నువ్వు-నేను.. గౌరీ.. గోపాలం | You and I: Beautiful couple Gowri Madhu Gopal chit chat with Sakshi City Plus | Sakshi
Sakshi News home page

నువ్వు-నేను.. గౌరీ.. గోపాలం

Published Sat, Sep 6 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

నువ్వు-నేను.. గౌరీ.. గోపాలం

నువ్వు-నేను.. గౌరీ.. గోపాలం

గౌరి, మధుగోపాల్
 దాంపత్యం అనే ఒకే ఫ్రేమ్‌లో ఒదిగిన రెండు చిత్రాలు వేముల గౌరి, మధుగోపాల్! గౌరి.. రేఖాచిత్రమైతే మధుగోపాల్.. ఛాయాచిత్రం! నిజంగానే ఆమెకు ఆయన నీడ. అలాగని ఆయనేమీ ఆమె చేత్తో కుంచె పట్టించి బొమ్మలు వేయడం నేర్పించలేదు. అసలామాటకొస్తే వాళ్ల పెళ్లయ్యే నాటికే ఆమె కాస్త పేరున్న ఆర్టిస్ట్. ఢిల్లీలాంటి పెద్దపెద్ద నగరాల్లో  చాలా షోస్ చేసి ఉంది. మధుగోపాల్ ఇంకా స్ట్రగ్లింగ్‌లోనే ఉన్నాడు. గౌరికి తన సలహాలు, సూచనలు అవసరం లేదనీ ఆయనకు తెలుసు. అందరూ అన్నిట్లో పర్‌ఫెక్ట్‌గా ఉండరు కదా.. ఈ పాయింటే మధుని గౌరీకి ఛాయగా నిలిపింది.
 
 ఒక ఆలోచనొచ్చిందే తడవుగా గౌరి బ్రష్ పట్టుకొని పని మొదలుపెట్టేస్తుంది. తను అనుకున్నది అనుకున్నట్టు కాన్వాస్ మీద కనిపించే దాకా కన్నెత్తి చూడదు. ఆరుగంటలైనా.. పన్నెండు గంటలైనా! తర్వాత.. పూర్తయిన ఆ బొమ్మకు ఫ్రేమ్‌వర్క్ చేసుకోవడంలో పడిపోతుంది. ఇలాంటి టైమ్‌లోనే మధు ఛాయలా అమెనంటిపెట్టుకుంటాడు. గౌరీకి కలర్స్ మీద పట్టుంది కానీ కంప్యూటర్ మీద లేదు. అది మధుకి ఉంది. అందుకే ఆమె మెయిల్ ఐడీ క్రియేట్ చేయడం దగ్గర్నుంచి మెయిల్స్ చెక్ చేయడం, రిప్లయ్ పెట్టడం, ప్రోగ్రామింగ్ షెడ్యూల్ సెట్ చేయడం.. వంటివన్నీ చేస్తాడు ఇష్టంగా! ‘తన పని తప్ప ఇంకేదీ పట్టించుకోదు. వర్క్‌ని రికార్డ్ చేసుకోవాలన్న ధ్యాసా ఉండదు. అవన్నీ నేను చేస్తుంటా’ అంటాడు ప్రేమగా. ‘అందుకే పెళ్లికి ముందు నేను చేసిన వర్క్స్ ఏవీ లేవు నా దగ్గర. ఏమున్నా పెళ్లి తర్వాత వర్క్ రికార్డే.. బికాజ్ ఆఫ్ మధు!’ అని చెప్తుంది గౌరి ఆరాధనగా! మరి మధుకి గౌరి?
 
