అహ్మదాబాద్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(గిఫ్ట్ సిటీ) గాంధీనగర్‌లో టెక్‌ఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ సెంటర్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సొల్యూషన్ల వ్యూహాత్మక కేంద్రంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.
ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) పరిశ్రమలకు సంబంధించిన క్లయింట్లకు ఆధునిక సాంకేతిక సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ప్రాథమికంగా ఈ సెంటర్‌లో 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.
ప్రపంచస్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో రాష్ట్రానికున్న పటిష్టతను గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధికి అత్యుత్తమ వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. టెక్‌ఫిన్ సెంటర్ ద్వారా బీఎఫ్‌ఎస్‌ఐ క్లయింట్లకు డిజిటల్ పరివర్తనలో తోడ్పాటునివ్వనున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment