
కుడితిలో పడ్డ ఎలకలా కాంగ్రెస్ పరిస్థితి
యూపీఏ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అనుకున్న అస్త్రాలన్నీ బూమెరాంగ్ అవుతుండటంతో ఏం చేయాలో తెలియక కొట్టుకుంటోంది. ఒకవైపు తాను రేపిన తెలంగాణ చిచ్చు, మరోవైపు నాలుగు రాష్ట్రాల్లో కమలానికి అధికారం.. అన్నీ కలిపి అధిష్ఠానం పెద్దల తలకు రోకలిలా చుట్టుకున్నాయి. దీనికి తోడు లోక్సభలో అవిశ్వాసం ఇప్పుడు అసలు సిసలు సమస్యగా మారింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సొంత పార్టీ ఎంపీలు ఎటూ విశ్వాస పాత్రంగానే పడి ఉంటారులే అనుకుని తేలిగ్గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. వాళ్లకు దాదాపు మరో 50 మంది వరకు తోడు కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాదు, ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులో ఎక్కడా తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించకపోవడంతో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూడా ఆ తీర్మానానికి మద్దతిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. లోక్సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్తో ఒకసారి సంప్రదించి ఏ విషయం చెబుతామన్నారు.
దీంతో కాంగ్రెస్ పెద్దలు ఉలిక్కిపడ్డారు. ఎటుతిరిగి ఇది ఎటు వెళ్తుందోనని ఆలోచనలో పడ్డారు. ఎందుకైనా మంచిదని ఆలోచన చేశారు. ఎలాగోలా ముందు ఈ పరిస్థితి నుంచి బయటపడాలనుకుని, బుధవారం వరకు లోక్సభను బలవంతంగా వాయిదా వేయించారు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తు అధికార పార్టీకే చెందిన ఎంపీ సబ్బం హరి. సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో ముందడుగు వేసినది, అందరి మద్దతు కూడగట్టేందుకు గట్టిగా ప్రయత్నించిది ఆయనే. అవిశ్వాసం గండం నుంచి గట్టెక్కేందుకు పార్లమెంటును ప్రోరోగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తనకు విశ్వసనీయంగా సమాచారం ఉందని ఆయన అన్నారు.
ఆరుగురు ఎంపీలే కదా, వాళ్లపై సస్పెన్షన్ వేటు వేసేస్తే ఇక తీర్మానమూ ఉండదు, అవిశ్వాసమూ ఉండదని తొలుత కాంగ్రెస్ పెద్దలు భావించారు. ఈ మేరకు పొద్దున్నే తమ నాయకులతో ప్రకటనలు కూడా చేయించారు. కానీ, తీరా బీజేపీ నాయకులు అవిశ్వాసానికి మద్దతు విషయంలో సానుకూలంగా స్పందించడం, యూపీఏకు మద్దతిస్తున్న ఇతర పక్షాలు కూడా తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు దీన్నో అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉందని తెలియడంతో కాంగ్రెస్ అధిష్ఠానం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. పొరపాటున అవిశ్వాసం గనక పార్లమెంటులో చర్చకు, ఓటింగుకు వస్తే.. అసలే అరకొర మెజారిటీతో నెట్టుకొస్తున్న తమ ప్రభుత్వం గుటుక్కుమంటుందని, ముందస్తు ఎన్నికలు తప్పవని కాంగ్రెస్ పెద్దలకు బాగా తెలుసు. ప్రస్తుత పరిస్థితి చూస్తే దేశంలో ఎక్కడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు అంత గొప్పగా లేవు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఇంకా దేశ ప్రజలపై అలాగే ఉంది.
యూపీ లాంటి వాటి తర్వాత అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రాంతాల్లోనూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. సీమాంధ్ర ప్రాంతంలో అయితే ఆ పార్టీని వెయ్యి కిలోమీటర్ల లోతు గొయ్యి తీసి పాతర వేద్దామన్నంత కసితో ప్రజలున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కేవలం తన ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన అంటోంది తప్ప ఇందులో ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అనుమానమేనని, కావాలనే తన సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేయిస్తోందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సార్వత్రిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పడవ మునిగిపోవడం ఖాయం. అందుకే ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక అధిష్ఠానం పెద్దలు కొట్టుమిట్టాడుతున్నారు.