డ్రింక్.. డైన్.. డ్యాన్స్ | Drink, dine, dance to make as 3D effect | Sakshi
Sakshi News home page

డ్రింక్.. డైన్.. డ్యాన్స్

Published Thu, Oct 30 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

డ్రింక్.. డైన్.. డ్యాన్స్

డ్రింక్.. డైన్.. డ్యాన్స్

సిటీలో ఒక రెస్టారెంట్‌లో ఫుడ్‌ఫెస్టివల్ అంటేనే... ఫుడీస్‌కి ఫుల్ మీల్స్ లాంటి కబురది. అలాంటిది ఏకంగా 16 రెస్టారెంట్లు ఒక చోట చేరి తమదైన శైలి విందుని అందిస్తే, డ్రింక్, డైన్, డ్యాన్స్... మూడూ కలగలిపిన త్రీడీ ఎఫెక్ట్ సందడిని మోసుకొస్తే... అంతకు మించిన విశేషం ఏముంటుంది! సిటీలోని టాప్ రెస్టారెంట్స్ వంటలతో వినోదాన్ని కలగలిపి, హైటెక్స్ వేదికగా ఈ త్రీడీ ఎఫెక్ట్‌ను మనకు శుక్రవారం నుంచి రుచి చూపనున్నాయి. మూడు రోజుల పాటు ‘రెలిష్ హైదరాబాద్’ పేరుతో డిఫరెంట్ టేస్ట్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరానీ చాయ్ నుంచి బిర్యానీ దాకా మన సిటీకి ఇంటర్నేషనల్ పాపులారిటీ తెచ్చిన ఫుడ్ వెరైటీలు ఎన్నో ఉన్నాయి.

ఇంటి వంటను బయట గెలిపించడంలో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ రుచుల్ని ఇంటికి అందించడంలోనూ నగరానికి చెందిన రెస్టారెంట్లు ముందంజలో ఉన్నాయి. తమదైన క్యుజిన్‌ను, స్పెషాలిటీస్‌ను ఫుడ్ లవర్స్‌కు రుచి చూపడానికి సిటీకి చెందిన రెస్టారెంట్లు అలా లిబర్టీ, ది ఓరియంటల్ బ్లసూమ్, తబలా, సెవెన్త్ హెవెన్, ఎఫ్ కేఫ్, రోటీస్, ది స్పైసీ అవెన్యూ, ఫోర్ సీజన్స్, సిన్నామన్ ఫ్యూజన్, లిటిల్ ఇటలీ, సింప్లీ సౌత్, జిటి కంఫర్ట్, వయా మిలానో, ఈట్ ఇండియా కంపెనీ, ఐ గ్రిల్‌లు ఒక వేదికలో రుచుల ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి.
 
 ఏమి చేస్తాయి?
 ఈ రెస్టారెంట్లన్నీ తమ కిచెన్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తాయి. ఇందులో తమకు మాత్రమే ప్రత్యేకించిన 4 స్పెషలైజ్డ్ డిష్‌లను అక్కడికక్కడే తయారు చేసి ప్రదర్శిస్తాయి. అలాగే మరొక ఐకానిక్ వంటకాన్ని రుచి చూపిస్తాయి. మొత్తం 80 డిష్‌లు కను ‘విందు’ చేస్తాయి. సో.. విభిన్న రకాల రుచుల్ని టేస్ట్ చేయవచ్చు. అది కూడా అందుబాటు ధరల్లో. అంతే కాకుండా మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఫుడ్‌లవర్స్‌కి బోనస్. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి కొనసాగింపు ఇది. అన్ని రకాాల గ్లోబల్ క్వీజిన్‌లకు సిటీ వేదిక అని, మనది అసలు సిసలు అంతర్జాతీయ నగరం అని నిరూపించేందుకే ఈ ఈవెంట్ డిజైన్ చేశాం’ అని హైటెక్స్ సీఈఓ కె.వి.నాగేంద్రప్రసాద్ అంటున్నారు.
 
 భారత్‌లో తొలిసారి
 ‘ఇదో అంతర్జాతీయ కాన్సెప్ట్. ఇలాంటివి విదేశాల్లో జరుగుతూ ఉంటాయి. భారత్‌లోనే తొలిసారిగా మేం ఇక్కడ నిర్వహిస్తున్నాం’ అని ఈవెంట్ కోఆర్గనైజర్, నెక్ట్స్ ఈవెంట్స్ (ముంబై) డెరైక్టర్ అనిల్ అరోరా చెప్పారు.
 
 ప్రత్యేకతలెన్నో...  
 ఈ రెలిష్ హంగామాలో ఫుడ్‌తో పాటు మరిన్ని విశేషాలున్నాయి. సిటీలోని పది మంది టాప్ చెఫ్‌లు అప్పటికప్పుడు ఇక్కడ వండి వార్చే సెలబ్రిటీ చెఫ్ థియేటర్, గృహిణులు, కలినరీ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థుల కోసం ‘ది గ్రేట్ హైదరాబాద్ హోమ్ కుక్ చాలెంజ్’ స్పెషల్ అట్రాక్షన్. ఇందులో విజేతకు రూ.2 లక్షల వరకు బహుమతులున్నాయి. సందర్శకులను హుషారెత్తించేందుకు టాప్ బ్యాండ్ సమర్పించే లైవ్‌మ్యూజిక్‌తో పాటు పరిమిత స్థాయిలో లైఫ్‌స్టైల్ బజార్, కిడ్స్‌జోన్‌లు ఉంటాయి. కొత్తగా వచ్చిన రేడియో ట్యాక్సీ సర్వీస్ ఊబర్ విజిటర్లకు ఫ్రీ సర్వీస్‌ను అందిస్తోంది. ఈ ఈవెంట్‌కు 10 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా. తొలి రోజు సాయంత్రం 6కు, చివరి రెండు రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సందర్శించవచ్చు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.200, చిన్నారులకు రూ.100. రూ.1,100 ఫుడ్ కూపన్ కొనుగోలు చేస్తే ప్రవేశం ఉచితం.
  - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement