
సాక్షి,న్యూఢిల్లీ: నెత్తురోడుతున్న రోడ్లతో హైవేలు నరకకూపాలుగా మారుతుండటంతో కేంద్రం మేలుకుంది. 2019, జులై 1 తర్వాత తయారయ్యే కార్లు కచ్చితంగా ఎయిర్‌బ్యాగ్స్, సీట్ బెల్డ్ రిమైండర్స్, 80 కిమీ వేగం దాటితే హెచ్చరిక వ్యవస్థను పొందుపరచాలని కార్ల తయారీ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఈ నిబంధనల అమలు కాలపరిమితిని ఆమోదించిన రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ త్వరలో ఈ మార్గదర్శకాలను నోటిఫై చేయనుంది.ప్రసుతం లగ్జరీ కార్లలోనే ఈ ఫీచర్లుండగా, 2019 జులై నుంచి ప్రభుత్వం పేర్కొన్న భద్రతా ప్రమాణాలు అన్ని కార్లకూ అనివార్యం చేశారు.
ఏటా రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులు, ప్రయాణీకులు సహా పాదచారులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. 2016లో మితిమీరిన వేగంతోనే 74,000 మంది మృత్యువాత పడ్డారు. నూతన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కార్లలో అమర్చే కొత్త సిస్టమ్‌లో 80 కిమీల వేగం దాటితే ఆడియో హెచ్చరికలను జారీ చేసే వ్యవస్థను పొందుపర్చారు. వాహనం వేగం 100 కిమీ దాటితే హెచ్చరిక వ్యవస్థ నుంచి భారీ శబ్ధంతో ఆడియో హెచ్చరికలు జారీ అవుతాయి.
వాహనం 120 కిమీ వేగం దాటితే నాన్ స్టాప్ అలర్ట్స్‌తో డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. కారు రివర్స్ చేసే క్రమంలోనూ రివర్స్ అలర్ట్స్ జారీ కానున్నాయి. నూతన భద్రతా ప్రమాణాలతో రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు గణనీయంగా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment