'బిగ్ బాస్'కు శ్రీశాంత్ నో!
ఆటతో కంటే తన ప్రవర్తనతోనే జనం నోళ్లలో నానిన క్రికెటర్ శాంతకుమారన్ శ్రీశాంత్. వివాదాలతో సావాసం చేసిన ఈ కేరళ స్పీడ్‌స్టర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్తో కారాగారం పాలయ్యాడు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా శ్రీశాంత్ హడావుడి తగ్గలేదు. 27 రోజుల జైలు జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, తాను అనుభవించిన కారాగారవాసాన్ని మరిచిపోవాలనుకోవడం లేదని విడుదల తర్వాత వేదాంతిలా సెలవిచ్చాడు.
టీమిండియాలో చోటు దక్కించుకున్న కొత్తలో శ్రీశాంత్ తన స్పీడ్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. పదునైన బంతులను సంధిస్తూ కేరళ ఎక్స్పెస్గా ఎదిగాడు. మైదానంలో చలాకీతనం, భావోద్వేగాల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేవాడు. మైదానం వెలుపలా అతడు చేసిన విన్యాసాలు శ్రీశాంత్ను ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిపాయి. ఆటపాటలతో అలరించేవాడు. పలు టీవీ కార్యక్రమాల్లో శ్రీ పాల్గొన్నాడు. ముద్దుగుమ్మలతో గంతులు వేశాడు. అసలు అమ్మాయిల కోసమే అతడు ఫిక్సింగ్ చేశాడన్న వాదనలు లేకపోలేదు.
ఐదేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ తొలి అంచె పోటీలో సహచరుడు హర్భజన్ సింగ్ తనను చెంపదెబ్బ కొట్టాడంటూ మైదానంలో శ్రీశాంత్ ఏడుపు లంకించుకోవడంతో అతడిపై అందరూ జాలిపడ్డారు. జాలీగా ఉండే కుర్రాడిపై చేయి చేసుకోవడానికి చేతులెలా వచ్చాయని భజ్జీని దుమ్మెత్తిపోసిన వారూ లేకపోలేదు. అప్పుడు జరిగిన ఈ సంఘటన అనుకోకుండా చోటుచేసుకుంది కాదని అదంతా ఓ ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఐపీఎల్ ఆరో ఎడిషన్లో ఆరోపించి శ్రీశాంత్ కలకలం రేపాడు. హర్భజన్ సింగ్‌ను 'వెన్నుపోటు దారు'గా వర్ణించాడు.
కాగా, కెరీర్‌లో విజయాలకంటే వివాదాలతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన శ్రీశాంత్కు గాలం వేసేందుకు కలర్స్ చానల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రియాలిటీ షో 'బిగ్బాస్' లేటెస్ట్ సీజన్లో పాల్గొనేందుకు వచ్చిన ఆఫర్ను శ్రీ.. నిరాకరించాడు. పబ్లిసిటీ కోసమే ఈ షోలో పాల్గొంటారని, శ్రీశాంత్ ఇప్పటికే స్టార్ అని అతడి స్నేహితుడొకరు పేర్కొన్నారు. అయితే శ్రీశాంత్ 'బిగ్బాస్' షో పాల్గొంటే మరో సంచలనమయ్యేది అనేది అనడం నిర్వివాదాంశం.