విదేశీ మధువులకంటే స్వదేశీ మధువులే మెండు
దేశి మధువులందు దీటైన మధువేది?
జిలుగులీనెడు జీడి మధువుగాక
వేడి చేసెడు వేళలందున వైనుతేయ!
విరుగుడగునదియె విశ్వసింపు!
‘మధు’రోక్తి: తొంభైతొమ్మిది శాతం సమస్యలు డబ్బుతో పరిష్కారమైపోతాయి. మిగిలిన ఒక్కశాతం సమస్యలకూ మధువు ఉందిగా!
- క్వెంటిన్ ఆర్ బఫోగ్లే,
అమెరికన్ రచయిత
రాజ్యాంగం సాక్షిగా మనది లౌకిక దేశం. అలాగని దేశ జనాభాలో అంతా లౌకికవాదులే కాదు, అలౌకికవాదులూ ఉంటారు. అలౌకికవాదుల్లోనూ చాలా శాఖోపశాఖలు ఉన్నా, వారిలో ‘తీర్థం’కరులు అగ్రగణ్యులు. ‘తీర్థం’కరుల్లో కొందరికి దేశభక్తి మెండు. స్వతంత్ర దేశంలో విదేశీ మధువులు హోదాచిహ్నంగా చలామణీ అవుతున్నా, స్వదేశీ మధువులతోనే వారు గొంతు తడుపుకుంటారు. దేశవాళీ సరుకుల్లో తాటికల్లు, ఈతకల్లు చిరకాలంగా ప్రాచుర్యం పొందాయి. చక్కెర మిల్లులు వచ్చాక గుడుంబాగా పిలుచుకునే నాటుసారా గుబాళింపులు గల్లీగల్లీకి పాకాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో విప్పసారా విశిష్టతను చెప్పాల్సిన పనిలేదు.
అయితే, ఇవన్నీ విరివిగా దొరుకుతాయి. ప్రపంచంలో విరివిగా దొరికే వాటికి పెద్దగా విలువ ఉండదు. అవి మధుభాండాలైనా సరే, కళాఖండాలైనా సరే! ఎంత అరుదో అంత విలువ. దేశవాళీ మధువుల్లో అరుదైనది, కించిత్ అపురూపమైనది జీడి మధువు. గోవాలో మాత్రమే దొరికే జీడి మధువును ‘ఫెనీ’గా పిలుచుకుంటారు. తయారీ ప్రక్రియలో విదేశీ మధువులకు ఇది ఏమాత్రం తీసిపోదు. దేశి మధువుల్లో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ పొందిన ఘనత ఫెనీకి మాత్రమే దక్కుతుంది. దేశ భక్తులైన అలౌకిక ‘తీర్థం’కరుల కోసం ఈవారం...
దేశీ ఎలిక్సిర్
ఫెనీ : 30 మి.లీ.
వోడ్కా : 15 మి.లీ.
డార్క్ రమ్ : 15 మి.లీ.
కోకాకోలా : 90 మి.లీ.
సోడా : 50 మి.లీ.
గార్నిష్ : కొద్దిగా పుదీనా ఆకులు
- వైన్‌తేయుడు