ఫ్యాషన్ ఫోర్‌కాస్ట్.. స్టైల్ ప్రియులకు ఈ పదం చిరపరిచితమే. రాబోయే సీజన్‌లో రాజ్యమేలనున్న కలర్స్, కట్స్, స్టైల్స్.. వగైరాలను ముందస్తుగా అంచనా వేయడమే ఫ్యాషన్ ఫోర్‌కాస్ట్. అయితే నిన్న మొన్నటి దాకా ఈ అంచనాలు అంతర్జాతీయ స్థాయి లేబుల్స్ లేదా టాప్ డిజైనింగ్ సంస్థలకే పరిమితం. ఫ్యాషన్ లవర్స్ కూడా తమ వార్డ్‌రోబ్ అప్‌డేట్ కోసం వాటినే ఫాలో అవుతుంటారు. ఈ సంప్రదాయాన్ని తిరగరాస్తూ సిటీకి చెందిన ఒక ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ ఫోర్‌కాస్ట్‌ను రూపొందించింది. అంతేకాకుండా రానున్న సీజన్‌లో రాజ్యమేలే కలెక్షన్స్‌ను సైతం ముందస్తుగా ప్రదర్శిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
..:: ఎస్.సత్యబాబు
ఏటా సీజన్ల వారీగా కలెక్షన్స్ రిలీజ్ చేయడం ప్రముఖ డిజైనింగ్ సంస్థలకు అలవాటైన విషయమే. అయితే రిలీజ్‌కు ముందుగా ఫ్యాషన్ లవర్స్‌కు ముందస్తు అంచనాలను అందజేయడమనేది అంతర్జాతీయ విపణిలో సంప్రదాయంగా ఉంది. బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటైన ‘కొచర్’ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్.. ఈ ట్రెడిషన్‌ను మారుస్తూ కొత్త ట్రెండ్ సృష్టించింది.
మన కోసం మనం...
ఫ్యాషన్ ఫోర్‌కాస్ట్‌పై కొచర్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ అబ్దుల్ అజీమ్ మాట్లాడుతూ... ‘ఫ్యాషన్ ప్రిడిక్షన్ అనేది ఇంటర్నేషనల్ డిజైనర్లకే పరిమితం ఎందుకు కావాలి? మనం అంతా వారినే ఎందుకు ఫాలో కావాలి? మన వాతావరణానికి, ట్రెడిషన్స్‌కు తగ్గట్టుగా ఫోర్‌కాస్ట్ ఉండాలంటే మనమే ఆ బాధ్యత కూడా తీసుకోవాలి అని నా ఉద్దేశం’ అని చెబుతారాయన. ఈ ఫోర్ కాస్ట్ కోసం తాము చేసిన కృషిని వివరిస్తూ... ‘గత ఏడాది సమ్మర్‌ని లీడ్ చేసిన కలర్స్, ఫ్యాబ్రిక్స్, స్టైల్స్‌ను, మూవీ ట్రెండ్స్, ఇంటర్నేషనల్ డిజైనర్ల అంచనాలను జాగ్రత్తగా పరిశీలించాం. ఫ్యాషన్ లవర్స్ ఒపీనియన్స్ తెలుసుకున్నాం. ఆయా అంశాల్లో స్టూడెంట్స్‌ని గైడ్ చేస్తూ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్ ఫోర్‌కాస్ట్ తయారు చేశాం’ అని అన్నారు.
హాట్ సమ్మర్.. గ్రేట్ కలర్..
‘ఈ ఏడాది సమ్మర్ ఫుల్ హాట్‌గా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత లైట్‌గా, అదే సమయంలో బ్రైట్‌గా ఉండే కలర్స్ డామినేట్ చేయనున్నాయి’ అంటున్న అజీమ్.. స్ప్రింగ్ సమ్మర్ కోసం తాము రూపొందించిన కలర్‌బోర్డ్‌ను వివరిస్తూ...‘వైట్ విత్ బ్లూ, లెమన్ ఎల్లో, పిస్తా గ్రీన్ లేదా సీ గ్రీన్, లెమన్ గ్రీన్, ఆరెంజ్, స్కై బ్లూ, ఆక్వా మరైన్, బేబీ పింక్, లావెండర్, బీజ్... వంటివి మరింత లేత షేడ్స్‌లో ఈ సీజన్‌లో ఫ్యాషన్ సీన్‌ను శాసించనున్నాయి’ అని అంటున్నారు. వేడి వాతావరణంలో లేత రంగులు వాడటం కొత్త విషయం కాకపోయినా, లుక్ మిస్సవ్వకుండా కొన్ని ప్రత్యేకమైన లేత రంగుల్ని క్రియేట్ చేయడం రానున్న సమ్మర్‌లో స్పెషల్ అని చెబుతున్నారు. నెక్ట్స్ సీజన్ మొత్తం ప్రింట్స్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయన్నారు. ఆర్మీ గ్రీన్ నుంచి ఇన్‌స్పైర్ అయిన ఖాకీ కలర్ షేడ్స్‌కూ మంచి ప్లేస్ దక్కనుందన్నారు.
లైట్ రైట్ ఫ్యాబ్రిక్...
చెమటను పీల్చుకునేది, శరీరానికి గాలి తగలడాన్ని అడ్డుకోని ఫ్యాబ్రిక్‌గా కాటన్ సమ్మర్‌లో అందరి నేస్తమని తెలిసిందే. అయితే అటు సౌకర్యంగానూ ఇటు ఆధునికంగానూ ఉండాలనేది ఫ్యాషన్ లవర్స్ కోరిక. అందుకే ఈ సీజన్ ఫ్యాబ్రిక్ పరంగా కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. ఆ ప్రయోగాల నుంచే పుట్టిన కాంబ్రిక్, వెస్‌కాస్‌లతో పాటు డెనిమ్, జార్జెట్, షిఫాన్, శాటిన్ బ్లెండ్ విత్ కాటన్, కాట్ స్పన్.. వంటి ప్యాబ్రిక్స్, నేచురల్ ఫైబర్‌తో రూపొందినవి ఇప్పుడు ఫ్యాషన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ‘కాటన్ ఫ్యామిలీ నుంచి సరికొత్తగా కాటన్ వాయిల్ వంటివి వస్తున్నాయి. ఇవి అటు వెదర్‌కి తగ్గట్టుగా ఉంటూనే ఫ్యాషన్ లుక్ అందిస్తాయి. లేస్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్, ఫ్లోరల్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీస్ కూడా తమదైన స్థానాన్ని దక్కించుకుంటాయి’ అని వివరించారు అజీమ్. రఫుల్స్, ఫ్రిల్స్, ట్రాన్స్‌పరెంట్ ఫ్యాబ్రిక్స్‌కూ ఆదరణ లభించనుంది. స్టైల్స్ విషయానికి వస్తే హాట్ సీజన్‌కు కుర్తీకి మించిన లుకింగ్ వేర్ లేదంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. లేయర్డ్ స్కర్ట్స్, అరేబియన్ శైలి ప్లాజో (బాటమ్‌లో లూజ్ ఫిట్), హోల్టర్ టాప్, రాపర్స్, హాఫ్ షోల్డర్ లాంగ్ గౌన్స్... వంటి డిజైన్స్ రానున్న సీజన్‌లో ఫ్యాషన్ లవర్స్‌కి క్రేజీగా మారనున్నాయని జోస్యం చెబుతున్నారు.
సిటీదే ఫోర్‌కాస్ట్
Published Mon, Feb 16 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement
Advertisement