రాయలతెలంగాణపై కేసిఆర్తో కాంగ్రెస్ నేతల దౌత్యం
రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. అయితే ఇప్పుడు రాయలతెలంగాణ ప్రతిపాదనను కాంగ్రెస్ నేతలు మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుతో దౌత్యం జరుపుతున్నారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తలెత్తే ఇబ్బందులపై కెసిఆర్తో వారు చర్చిస్తున్నారు. అయితే ఈ అంశం జోలికి వెళ్లవద్దని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రయోజనాలు నెరవేరవని కెసిఆర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.
తెలంగాణ జేఏసీ నాయకులు మాత్రం 10 జిల్లాల తెలంగాణను మాత్రమే కోరుకుంటున్నారు. రాయల తెలంగాణను ఇరుప్రాంతాలవారు ఒప్పుకోరు అని వారు చెబుతున్నారు. రాయల తెలంగాణ ఇవ్వడం ద్వారా రెండు ప్రాంతాలకు ఎలాంటి లాభం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. 10 జిల్లాల తెలంగాణ కోసం మద్దతు ఇవ్వాలని వారు ఢిల్లీలో అన్ని పార్టీల నేతలను కలువనున్నారు.
ఇదిలా ఉండగా, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు మాత్రం ఢిల్లీలో మౌనం దాల్చారు. రాయలతెలంగాణ విషయమై వారు ఏమీ మాట్లాడటంలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా వారు అంగీకరించే విధంగా ఉన్నారు. వారు వ్యతిరేకించే పరిస్థితి కనిపించడంలేదు.
రాయలతెలంగాణ ప్రతిపానను బిజెకి అంగీకరించదు. కెసిఆర్ ససేమిరా అంటున్నారు. ఈ పరిస్థితులలో మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానికి చెబుతున్నట్లు తెలుస్తోంది.