షాపింగ్ విత్ ఫన్
ఆడుతుపాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. అదే ఆడుతు పాడుతూ షాపింగ్ చేస్తుంటే ఆ మజా ఇంకెలా ఉంటుందో ఈ యువతులను చూస్తే తెలుస్తుంది. ఫ్యాషన్ వేర్స్, యాక్సెసరీస్, చిన్నపిల్లలకు గేమ్స్, బోటింగ్.. ఇలా అన్నింటినీ కలగలిపిన అర్బన్ మార్కెట్ ‘ఫ్లీ’ దుర్గంచెరువు దగ్గరున్న ‘మారకేష్’లో ఆదివారం ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో షాపింగ్.. ఇంకేముంది అమ్మాయిలంతా ఇదిగో ఇలా మస్తుగా ఎంజాయ్ చేశారు.
ఫన్, ఫుడ్, షాపింగ్.... ఇప్పుడు ఏదైనా ఒక్కచోటే. అమ్మాయిలకు అందమైన వస్త్రాలు, యాక్ససరీస్‌తో పాటు చిన్న పిల్లలకు గేమ్స్, బోటింగ్.. ఇలా అన్నింటినీ కలగలిపిన అర్బన్ మార్కెట్ ‘ఫ్లీ’. దుర్గంచెరువు వద్దనున్న ‘మారకేష్’లో ఆదివారం ఈ అర్బన్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. రకరకాల వస్తువులు, స్పైసీ ఫుడ్, అహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు ఆస్వాదించారు. నట్లు, బోల్టులతో యంత్రాలు తయారు చేయడమే కాదు.. అందమైన బొమ్మలను కూడా చేయొచ్చు. దాన్నే ‘స్క్రాప్ మెటల్ వర్క్’ అంటారు.
పాడైపోయిన బైకులు, కార్ల నుంచి సేకరించిన వస్తువులను ఉపయోగించి తయారుచేసిన అనేక రకాల బొమ్మలను ఇక్కడ ప్రదర్శించారు. థాయ్‌లాండ్ నుంచి ఇంపోర్ట్ చే సిన వీటి ధర రూ.1,200 నుంచి రూ.4,000 వరకు ఉంది. ఖాళీ మద్యం సీసాలపై అందమైన రంగులద్ది సరికొత్త రూపాన్నిచ్చారు స్వర్ణ, మైత్రేయి. వీటి ధరలు రూ.250 నుంచి రూ.850. ఇంకా సన్‌గ్లాసెస్ నుంచి బెంగళూరు శారీస్, నార్త్ ఇండియన్ డ్రెస్ మెటీరియల్స్, పెరల్స్ వరకు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫ్యాషన్ యాక్సరీస్ ధరలు రూ.150 నుంచి రూ.750. సాయంత్రం చెరువులో బోటింగ్ ఆపై వినోద కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణ.
-సాక్షి, సిటీ ప్లస్