జస్ట్ ఫర్ కిడ్‌స
అంకెలు.. అక్షరాలు.. పదాలు.. వ్యాఖ్యలు.. సూక్తులు ఏవైనా ఎక్కడైనా అలంకారమే! ఇప్పుడివి గోడలపై, రకరకాల ఫర్నిచర్ రూపంలో పిల్లల్ని పలకరిస్తున్నాయి. వీటి ద్వారా పిల్లలకు వాటిపై అవగాహన కలగడంతో పాటు వారిలో ఆయా అంశాల పట్ల ఆసక్తి కలిగించడానికి వీలవుతుందని అంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. సిటీలో ఈ ట్రెండ్ ఇప్పుడు అంకెలు, లెక్కల ప్రాశాస్త్యాన్నీ, అక్షరాలు వర్ణమాలలోని ఆనుపానుల్నీ, పదాల భావసౌందర్యాన్నీ గుర్తు చేస్తూ అలరిస్తోంది.
పదాలూ, పదబంధాలూ, చిత్రాలు, ప్రముఖుల మాటలు.. వీటిని పోస్టర్లు, ఫొటోల రూపంలో ఇప్పటి వరకు హాలు, బెడ్‌రూమ్, డ్రాయింగ్‌రూమ్, రీడింగ్‌రూమ్ గోడలకు అలంకారమయ్యేవి. ఇప్పుడవే ఫర్నిచర్ రూపంలో అలరిస్తున్నాయి. పిల్లల బెడ్‌రూమ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పేదేముంది. రంగురంగుల అక్షరాలతో అలంకరిస్తే వాళ్ల ఆనందానికి అంతే ఉండదు. మాములుగా అక్షరాలనీ అంకెలనీ పుస్తకాల్లో చూపించో లేదో పలకమీద రాయమంటే ఓ పట్టాన మాట వినరు.
అదే అక్షరాల్ని గోడలపై అందంగా కనిపిస్తే వాటిని ఏదో క్షణంలో చూస్తూ చదువుతారు. ఒకటికి పదిసార్లు చూస్తుండటం వల్ల అవి చిన్ని బుర్రల్లో పదిలమైపోతాయి. అయితే ఈ అక్షరాలనేవి గోడలమీద రాతలకే పరిమితం కాకుండా ఫర్నిచర్ రూపంలో వస్తున్నాయి. ఎక్కువగా బుక్‌ర్యాక్‌లు, టేబుల్స్, చైర్స్, బెడ్‌ల్యాంప్‌లు, ప్లవర్ వేజులు, గోడ గడియారాలు.. వంటివి అక్షర క్రమం వచ్చేలా రూపొందిస్తున్నారు. పిల్లల బంక్‌బెడ్స్‌లో ఏబీసీడీలు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు.
- విజయారెడ్డి