రాయల తెలంగాణ దిశగా కేంద్రం!
ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. రాయల తెలంగాణ దిశగా కేంద్రం అడుగులేస్తున్నట్టు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం లభించినట్టు ఎన్డీ టీవీ కధనాన్ని నడుపుతోంది. ఇక సీడబ్ల్యూసీ నిర్ణయానుసారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ కాకుండా రాయల తెలంగాణ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన కీలక అంశాలు, తెలంగాణ బిల్లు వంటి అంశాలపై వివిధ పార్టీల నేతలతో కమల్‌నాథ్ చర్చించే అవకాశముంది.
మరోవైపు పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ హస్తినలోనే మకాం వేశారు. డీఎస్ అధినేత్రి సోనియా గాంధీ, జీవోఎం సభ్యులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జీవోఎం నివేదిక రేపు కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు.
ఇక రాయల తెలంగాణ ప్రతిపాదనపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరే దానికి అంగీకరించేలేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించకుండా కిరికిరి పెడితే ఊరుకోమని ఆపార్టీ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు.