ఇన్ సెక్యూరిటీ గార్డ్స్ | Insecurity guards: Jogi brothers introduced as Sakshi cityplus Star reporters | Sakshi
Sakshi News home page

ఇన్ సెక్యూరిటీ గార్డ్స్

Published Sun, Jan 4 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

Insecurity guards: Jogi brothers introduced as Sakshi cityplus Star reporters

ఏసీ గదిలో కొలువుదీరిన లక్ష్మీదేవిని కంటికి రెప్పలా కాపాడే జయవిజయులు ఈ సెక్యూరిటీ సిబ్బంది. కార్పొరేట్, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌లకు అవుట్ సోర్సింగ్ కవచాలై కాపలా కాస్తుంటారు వీరు. చాలీచాలని వేతనాలతో కాలంతో పాటే పరుగులు పెట్టే వీరి బతుకులకు మాత్రం భరోసా లేదు. షిఫ్టుల వారీగా పనిని పంచుకుని భద్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టే వీరు.. తమ లైఫ్ ఇన్‌సెక్యూరిటీగా ఉందని ఫీలవుతున్నారు. బతుకుల్లో బాధలెన్నున్నా.. ముఖంపై చిన్న చిరునవ్వు పులుముకుని నిలువు కాళ్లపై ‘రౌండ్ ది క్లాక్’ పనిచేసే సెక్యూరిటీ గార్డులను.. జోగి బ్రదర్స్‌గా పిలిచే జోగినాయుడు, కృష్ణంరాజు ఈ వారం సాక్షి సిటీప్లస్ ‘స్టార్ రిపోర్టర్స్’గా  పలకరించారు.  
 - జోగి బ్రదర్స్
 
జోగినాయుడు: ఏ షాపులో దొంగతనం జరిగినా పోలీసులు ముందు అనుమానించేది సెక్యూరిటీ వారినే. కొన్ని చోరీ కేసుల్లో సెక్యూరిటీ గార్డుల చెయ్యి ఉందనే వార్తలూ వింటుంటాం. అలాగే, విచారణ పేరుతో పోలీసులు వేధించిన దాఖలాలూ ఉంటాయి. ఏమంటారు?
పాషా: అటువంటి వార్తలు విన్నప్పుడు చాలా సిగ్గుపడుతుంటాం సార్. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఆస్తుల్ని చేతిలో పెడతారు. అలా కాకుండా నిజాయితీగా పనిచేసిన సెక్యూరిటీ గార్డుల్ని వేధించిన సంఘటనలు చూసినపుడు బాధ కలుగుతుంది.
కృష్ణంరాజు: విన్నారు కదా! మన సెక్యూరిటీ తమ్ముళ్ల కన్నీళ్లు.. కోరికలు. ప్రతి వృత్తిలో కష్టాలుంటాయి. దానికి తగ్గ గుర్తింపు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఈ రోజు మనతో ఉన్న ఈ తమ్ముళ్లు కోరుకునేది అదే. దయచేసి ‘ఆఫ్ట్రాల్ సెక్యూరిటీ గార్డ్’ అనకండి. వారు మనకి సెల్యూట్ చేస్తేతిరిగి ప్రతి నమస్కారం పెట్టండి. వీలైతే సలామ్ చెయ్యండి. థ్యాంక్యూ.
 
