'సీమ అస్తిత్వానికి...తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ'
హైదరాబాద్ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బుధవారం గన్పార్క్ వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ రాయల తెలంగాణ పాపం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలదేనని మండిపడ్డారు. దీనికి తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో కదలిక వచ్చేవిధంగా గురువారం తెలంగాణ బంద్ జరుగుతుందని కేటీఆర్ అన్నారు.
పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి... పార్లమెంట్ సాక్షిగా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తారని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే లేదని, పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణకే మద్దతు ఇస్తామన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా తమ నిర్ణయంలో మార్పు ఉండదన్నారు. రాయల తెలంగాణతో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీమ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌవరాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.