రాయలతెలంగాణపైనే తర్జనభర్జన
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు కొత్తగా రాయలతెలంగాణపై తర్జన భర్జనపడుతోంది. ఈ రోజు సాయంత్రం జరిగిందే జిఓఎం తుది సమావేశం అనుకున్నారు. ఢిల్లీ నార్త్‌బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారధ్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు అందరూ హాజరయ్యారు. జిఓఎం సభ్యులు చిదంబరం, ఎకె ఆంటోని,వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి, జైరాం రమేశ్లతోపాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరాలు, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు గంటన్నరసేపు కొనసాగింది. ఎక్కువగా రాయల తెలంగాణపైనే చర్చ జరిగింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపుగానీ, ఎల్లుండి గానీ మళ్లీ జిఓఎం సమావేశం జరిగే అవకాశం ఉంది.
జిఓఎం ప్రతిపాదించిన అంశాలు: రాయల తెలంగాణకే మొగ్గు - ఇరురాష్ట్రాలకూ సమానంగా 21 చొప్పున లోక్‌సభ స్థానాలు - 147 చొప్పున శాసనసభ స్థానాలు - ఉమ్మడి రాధానిగా హైదరాబాద్ - జిహెచ్ఎంసి పరిధి వరకూ ఉమ్మడి రాజధాని - గవర్నర్ చేతికి శాంతి భద్రతల వ్యవహారం - రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా - ఇరురాష్ట్రాలకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) వర్తింపు- రాజ్యాంగ సవరణలేకుండానే విభజన - తెలంగాణకే భద్రాచలం - కృష్ణా జలాపంపిణీకి నీటి నిర్వహణ బోర్డు - పీపీఏల నుంచి తెలంగాణకు విద్యుత్ - కొన్నొళ్ల పాటు ఉమ్మడి సర్వీసుల విధానం అమలు.
ఒకే సంస్కృతి, సంప్రదాయాలు గల రాయలసీమ ప్రాంతాన్ని రెండుగా విడదీయాలనుకోవడం బాధాకరం. సీమ నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరుచేసి రాయలతెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆ ప్రాంత నాయులు ఎవరూ అంగీకరించడంలేదు. రాజకీయ ప్రయోజనాల కోసంమే కాంగ్రెస్ అధిష్టానం ఈ దారుణానికి పాల్పడుతోందని స్పష్టపోయింది.
పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణను ఒప్పుకోమని తెలంగాణవాదులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ జెఏసి నేతలు ఈరోజు బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా కలిశారు. తాము రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని రాజ్నాథ్ సింగ్ వారికి చెప్పారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ రాయలతెలంగాణకు ఒప్పుకునేదిలేదని తెగేసి చెప్పారు. అలా చేస్తే మరో యుద్ధమేనని హెచ్చరించారు.ఈ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్కు కూడా ఆయన పిలుపు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 బిల్లుగా పేర్కొన్న తెలంగాణ బిల్లు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీ ముందుకు వస్తుందని సమాచారం. జిఓఎం నివేదిక, బిల్లు ముసాయిదాపై కేంద్ర మంత్రి మండలి చర్చించి ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటునుంచి అసెంబ్లీకి పంపుతారు. బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి అసెంబ్లీకి పది రోజుల గడువు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలు చాలా తక్కువని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలన్న బిజెపి డిమాండ్ - అఖిలపక్ష సమావేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపధ్యంలో ఈ నెల 5 ప్రారంభమయ్యే సమావేశాలను 20వ తేదీ వరకు కొనసాగిస్తారు. ఒక వారం విరామం తరువాత ఈ నెల 27న తిరిగి ప్రారంభించేయోచనలో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అధిష్టానం సూచనల మేరకే ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ నిర్ణయం తరువాత, పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించేవిధంగా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అవసరాన్ని బట్టి ఎటూ సమావేశాల కాలాన్ని పొడిగిస్తారు. 2009 డిసెంబర్ నెల రాష్ట్ర రాజకీయాల్లో ఎంత కీలకంగా నిలిచిందో, రాష్ట్ర విభజన ప్రక్రియలో ఈ డిసెంబర్ నెల అంతే అత్యంత కీలకం కానుంది.