 జోగినాయుడు: ఎంత ఆస్తిపరుడైనా రాత్రివేళ గుండెలపై చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడంటే...దానికి కారణం సెక్యూరిటీ గార్డ్స్. వీళ్లే లేకుంటే కార్యాలయాలకు, షాపుల్లో వస్తువులకు భద్రత లేదు. సాక్షి స్టార్ రిపోర్టర్స్‌గా వీరిని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.
 కృష్ణంరాజు: అంతేకదా మరి. ప్రాణాల్ని పణంగా పెట్టి కొన్ని కోట్ల ఆస్తులకు కాపలా ఉంటారు వీళ్లు. నా దృష్టిలో వీళ్లు ఆయుధాలు లేని పోలీసులు.  ఏమంటావ్ భయ్యా?. నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు?
 సురేందర్: మాది నల్గొండ దగ్గర చిన్న పల్లెటూరు సార్. పదేళ్ల క్రితం సిటీకొచ్చా. ఆర్మీలో చేరాలని చాలా ప్రయత్నాలు చేసి విఫలమై.. చివరికిలా సెక్యూరిటీలో చేరాను. బతకడం కోసం ఏదొకటి చేయాలి కదా సార్
కృష్ణంరాజు: ఎక్కడ పనిచేస్తున్నావ్?
సురేందర్: జళగం వెంగళరావు పార్కులో సూపర్‌వైజర్‌గా చేస్తున్నాను
జోగినాయుడు: మీకు జీతాలెలా ఉంటాయి భయ్యా?
సురేందర్: నేను 2003లో రూ.1,800 జీతానికి చేరాను సార్. ఇప్పుడు రూ.6,000 వేలు
 కృష్ణంరాజు: ఇంట్లో ఎంతమంది ఉంటారు భయ్యా?
సురేందర్: అమ్మానాన్న, భార్య ఇద్దరు పిల్లలు సార్
కృష్ణంరాజు: మరి ఈ జీతం సరిపోతుందా?
సురేందర్: లేదు సార్
 జోగినాయుడు: మీరు మాకు, మా ఆస్తులకు
 సెక్యూరిటీ ఇస్తారు కదా భయ్యా. మరి మీకు
 సెక్యూరిటీ ఎవరిస్తారు?
 పాషా: మాకు మేమే సెక్యూరిటీ సార్
 జోగినాయుడు: కావొచ్చు. కానీ మీపైన దొంగలు గానీ ఇంకెవరైనా దాడి చేస్తే పరిస్థితి ఏంటి?
 పాషా: వీలైనంతవరకూ ఎవరికీ చాన్స్ ఇవ్వం సార్. సమయానుకూలంగా పరిస్థితుల్ని ఎదుర్కొంటాం
 జోగినాయుడు: అంటే.. ఎలా?
పాషా: ఏంలేదు సార్. నేను ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నాను. పూర్వం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేశాను. అక్కడెలా ఉండేదంటే.. ఇన్‌పేషెంట్‌ని చూడ్డానికి వచ్చే విజిటర్స్ పాస్‌లు లేకుండా వెళ్లిపోతుంటారు. ఆపితే తప్పు. కొందరు వింటారు. కొందరు గొడవపడతారు. పలుకుబడి ఉన్నవారైతే మాపై కంప్లయింట్స్ ఇస్తామంటారు. మాపై చెయ్యిచేసుకునే సందర్భాలూ ఉంటాయి సార్
కృష్ణంరాజు: నిజమే.. ఆసుపత్రుల్లోని సెక్యూరిటీ గార్డులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు
సురేందర్: అంతెందుకు సార్. పార్కులకొచ్చే కుర్రాళ్లు కొందరు టైమైనా వెళ్లరు. అడిగితే.. బయటకి రా.. అంతుచూస్తామని బెదిరిస్తారు
జోగినాయుడు: మీరు ఎదుర్కొనే మరో సమస్య?
అజయ్: మమ్మల్ని అందరూ చిన్నచూపు  చూస్తారు సార్
జోగినాయుడు: నువ్వెక్కడి నుంచి వచ్చావు?
అజయ్: జమ్ముకాశ్మీర్ సార్
