పాలమూరు, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం జిల్లాలో బంద్ స్వచ్ఛందం, సంపూర్ణంగా కొనసాగింది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్, టీజేఏసీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ఆందోళనలు కొనసాగాయి.
ముందస్తుగా బంద్ పాటించాలని నిర్ణయించిన మేరకు అన్ని విద్యాసంస్థలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోలు బంక్‌లు మూతబడ్డాయి. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగానే తెల్లవారుజామున టీఆర్‌ఎస్ శ్రేణులు మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సులు రాకుండా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి ముందుండి నడిపించారు. రాయల తెలంగాణ అంటూ ప్రజాస్వామ్యానికి కేంద్రం సంకెళ్లు వేసిందని ఏబీవీపీ నాయకులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా వరకు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అలాగే బంద్‌లో భాగంగా పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ జాగృతి, టీసీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా బైక్‌ర్యాలీ నిర్వహించారు.
ఓవైసీకి సెగ..!
ఎంఐఎం ముఖ్య నాయకుడు చంద్రాయన్‌గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ సెగ తగిలింది. కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేకప్రార్థనలు చేసిన ఆయన దర్గా నుంచి బయటకు వస్తుండగా.. టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని పట్టుబట్టారు. ఒక్కసారిగా తెలంగాణవాదులు భారీసంఖ్యలో ఆయనను చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. దూస్‌కల్ మీదుగా బైపాస్ రోడ్డుకు చేర్చడంతో హైదారాబాద్‌కు చేరుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది.
అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కొడంగల్, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌వీ, బీజేపీ, జేఏసీ, సీపీఐ, ఎంఎస్‌ఎఫ్ నాయకులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముఖ్యకూడలిలో మానవహారం నిర్వహించారు. వనపర్తి పట్టణంలో టీఆర్‌ఎస్, బీజేపీ, టీజేఏసీ ప్రతినిధులు ఉదయం ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. అలాగే జడ్చర్లలో వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లు, కార్యాలయాలు, పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు. స్థానిక కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఉదయం ఎనిమిది బస్సులను అడ్డుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్ నాయకులు పట్టణంలో మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు.
ఎక్కడి బస్సులు అక్కడే
మహబూబ్‌నగర్ అర్బన్ : తెలంగాణ బంద్‌లో భాగంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన బంద్ పిలుపుతో జిల్లాలో ఆర్టీసీ బస్సులకు బ్రేకులు పడ్డాయి. గురువారం జిల్లాలోని ఎనిమిది డిపోల్లో సుమారు 800 బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో ఆర్టీసీకి ఒక్కరోజు రూ.70లక్షల నష్టం వాటిల్లింది. టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు, సభ్యులు సంతకాలు కూడా చేయకుండా రాయల తెలంగాణ పట్ల తీవ్ర నిరసన తెలిపారు. కాగా తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు మాత్రం విధులకు హాజరైనట్లు సంతకాలు చేసినా బస్సులను బయటికి రాకుండా ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారంతా డిపోలోనే గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణికులు, బస్సులు రాకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు, తెలంగాణ విద్యార్థి , ప్రజాసంఘాలు తెల్లవారుఝామునే డిపో ఎదుట బైటాయింపు చేశారు.
బంద్ స్వచ్ఛందం
Published Fri, Dec 6 2013 2:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement