శిథిలాల్లో జీవితాలు
ఒక్కో ఫొటో ఒక్కో సందర్భాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రతి ఫొటో వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని చిత్రాలు జీవితంలోని మధురక్షణాలను ఎప్పటికీ నిలిచిపోయేలా చేస్తే.. మరికొన్ని గడిచిన కాలంలో కలచివేసిన సన్నివేశాలను చరిత్రలో నిక్షిప్తం చేస్తాయి. వీటన్నింటినీ మనసుతో క్లిక్ మనిపించే ఫొటోగ్రాఫర్లూ చరిత్రకారులే! వాళ్లు ఒడిసిపట్టిన ఫొటోలను.. వాటి వెనుకనున్న శ్రమ, అనుభూతులను.. ‘లెన్స్ ఎన్ లైఫ్’ శీర్షికతో ప్రతి వారం ‘సిటీ ప్లస్’ మీ ముందుకు తెస్తుంది. తొలిగా.. ‘సాక్షి’ దినపత్రిక ఫొటో ఎడిటర్ కె.రవికాంత్‌రెడ్డి తాను తీసిన ఫొటోల్లో.. ది బెస్ట్‌గా నిలిచిన ఓ చిత్రం వెనుకున్న కథను వివరించారు.
2001 జనవరి 26, ఉదయం 8.46.. గుజరాత్‌లో భూమి ఒళ్లు విరుచుకుంది. ఆ ధాటికి కరువుసీమగా పేరొందిన కచ్ జిల్లా మొత్తం నేలమట్టమైంది. ఎటు చూసినా శవాలు.. కూలిన ఇళ్ల మధ్య జీవచ్ఛవాలుగా మిగిలిన బతుకులు. చివరకు అహ్మదాబాద్ నగరం కూడా ఓ పక్కకు ఒరిగిపోయింది. ఆ సంఘటన జరిగి 13 ఏళ్లు అయినా.. ఆ భయానక సన్నివేశాలు ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ సంఘటనలను కవర్ చేయాలనుకున్న తపన నన్నక్కడికి వె ళ్లేలా చేసింది. 1996లో కోనసీమను వణికించిన తుపాన్ తర్వాత నేను కవర్ చేయడానికి వెళ్లిన చాలెంజింగ్ అసైన్‌మెంట్ ఇదే.
చెప్పిందే తడవుగా..
కచ్ భూకంపం వార్త తెలియగానే (అప్పుడు వార్తలో ఉద్యోగం) ఎడిటర్ గారు నన్ను పిలిచి.. గుజరాత్‌కు వెళ్లమన్నారు. ఉన్నఫళంగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి జనరల్ టికెట్ తీసుకుని ముంబై ట్రైన్ ఎక్కేశాను. రైల్ కిక్కిరిసి ఉంది. ముంబై వరకు నిలబడే ప్రయాణించాను. ముంబైలో దిగగానే అహ్మదాబాద్ రైల్ ఎక్కాను. జనం ఉండటంతో అహ్మదాబాద్ వరకూ నిలబడే వెళ్లాల్సివచ్చింది. అక్కడ దిగగానే కారు మాట్లాడుకుని కచ్ బయల్దేరా. 350 కిలోమీటర్ల దూరం రాత్రంతా ప్రయాణమే.
ఎక్కడ చూసినా..
కచ్ జిల్లాలోని ప్రతి ఊళ్లో శిథిలమైన గృహాలు.. వాడవాడలా అభాగ్యులతో నిండిపోయిన శిబిరాలు.. ఇవే కనిపించాయి. ఆకలితో పేగులు మండుతున్నా.. కొందరు మొహమాటాన్ని జయించలేకపోతున్నారు. ఇంకొందరు పెద్దలు, పిల్లలు తినడానికి.. ఎవరైనా.. ఏమైనా ఇస్తారేమోనని దీనంగా చూస్తున్నారు. జనమంతా రోడ్డుపైనే మకాం వేశారు. మరోవైపు సైనికులు శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాల లో చిక్కుకున్న తమ ఆప్తులు బతికే ఉంటారన్న ఆశతో అక్కడ వెయ్యి కళ్లతో జనం ఎదురుచూస్తున్నారు. బయట పడుతున్న శవాల్లో తమ వారు ఉండకూడదని దేవుడిని వేడుకుంటున్నారు.
రోజుకు 800 కిలోమీటర్లు..
అప్పటికే శాటిలైట్ ఫోన్, డిజిటల్ కెమెరాలతో నేషనల్ మీడియా అక్కడికి వచ్చేసింది. డిజిటల్ కామ్‌తో ఫొటోలు తీయడం.. పంపించడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. నా దగ్గరుంది నికాన్ ఎఫ్‌ఎం 2 కెమెరా. ఫిల్మ్‌తో ఫొటోలు తీయడం.. జిల్లాలో ఎక్కడా కరెంట్ లేకపోవడంతో.. మళ్లీ 350 కిలోమీటర్ల దూరంలోని అహ్మదాబాద్ చేరుకునేవాణ్ని. అక్కడ ఫొటోలు డెవలప్ చేసి.. ప్రింట్ వే సి.. స్కాన్ చేసి హైదరాబాద్ పంపేవాణ్ని. నా అసైన్‌మెంట్ ఇలా 8 రోజులు సాగింది. రోజుకు 800 కిలోమీటర్లకు పైగా తిరిగాను. రాత్రి ప్రయాణం.. ఉదయం ఫొటోలు తీసి.. మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ అహ్మదాబాద్ బయల్దేరేవాణ్ని. ఇంత కష్టంలోనూ ఒక్క క్షణం కూడా అలసిపోలేదు. అలా పాకిస్థాన్ సరిహద్దు వరకు వెళ్లి కవర్ చేశాను. ఈ అసైన్‌మెంట్‌లో నేను తీసిన ప్రతి ఫొటో వెనుక ఓ హృదయవిదారక కథ ఉంది. మీరు చూస్తున్న ఈ ఫొటో కూడా అలాంటిదే!
- కె.రవికాంత్ రెడ్డి