కృష్ణంరాజు: అవును ఈ ఉద్యోగాలు చేసేవారిలో తెలుగు వారు చాలా తక్కువ. ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌కి చెందినవారే ఎక్కువగా ఉంటారు?
తపస్: అవును సార్. మాది ఒరిస్సా. అక్కడ చదువులు, ఉద్యోగాలు తక్కువ. ఉపాధి దొరకదు. లేబర్ పని కంటే సెక్యూరిటీ జాబ్ బెటర్ కదా సార్.
నవీన్: కానీ మన తెలుగువారి పరిస్థితి అది కాదు. ఏ జాబ్ దొరకని వాడు, చేతకాని వాడు ఇట్ల గేట్ దగ్గర గార్డుగా పనిచేస్తాడనే అభిప్రాయం ఉంది.
పాషా: సెక్యూరిటీ గార్డ్ జాబ్ అంత తీసిపారేసేది కాదు సార్. మూడేళ్లుగా పని చేస్తున్నాను. గార్డ్‌గా చేరి..ఇప్పుడు అసిస్టెంట్ సూపర్‌వైజర్‌నయ్యా..
శివకుమార్: ఎన్ని చెప్పినా.. మన తెలుగోళ్ల దృష్టిలో మేం ఆఫ్ట్రాల్...సెక్యూరిటీ గాళ్లమే.
కృష్ణంరాజు: అలా అంటే ఎలా? ఆఫ్ట్రాల్ సెక్యూరిటీ గార్డ్ ఒకరోజు సెలవు పెడితే ఎంత కోటీశ్వరుడైనా వచ్చి షాపు దగ్గర కూర్చుని కాపలా కాసుకోవాల్సిందే కదా. అంటే మీరు, మీ ఉద్యోగం ఎంత ముఖ్యమైనవో తెలుస్తుంది కదా!
శివకుమార్: సార్ ‘సెలవు’ అంటున్నారు.. మాకు అసలు సెలవులే ఉండవు సార్
కృష్ణంరాజు: అదేంటి?
సాంబయ్య: అవును సార్. నెలలో అన్ని రోజులూ పనే. ఒక్కరోజు సెలవుపెట్టినా జీతం కట్.
జోగినాయుడు: మీకొచ్చే ఐదారువేల రూపాయల్లో మళ్లీ కట్‌లంటే ఎలా భయ్యా?
సాంబయ్య: అంతే సార్.
కృష్ణంరాజు: సాంబయ్యా.. నువ్వెక్కడ పనిచేస్తున్నావ్?
సాంబయ్య: ఇక్కడ్నే.. పార్కుల సార్.
జోగినాయుడు: మనలో మన మాట. పార్కులకి వచ్చే లవర్స్ మీ చేతిలో వందపెట్టి మా జోలికి రావొద్దంటారట. నిజమేనా? (నవ్వుతూ...)
సాంబయ్య: అట్ల అనేవాళ్లున్నారు సార్. కానీ వందకు ఆశపడితే ఉద్యోగం పోతుంది కదా సార్.
జోగినాయుడు: ఇక్కడ షాపింగ్ మాల్స్‌లో ఎవరు పనిచేస్తున్నారు?.
నవీన్: నేను సార్.
జోగినాయుడు: ఎక్కడ భయ్యా?.
నవీన్: జీవీకే మాల్.
జోగినాయుడు: ఓ..వావ్. అంతా కలర్‌ఫుల్. ఫుల్ ఎంజాయ్.
నవీన్: అంతసీన్ లేదు సార్. వచ్చే కస్టమర్లతో అరవడానికే సరిపోతుంది సార్. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మెటల్ డిటెక్టర్ లోపలి నుంచి రమ్మని చెబితే వినరు. పక్కనుంచి రాకూడదంటే వినరు. గట్టిగా చెబితే కళ్లెర్రచేస్తారు.
జోగినాయుడు: అక్కడికి అందరూ చదువుకున్న వాళ్లే వస్తుంటారు కదా. అలాంటి నియమాలు పాటించాలని తెలియదంటారా?
నవీన్: అదే మాకూ అర్థం కాదు సార్.
కృష్ణంరాజు: అవునూ.. బంగారం షాపుల్లో పనిచేసే సెక్యూరిటీది చాలా రిస్కీ జాబ్. మరి వారి పరిస్థితేంటి?
పాషా: అవును సార్. ప్రతిక్షణం అలెర్ట్‌గా ఉండాలి. షాప్‌కి వచ్చేది దొరలా? దొంగలా ఎవరికి తెలుస్తుంది?. అలాగని వచ్చే వాళ్లందర్నీ చెక్ చేసేంత సీన్ ఉండదు. కేవలం వారి బిహేవియర్‌ని బట్టి అనుమానించాలి.
 - భువనేశ్వరి
 ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement