ఆపద మొక్కుల వాడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు మార్గమధ్యంలోనే 'దేవుడు' కనిపిస్తున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో వెంకన్న భక్తులకు తిరుమల కొండ ఎక్కకుండానే 'స్వామి' దర్శనమవుతోంది. గత కొద్ది రోజులుగా నడుస్తున్న సమైక్య ఆందోళనలతో కలియుగ వైకుంఠానికి భక్తుల రాక తగ్గింది. ధైర్యం చేసి వస్తున్న శ్రీవారి భక్తులు ఉద్యమ వేడికి విలవిల్లాడుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నేడు, రేపు తిరుపతి బంద్కు స్వచ్చంద, ఉద్యోగ సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ 'అష్ట దిగ్బంధం'కు పిలుపునివ్వడంతో భక్తులు ఇక్కట్లు రెట్టింపయ్యాయి.
తిరుపతి అష్ట దిగ్బంధంలో చిక్కుకోవటంతో తిరుపతి నుంచి నుంచి తిరుమలకు బస్సులు పరిమితంగానే నడుస్తున్నాయి. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్లు ..... తిరుమతి వరకూ చేరుకున్న భక్తులు.... అక్కడ నుంచి కొండపైకి వెళ్లేందుకు నానావస్థలు పడుతున్నారు. అలిపిరి బస్టాండ్ నుంచి తిరుమలకు కేవలం 15 బస్సులు నడుస్తున్నాయి. తిరుమల ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించకపోవడంతో అలిపిరి బస్టాండ్ వద్ద భక్తులు అవస్థలు పడుతున్నారు.
బంద్ నేపధ్యంలో నగరంలో టీటీడీ పది ఉచిత బస్సులు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. ఉన్న బస్సుల్లోనే ఎక్కేందుకు భక్తులు ఎగపడుతుండడంతో తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా టీటీడీ ఉచితంగా ఆహార పొట్లాలు, ప్రసాదాలు అందచేస్తోంది.
ఇక రోజు వాహనాలతో కిటకిటలాడే అలిపిరి ప్రధాన ద్వారం బోసిపోయింది. మరోవైపు తిరుపతిలోకి అలిపిరి నుంచి బెంగళూరు మార్గం నుంచి ఎవరైనా తిరుమలకు చేరాలంటే బైపాస్ మీదుగా చెర్లోపల్లె, జూపార్కు మీదుగా అలిపిరికి, ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వారు కరకంబాడి మీదుగా లీలామహల్, కపిలతీర్థం అలిపిరికి చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు తిరుపతిలోనూ జన జీవనం పూర్తిగా స్తంభించింది. విద్యాసంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. ఉద్యోగుల నిరసనలతో సేవలు నిలిచిపోయాయి.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అందరూ స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఇక ద్విచక్ర వాహనాలు మినహా ఆటో, రిక్షా, జీపు, ట్యాక్సీలు, లారీలు కూడా తిరగటం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక తిరుపతి, తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే వారు వాహనాలకు జై సమైక్యాంధ్ర స్టిక్కర్, పెళ్లి కార్డుతోపాటు, పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఫొటోలు అతికించాలని నిబంధనలు కూడా పెట్టడం గమనార్హం. తిరుమల వెళ్లే భక్తులకు బంద్ నుంచి మినహాంపు ఇచ్చామని చెబుతున్నా పెద్దగా తిప్పలు తప్పడం లేదు. ఏ విఘ్నాలు లేకుండా దర్శనభాగ్యం కలగజేయాలని కలియుగ దైవాన్ని వేడుకుంటున్నారు భక్తులు.