 తోడు. మధుగోపాల్ ఫొటోగ్రాఫ్స్‌కి తగిన ఫ్రేమ్స్‌ని ఆమే సెలక్ట్ చేస్తుంది. ఫొటోగ్రఫీకి టెక్నికల్ వ్యవహారాలెక్కువ. ఆదాయం కన్నా ఖర్చూ ఎక్కువ. టెక్నాలజీ అప్‌డేట్ అయినప్పుడల్లా మధూ అప్‌డేట్ కావాలి. మార్కెట్‌లోకొచ్చిన  కొత్త కొత్త ఎక్విప్‌మెంట్స్ కొనుక్కోవాలి. అలాంటప్పుడే గౌరీ.. మధుకి తోడుగా ఉంటుంది అప్పు ఇచ్చి. ‘ఫలానా టైమ్‌కల్లా తిరిగి డబ్బు తిరిగిచ్చేయాలంటాను’ అని గౌరి అంటుంటే ‘ఆ బాండ్‌లో ఎప్పుడూ లేను. ఆమె చెప్పిన టైమ్‌లో తిరిగిచ్చింది ఎప్పుడూ లేదు’ అంటాడు మధు నవ్వుతూ. ‘ఏం చేస్తాం.. నేను సంవత్సరమంతా పనిచేసినా సంపాదించలేనంత ఎమౌంట్‌ని ఆమె ఒక్క వర్క్‌తో గెయిన్ చేస్తుంది. ఆర్ట్ వాల్యూ అది.. ఫొటోగ్రఫి రెస్పెక్ట్ ఇలాంటిది’ కన్‌క్లూజన్ ఇస్తున్నట్టుగా మధు. ‘మా ఇద్దరి సంపాదనా ఇంటికోసమే. ఆయనకు నేనిచ్చినా.. నాకు ఆయనిచ్చినా.. ఒకటే కదా. ఫలానా టైమ్‌కల్లా ఇచ్చేయాలనే ప్రెషర్ నా డబ్బుని నేను తీసేసుకోవాలని కాదు.. ఆ వంకతో ఆయనను తన వర్క్ మీద మరింత కాన్‌సన్‌ట్రేట్ అయ్యేట్టు చేయడానికే’ అంటుంది గౌరి. ‘తను చెప్పింది నిజమే. గౌరీ ఫైనాన్షియల్లీ సౌండ్ కావడం  వల్ల నాకింకో వెసులుబాటూ ఉంది. నేను బయటెక్కడో అప్పు తీసుకొని దానికి ఇంట్రెస్ట్ పే చేసే బాధా తప్పుతోంది కదా’ అంటాడు మళ్లీ నవ్వుతూ. తోడునీడలా మెలిగే ఈ అలుమగలకు ఇంకొకరి స్పేస్‌ని గౌరవించడమూ తెలుసు. సహాయం తప్ప ఇన్‌వాల్వ్ ఉండదు. సమాచారం ఇవ్వడం తప్ప ఇన్‌సిస్ట్‌లుండవ్. ‘ఏ ఆర్ట్‌గ్యాలరీ వాళ్లు వచ్చి మీ షో పెడతామన్నా ఠక్కున ఒప్పేసుకుంటుంది. అది ఎలాంటి గ్యాలరీ.. దాని రెప్యూటేషన్ ఏంటీ అని ఆలోచించదు. ‘తొందరపడకు. ఆ గ్యాలరీ గురించి తెలుసుకొని ఓకే చెప్పు’ అని సలహా మాత్రం చెప్తాను. డెసిషన్ తనదే’ గౌరీ కెరీర్‌లో తన పరిధి గురించి వివరిస్తూ మధు. ‘తను తీసిన ఫొటోగ్రఫీలో డీటేల్స్.. బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పడం తప్ప ఇంకేం ఇన్‌వాల్వ్‌కాను’ కరాఖండిగా గౌరి.
 
 అసూయలు.. అలగటాలు?
 ‘అస్సలుండవ్’ అంటారు ముక్త కంఠంతో. ‘ఫొటోగ్రఫి కన్నా ఆర్ట్ రిచ్. దానికున్న డిమాండ్ ఎలాంటిదో ప్రపంచానికి తెలుసు. కాబట్టి నాకు గౌరీ పనిపట్ల .. ఆమె పేరుప్రఖ్యాతుల పట్ల జెలస్‌లాంటిదెప్పుడూ లేదు, ఉండదు.’ అంటాడు గౌరీ పట్ల ఎంతో గౌరవంతో. ‘ఫొటోగ్రఫికి ఉన్న హద్దులు.. పరిధి నాకు ముందే తెలుసు. అయితే పెళ్లప్పటికే మధుకి ఓ స్టూడియో ఉండటం.. ఆయన పట్ల నాకు ఓ నమ్మకాన్ని కుదిర్చింది. అది వమ్ముకాలేదు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్, అండర్ ఎస్టిమేషన్స్ లేవు కాబట్టి  ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అనే అలకలకు చాన్స్ లేదు, ఉండదు’ అని చెప్తుంది గౌరి బల్లగుద్దినట్టు.
 
 ప్రతి ట్రిప్ హానీమూనే..
 అండర్‌స్టాండిగ్‌కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌గా ఉండే ఈ జంట పెళ్లి వయసు పదేళ్లు. వీళ్లకు తొమ్మిదేళ్ల బాబు. పెళ్లయిన కొత్తలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే తాజాదనం వీళ్ల దాంపత్యంలో. మధు ఫొటోషూట్ కోసం ఏ టూర్‌కి వెళ్లినా వెళ్తుంది గౌరి. అక్కడ మధు కెమెరా లెన్స్‌లు అడ్జస్ట్ చేసుకుంటే గౌరి కాన్వాస్ బిగిస్తుంది. ఇది మధు.. గౌరీకిచ్చే కానుక. గౌరి.. మధుకిచ్చే బహుమతీ ఉంటుంది. తన ఆర్ట్‌ని ఇన్‌వైట్ చేసిన గ్యాలరీస్‌కి మధుని పరిచయం చేస్తుంది. ఆయన పనితనం చూసిన గ్యాలరీలు అతనికీ ఆఫర్ ఇస్తాయి. మధు ఛాయాచిత్రాలకు ఎంతలా ఇంప్రెస్ అవుతాయంటే.. తర్వాత గౌరీని కూడా మరిచిపోయేంతలా. ఇంతటి అవగాహన ఉంది కాబట్టే సక్సెస్‌గ్రాఫ్ అటూఇటైనా బ్యాలెన్స్‌డ్‌గా సాగిపోతోందీ జంట!
 -  సరస్వతి రమ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement