుంటే డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తాను? గ్రేట్ ఎంజాయ్‌మెంట్ అది. నాకే కాదు.. మా ఫ్యామిలీ అంతటికీ!’ అంది మాధవి.
సలహాలు?
అంతలేదు. నేను గుడ్ లిజనర్‌ని మాత్రమే కానీ గుడ్ క్రిటిక్‌ని కాను. ఇన్‌ఫాక్ట్ రాగాల పట్ల నాకంత అవగాహన లేదు కాబట్టి ఆయన కంపోజిషన్స్‌కి సలహాలిచ్చే వైజ్ అడ్వయిజర్‌ని కాను’ అని మాధవి నిజాయితీగా చెప్తుంటే ‘అలా ఏం లేదు. మంచి సలహాలివ్వగలదు. అయితే పర్టిక్యులర్ ట్యూన్‌ని వినిపించి ఇది ఎలా ఉంది? అనే నేనెప్పుడూ తనను అడగలేదు. మామూలుగా మ్యూజిక్‌కు సంబంధించి ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు తను చేసిన సజెషన్స్ నా మెదడులో అలా రిజిష్టర్ అయిపోతాయి. కంపోజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిగ్గా ఇంప్లిమెంట్ అవుతాయి’ అని తనూ నిజాయితీగా ఒప్పుకున్నాడు.
జయవంత్‌గిటార్ ఇన్వెన్షన్‌లో మాధవి పాత్ర?
‘నిజం చెప్పాలంటే ఇనీషియల్‌స్టేజ్‌లో విషయాన్నే తనతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే అదెంత వరకు వర్కవుట్ అవుతుందో తెలీదు. 2003 నుంచి దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటికీ కోల్‌కతా వెళ్లొచ్చాక.. ఓకే.. అవుతుంది అన్నాకే తనతో షేర్ చేసుకున్నా. అంటే రెండేళ్లకనుకోవచ్చు. 2007లో జయవంత్ గిటార్‌ని లాంచ్ చేశా’ అన్నాడు. ‘ఆయన కష్టంలో ప్రత్యక్ష పాత్ర లేదు. కానీ.. జయవంత్ గిటార్ తయారు చేసేటప్పుడు మిగిలిన విషయాల బర్డెన్ తన మీద పడకుండా చూసుకున్నా. మాది జాయింట్ ఫ్యామిలీ. మా అత్తయ్య .. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన తన పనిలో బిజీగా ఉంటే మిగిలిన బాధ్యతలను షేర్ చేసుకోవడానికి ిషీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అజ్!’ అని క్రెడిట్‌ని కుటుంబానికిచ్చింది మాధవి.
స్ట్రెంత్స్..
‘లైఫ్‌లో ఎలాంటి చాలెంజెస్ వచ్చినా బ్రేకప్ కారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఓపికెక్కువ’ అని మాధవి కితాబు ఇచ్చేలోపల ‘అవన్నీ సంగీతం ఇచ్చిన సద్గుణాలు’ అన్నాడు జయవంత్. ‘నిజమే. ఆయనెప్పుడూ ఫిలాసఫికల్ యాటిట్యూడ్‌తో, చాలా ప్రశాంతంగా ఉంటారు. మే బీ ఇదంతా సంగీతం వల్లే సాధ్యమేమో అనిపిస్తుంది. సన్‌గా, హజ్బెండ్‌గా, ఫాదర్‌గా పర్‌ఫెక్ట్ రోల్ ఆయనది. ఈ సమన్వయమూ ఆ సంగీతమిచ్చిన వరమేమో’అని భర్తను మెచ్చుకుంది. ‘మాధవి ఫర్మ్ అండ్ గుడ్ అప్రోచ్. ఆమెలో నాకు చాలా నచ్చిన క్వాలిటీ అది. సెల్ఫ్‌కాన్ఫిడెంట్. తన కెరీర్‌కి సంబంధించి అస్సలు కాంప్రమైజ్ కాదు. ఒక స్త్రీకి అత్యంత అవసరమైన క్వాలిటీ అది. తన స్పేస్‌ను చాలా కాపాడుకుంటుంది. అలాగే ఎదుటి వాళ్ల స్పేస్‌నూ గౌరవిస్తుంది. మాధవిలోని ఈ పర్సనాలిటే ఆమె పట్ల నేను పదేపదే ప్రేమలో పడేట్టుచేస్తుంది. అంతకంతకూ గౌరవాన్ని పెంచుతుంది. కాకపోతే స్కూల్ టీచర్‌కదా.. పిల్లల విషయంలో ఆ స్ట్రిక్ట్‌నెస్‌ను చూపిస్తుంది. అదొక్కటే నాకు నచ్చని విషయం’ అంటూ భార్యకు కాంప్లిమెంట్స్ ఇస్తూనే మైనస్‌నూ చెప్పాడు జయవంత్.
మాధవి రాగం..
‘మా పెళ్లయి పదిహేడేళ్లయినా.. ఇంకా తాజాగానే ఉంది మా కాపురం. పెద్దగా కోపాలు, అలకలు లేవు. జయవంత్ ప్రతిసారీ కొత్తగానే కన్పిస్తాడు.. కాబట్టి అండర్‌స్టాండింగ్ పెరుగుతూనే ఉంది. ఇదంతా బికాజ్ ఆఫ్ మ్యూజిక్కే అనుకుంటాను. మా కాపురం స్ట్రాంగ్ అవడానికి డెఫినెట్‌గా మ్యూజిక్ చాలా హెల్ప్ చేస్తోంది. మాకు మేం చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడానికి అదో టూల్‌గా ఉంటోంది. జయవంత్ తన మ్యూజిక్‌తో మా పిల్లలతో సహా ఇంట్లో వాళ్లందరికీ ఓ ఇన్సిపిరేషన్ అండ్ ఐడియల్ మ్యాన్’ అని మాధవి చెప్తుంటే..‘ఆమె అందించిన, ఇస్తున్న సహకారానికి ‘మాధవిరాగాన్ని’ ఆమెకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చేమో భవిష్యత్‌లో’ అన్నాడు నవ్వుతూ జయవంత్. ‘అంటే నన్ను ఇంకొంత త్యాగానికి సిద్ధపడమని చెప్తున్నట్లా?’ అంది మాధవి అదే చిరునవ్వుతో. అంతటితో ఆ ముచ్చట్ల నుంచి సైనాఫ్ అయింది మధుకౌన్స్‌రాగంలోని మెలోడీని తమ కాపురంలోనూ కంటిన్యూ చేసుకుంటున్న ఈ జంట.
- సరస్వతి రమ
ఫొటోలు: సృజన్ పున్నా
జయవంత్‌నాయుడు, మాధవి