సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాయల తెలంగాణ ప్రక్రియ ఆందోళనకు ఆజ్యం పోస్తోంది. మంగళవారం కేంద్ర మంత్రుల కమిటీ(జీఓఎం) భేటీ, ఆ తదుపరి పరిణామాలు మళ్లీ తెలంగాణ ‘లడాయి’కి సంకేతాలు ఇస్తున్నాయి. దాదాపుగా రాష్ట్ర విభజన పూర్తయిందని భావించిన తరుణంలో ‘రాయల తెలంగాణ’ తెరపైకి రావడం వివాదాస్పదం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం, మంత్రుల కమిటీ వైఖరిలో 24 గంటల వ్యవధిలో జరిగిన మార్పులు తెలంగాణవాదులను రగిలిస్తున్నాయి. హైదరాబాద్‌పై ఆంక్షలు లేకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని భావించిన తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదన జోరందుకోవడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో 5న తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం నుంచి నిరసనలు, ధర్నాలకు పిలువునివ్వడంతో మళ్లీ తెలంగాణ భగ్గుమననుంది.
నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా
కేంద్ర మంత్రుల కమిటీ భేటీ ఏమీ తేల్చకుండా సమావేశం వాయిదా పడటంతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించిన నేపథ్యంలో జిల్లాలో మళ్లీ ఉద్యమ కార్యాచరణలో ఆ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రాయల తెలంగాణకు నిరసనగా ఆందోళనలు మంగళవారం ఉధృతంగా సాగాయి. పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి.
ఆదిలాబాద్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించిన న్యాయవాదులు రాయల తెలంగాణ వద్దని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించగా, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. న్యూడెమోక్రసీ, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకో, ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. లక్సెట్టిపేటలో జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటుకు మొగ్గుచూపితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో అఖిల పక్షం అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ పలువురు ఆరోపించారు. 5న బంద్‌కు పిలుపునివ్వడ ంతోపాటు 6న టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరోలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నందున జిల్లాలో మళ్లీ ‘ప్రత్యేక’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడనుంది.
బంద్‌ను విజయవంతం చేద్దాం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదనలు తేవడం కుట్ర. ఈ విషయంలో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అందుకే తెలంగాణలో మరోసారి ఉద్యమించేందుకు అధినేత కేసీఆర్ 5న తెలంగాణ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లాలో బంద్ సక్సెస్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, రాజకీయ, న్యాయవాద, డాక్టర్ జేఏసీలతోపాటు తెలంగాణవాదులు బుధవారం నుంచి నిర్వహించే నిరసనలు, ఆందోళనలకు కదిలిరావాలని కోరుతున్నాము. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 4, 5 తేదీలలో కుంటాల, సారంగపూర్ మండలాల్లో జరిగే టీఆర్‌ఎస్ శిక్షణ తరగతులను వాయిదా వేశాము.
మళ్లీ భగ్గుమన్న తెలంగాణవాదులు
Published Wed, Dec 4 2013 5:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement