హైదరాబాద్లో జగన్ సమైక్యశంఖారావం | Jagan Samaikya Sankaravam in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో జగన్ సమైక్యశంఖారావం

Published Mon, Sep 30 2013 9:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో జగన్ సమైక్యశంఖారావం - Sakshi

హైదరాబాద్లో జగన్ సమైక్యశంఖారావం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జైలు నుంచి బయటకు రావడంతో సమైక్యాంధ్ర ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది. సమైక్యవాదులు ఊహించినట్లే యువతనే జగన్ వారికి అండగా ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.   రాష్ట్రరాజధాని హైదరాబాద్లో సమైక్య శంఖారావం పూరించనున్నారు. భాగ్యనగరంలో సమైక్యవాదం వినిపించనున్నారు. యువకెరటం జగన్ విడుదల రోజునే సమైక్యవాదులు ఎన్నో ఆశలతో రాష్ట్రం నలుమూలల నుంచి జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రాన్ని విభజించవద్దని వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తూ ఉద్యమంలో పాల్గొంటున్న  నేపధ్యంలో జగన్ విడుదలవడం సమైక్యవాదులకు ఎంతో సంతోషం కలిగించింది. దాంతో జగన్పై ఎన్నో ఆశలు పెట్టుకొని వారు హైదరాబాద్ తరలివచ్చారు.

సమైక్యవాదులు ఎదురు చూసినట్లే, వారి ఆశలను నిజం చేస్తూ హైదరాబాద్లోనే భారీ ఎత్తున  సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జగన్ ఈరోజు ప్రకటించారు. రాజధానిలోనే సమైక్యవాదం వినిపిస్తామని చెప్పారు. అంతకు ముందు  గవర్నర్ నరసింహన్ను కలిశారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను సమావేశపరచాలని కోరారు.  సమైక్యవాద ఉద్యమానికి బలం చేకూరే విధంగా ఆయన ముందడుగు వేస్తున్నారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబరు 15-20 తేదీల మధ్యలో సమైక్య శంఖారావం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

తెలంగాణపై క్యాబినెట్‌ నోట్‌ తయారు కాకముందే ఇక్కడ శాసనసభను సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని కూడా ఆయన కోరారు. అలా చేస్తే ఇక్కడ జరిగే అన్యాయం దేశ ప్రజలకు తెలుస్తుందని, కేంద్రం కూడా విభజన విషయంలో వెనక్కు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయని సవివరంగా తెలియజేశారు. అందులో ప్రధానమైనది నీటి సమస్య అని తెలిపారు.  రాష్ట్రం విడిపోతే 11జిల్లాల ప్రజలు నిత్యం తన్నుకుని, కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.  రాష్ట్రం సమిష్టిగా ఉన్నప్పుడే సాగునీరు పంచుకోగలం అని స్సష్టం చేశారు. ప్రస్తుతం అత్యధికంగా ఆదాయం లభించే హైదరాబాద్ విడిపోతే అభివృద్ధి కుంటుపడిపోతుందని హెచ్చరించారు.

సమైక్యం అంటే రాయలసీమ, కోస్తానే కాదని తెలంగాణ కూడా అని స్పష్టం చేశారు. తకు తెలంగాణ, రాయలసీమ, కోస్తా కావాలని జగన్ చెప్పారు.  తెలంగాణలో కూడా సమైక్యవాదులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ప్రతి సోదరుడికీ తాను  చెబుతున్నానని, ప్రతి ఒక్కరినీ అభివృద్ధి పథంవైపు నడిపిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ  ప్లీనరీ సమావేశాల్లో  తాను చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. హోం మంత్రికి ఇచ్చిన లేఖను ఒక్కసారి చూడమని చెప్పారు. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా, అందరికీ ఆమోదనీయ పరిష్కారం చూపమని అడిగినట్లు తెలిపారు.

ఈ వ్యవస్థ మారాలి, నిజాయితో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని అన్నారు. సమైక్యవాదానికి మద్దతు పలకడం వద్ద టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి నష్టం జరుగుతుందో తనకూ అదే నష్టం జరుగుతుందని చెప్పారు. నష్టం జరుగుతందని ఓట్లూ,సీట్లూ పోతాయని, మౌనంగా ఉండలేం అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్రం విడిపోకుండా ఉండటం ముఖ్యం అని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ  ఎవరు ఏ లేఖ తెచ్చినా ఒక పార్టీ అధ్యక్షుడిగా  మొట్టమొదటి సంతకం తాను పెడతానని చెప్పారు.

ప్రజల మనసుల్లో కలిసి ఉండాలనే భావన గాఢంగా ఉందన్నారు. దానిని ఎవ్వరూ తీసేయలేరని చెప్పారు. సమైక్య శంఖారావం పేరిట త్వరలో హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు అందరూ తరలిరావాలని పిలుపు ఇచ్చారు.  రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీ అధ్యక్షుడు నిజాయితా ఈ విధంగా పిలువు ఇవ్వడం సమైక్యవాదులకు ఆనందం కలిగించింది. ఉద్యమానికి ఊపిచ్చినట్లు అయింది. ఈ  ఆయన మాట్లాడిన మాటలకు రాష్ట్రం నలుమూలల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆయన ప్రకటన సమైక్యవాదులలో ఉత్సాహం నింపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement