హైదరాబాద్ పై ఎవరి భయం వారిది!
అందరి దృష్టి, అందరి ఆలోచనలు హైదరాబాద్ పైనే కేంద్రీకృతమై ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో ఈ ప్రముఖ నగరానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భాగ్యనగరం విషయంలో ఎవరి భయం వారికి ఉంది. హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించినప్పటికీ మంత్రుల బృందం(జిఓఎం), అఖిలపక్ష సమావేశాలు అనేసరికి తెలంగాణవాదుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ విషయంలో కేంద్ర ఏదైనా మతలబు పెడుతుందేమోనని వారు భయపడుతున్నారు. హైదరాబాద్కు సంబంధించి ఏదైనా లొల్లిచేస్తే ఊరుకోం అని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు హెచ్చరించారు.
సీమాంధ్ర ప్రజలు 56 ఏళ్లుగా హైదరాబాద్ మన రాజధాని, మన మహానగరం అని నమ్ముతూ దానితో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాడిననాటికి చిన్నవారిగా ఉన్నవారు, ఆ తరువాత పుట్టిన వారే అధికంగా ఉన్నారు. చదువు, ఉద్యోగం, వైద్యం, వ్యాపారం.... .అన్ని రకాలుగా తెలంగాణ జిల్లాల వారి మాదిరే సీమాంధ్రులు కూడా హైదరాబాద్తో సంబంధ బాంధవ్యాలు పెంచుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా 'హైదరాబాద్తో మీకేమీ సంబంధంలేదు, వెళ్లిపోండి' అంటే వారి పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకోవచ్చు. హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగం అనేది ఎంత నిజమో, ఈ నగర అభివృద్దిలో తెలంగాణ వారితోపాటు సీమాంధ్రుల పాత్ర ప్రముఖంగా ఉందన్న విషయం కూడా అంతే వాస్తవం. అందరూ కలిసే భాగ్యనగరాన్ని ఈ స్థాయికి తెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్పై హక్కులు అన్నీ వదులుకోవలసివస్తుందనే అంశాన్ని సీమాంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల సీమాంధ్రులు అసలు విభజన వద్దని, ఒక వేళ విభజిస్తే హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరుతున్నారు. జిఓఎం, అఖిలపక్ష సమావేశాలనే సరికి ఈ నగరంపై కేంద్రం ఏదైనా తమకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందేమోనన్న ఆశతో వారు ఉన్నారు. అయితే మరో పక్క విభజనకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉండటం, హైదరాబాద్ విషయమై ఏమీ మాట్లాడకపోవడంతో దానిపై ఆశలు వదులుకోవలసి వస్తుందేమోనన్న అనుమానం వారిలో ఉంది. చంద్రబాబు మద్దతు ఉండటంతో కాంగ్రెస్ తన ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం సీమాంధ్రులలో ఉంది.
కొంతమంది తెలంగాణవాదులు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తెలంగాణ ఏర్పడిన తరువాత తమ వ్యాపారాలు, ఆస్తుల భద్రతపై వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వారే కాకుండా ఈ అంశంలో ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలు రూపొందించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ అధినేత, సీనియర్ ఐపిఎస్ అధికారి విజయకుమార్ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. నగరంలోని సీనియర్ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ రక్షణ విషయంలో జాగ్రత్తలు వహించాలి - కేంద్రం ఆధీనంలో నగర శాంతిభద్రతలు - భాగ్యనగరంలో ఉండే సీమాంధ్రుల ఆస్తులు, వ్యాపారాల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలి.... అని అధికారులు, వ్యాపారవేత్తలు పలురకాల సూచనలు చేశారు.
ఈ రకంగా విభజన అంశంలో అందరి దృష్టిలో హైదరాబాద్ కేంద్ర బిందువైంది. కేంద్రానికి కూడా ఇది కీలక అంశంగా మారింది. రాష్ట్ర విభజన, భాగ్యనగరంపై ఇరు ప్రాంతాల వారి అనుమానాలు, ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.