జిల్లాకు బంగారు భవిత | local body elections polling | Sakshi
Sakshi News home page

జిల్లాకు బంగారు భవిత

Published Sun, Apr 20 2014 1:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

జిల్లాకు బంగారు భవిత - Sakshi

జిల్లాకు బంగారు భవిత

చేవెళ్ల గర్జనలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

చేవెళ్ల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయితే రంగారెడ్డి జిల్లా భవిత బంగారుమయం అవుతుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని ఆంధ్రోళ్లు దుష్ర్పచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం చేవెళ్లలో నిర్వహించిన గర్జన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లాలోని భూముల ధరలు ఎన్నో రెట్లు పెరుగుతాయన్నారు.

 ప్రస్తుతం రూ.రెండు కోట్లున్న ఎకరం ధర రానున్న రోజుల్లో రూ.20 కోట్లు పలుకుతుందని అన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఐటీఐఆర్ రాబోతున్నదని, దీంతో జిల్లా దశమారుతుందని, హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకోనున్నదని చెప్పారు. జిల్లాలోని భూముల విలువ కూడా బాగా పెరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో కూరగాయలు అధికంగా పండిస్తారని, జిల్లాను కూరగాయల స్పెషల్ జోన్‌గా ప్రకటిస్తామని వెల్లడించారు.

 టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక చేవెళ్లలో కూరగాయల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు. 500ఎకరాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రైతులకు 80శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా సాగుచేసే రైతులకు కమర్షియల్ కింద విద్యుత్‌ను అందిస్తున్నారని, తాము అధికారంలోకివస్తే వ్యవసాయానికి వర్తించేవిధంగా ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని పేర్కొన్నారు. కూరగాయలు, పాలు, పూల రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు గుదిబండగా మారిన 111జీఓను పునఃసమీక్షించడమో, అవసరమైతే రద్దు చేయడమో చేస్తామని స్పష్టంచేశారు.

 శంకర్‌పల్లిలో 4వేల మెగావాట్ల అల్ట్రా విద్యుత్ ప్రాజెక్టు
 శంకర్‌పల్లిలో ఎన్‌టీపీసీని ఏర్పాటుచేస్తామని, నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా ప్రాజెక్టును ఏర్పాటుచేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టువల్ల 15 వేల నుంచి 16వేల మంది యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.

 జిల్లా నుంచి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు..
 హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో చాలా పనులు చేయాల్సి ఉందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే జిల్లానుంచి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులుంటారని కేసీఆర్ చెప్పారు. జిల్లాకు ప్రత్యేకమైన చరిత్ర ఉన్నదని, అవసరాలు కూడా చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.

ఎంతో మం ది సీనియర్ నాయకులున్నారని, టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పారు. వేది కపై పేర్లు చెప్పడం ఇష్టంలేదుగానీ.. ఇద్దరు ముగ్గురు మం త్రులు ప్రభుత్వంలో ఉంటారని మాత్రం చెప్పగలనన్నారు.

 వంద టీఎంసీల ప్రాజెక్టు నిర్మిస్తాం
 పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో వంద టీఎంసీల ప్రాజెక్టును ఏర్పాటుచేసి జిల్లాలోని భూములను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల -ప్రాణహిత ప్రాజెక్టు సాధ్యమయ్యేపనికాదని, మన మునిమనవలు కూడా ఈ ప్రాజెక్టును చూడరని ఎద్దేవాచేశారు.

షాద్‌నగర్ సమీపాన ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం 670 మీటర్ల ఎత్తులో ఉన్నదని, అక్కడినుంచి జూరాల ద్వారా రెండు లిఫ్ట్‌లను ఏర్పాటుచేసి నీటిని తీసుకొస్తే జిల్లాలో తాగునీరు, సాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు. తెలంగాణలో ఈ ప్రాజెక్టు మరో నాగార్జునసాగర్ అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టునుంచి హైదరాబాద్ నగరానికి మంచినీటిని కూడా అందించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.

 కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటాం

‘మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి శిష్యుడు భూదాన్ రాంచంద్రారెడ్డి భూదోనోద్యమం ద్వారా వందలాది ఎకరాలు దానం చేశారు.. వాటిని కూడా సీమాంధ్రోళ్లు కబ్జాచేసిండ్రు. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలోని వక్ఫ్, గురుకుల, పేదలకు ఇచ్చిన భూదానోద్యమ భూములు ఆంధ్రోళ్ల పాలైనై. 763 ఎకరాల గురుకుల భూములను కూడా కబ్జాచేశారు.

 హుస్సేనీషావలి, వక్ఫ్ భూములను ల్యాంకో సంస్థ కబ్జా చేస్తే టీఆర్‌ఎస్ పోరాటం చేసింది. చంద్రబాబు బంధువులు, అక్కినేని నాగార్జున తదితరులు జిల్లాలోని భూములను చాలావరకు కబ్జా చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కబ్జా చేసిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం.

 ఈ భయంతోనే టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా పలు పార్టీలు కుట్రపన్నుతున్నాయి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా వక్ప్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలను కట్టబెడతామని కేసీఆర్ పేర్కొన్నారు.

 అంతర్జాతీయ స్థాయిలో యాదిరెడ్డి స్మారక స్థూపం
 ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది యువకులు ప్రాణత్యాగాలు చేశారు. ఈ నియోజకవర్గంలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన యాదిరెడ్డి పార్లమెంటు భవనం ముందు ఆత్మత్యాగం చేసిండు. యాదిరెడ్డి ఆత్మ శాంతించాలంటే కాంగ్రెస్, టీడీపీలు గెలవకూడదు.

 నిజమైన తెలంగాణవాదులు గెలవాలి. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఐదు ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో యాదిరెడ్డి స్మారక స్థూపాన్ని ఏర్పాటుచేస్తాం’ అని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు కె.హరీశ్వర్‌రెడ్డి, పి.మహేందర్‌రెడ్డి, కేఎస్.రత్నం, సంజీవరావు, మనోహర్‌రెడ్డి, స్వర్ణలతారెడ్డి, శంకర్‌గౌడ్, ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, స్వామిగౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement