జ్యుట్ బోలే ఈకో ఫ్రెండ్లీ
సింథటిక్.. ప్లాస్టిక్.. పర్యావరణానికి అప్రియం! లెదర్.. కాటన్.. పర్యావరణానికి ప్రియం.. కానీ మన్నిక తక్కువ! అటు పర్యావరణానికి హాని తలపెట్టకుండా.. ఏళ్లకేళ్లు మన్నికనిచ్చేది జనపనారగా మనం పిలుచుకొనే జ్యూట్! ఇది అచ్చంగా లోకల్ ప్రొడక్ట్.. మన సంప్రదాయ ఉత్పత్తి ఎన్నో ఆధునిక ఉపయోగాలకు ఊతమవుతోంది. తన శ్రమతో జ్యూట్ ప్రొడక్ట్స్‌ను ఓ పరిశ్రమలా నెలకొల్పాలని ఇరవై ఏళ్లుగాప్రయత్నిస్తోంది చంటి ప్రసన్న కేంద్రం వ్యవస్థాపకురాలు లక్ష్మీవాసన్.. ఆ కార్ఖానా కథ గురించి..
లక్ష్మీవాసన్ స్వతహాగా రచయిత్రి. కథలు, కవితలు ఎన్నో రాశారు. వాటన్నిటికీ మూల వస్తువు అణగారిన జనమే. ఏ ఆసరాలేని స్త్రీల గురించే ఆమె ఆలోచనలు. విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు.. ఇంకా ఇతర కారణాలతో ఒంటరిగా బతుకుతున్న స్త్రీల కోసం ఏదైనా చేయాలని ఆరాటపడ్డారామె. అప్పుడే జనపనార గురించి తెలుసుకున్నారు. దాన్నే ఈ ఆడవాళ్లందరికీ ఆర్థికంగా ఊతమిచ్చే వనరుగా మలిచారు. అలా పుట్టిందే చంటి ప్రసన్న కేంద్రం.
నెగ్లెక్టెడ్ మెటీరియల్.. డిమాండెడ్ ప్రొడక్ట్స్
పైన చెప్పిందంతా 1993 నాటి సంగతి. అప్పటికీ మనదేశంలో విస్తారంగా పండే జనపనారను పట్టించుకున్న వాళ్లెవరూలేరు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల తర్వాత మన దగ్గర ఎక్కువగా ఉండే దీన్ని మనమూ ఏనాడూ లక్ష్య పెట్టలేదు. లక్ష్మీ వాసన్ మాత్రం దృష్టిపెట్టారు. జనుము ఉరఫ్ జ్యూట్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయి? వాటితో ఎన్ని వస్తువులు తయారుచేయొచ్చో ఓ అధ్యయనం చేశారు. జ్యూట్ ప్రొడక్ట్స్‌లో తన ఇంటి చుట్టుపక్కల కొంతమంది మహిళలకు శిక్షణ ఇప్పించారు. నేషనల్ సెంటర్ ఫర్ జ్యూట్ డైవర్సిఫికేషన్ సపోర్ట్‌తో ఈ మహిళలకు జనుమును సప్లయ్ చేస్తూ వాళ్ల చేత ముందుగా క్యారీబ్యాగ్స్, పౌచెస్, ఉత్తరాలు, బిల్లులు గట్రా పెట్టుకునే వాల్ హ్యాంగింగ్స్, చిన్న పర్సులు, ఫైల్ ఫోల్డర్స్, లేస్‌లు, షోకేస్ పీస్‌లు తయారు చేయించారు. ఒకరకంగా చెప్పాలంటే జ్యూట్ ఉత్పత్తులను హైదరాబాద్ లో మొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు. వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఆసక్తి ఉన్న మరికొంత మంది స్త్రీలకూ శిక్షణ ఇప్పించారు. డ్వాక్రా బజార్లో వీళ్లు తయారుచేసిన ఉత్పత్తులను మార్కెట్ చేశారు. ఇదంతా లక్ష్మీవాసన్ రామంతాపూర్‌లో ఉన్నప్పటి విషయం.
ఇప్పుడు.. స్వయం ఉపాధి కేంద్రం
చంటి ప్రసన్న కేంద్రం పన్నెండేళ్ల కిందట మేడ్చల్‌కు చేరుకుంది. రామంతాపూర్‌లోనూ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. మండల ప్రాంతానికీ తన కాన్సెప్ట్‌ను విస్తరించి జ్యూట్ ఉపయోగాన్ని పెంచి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు లక్ష్మీవాసన్. దానికి తగ్గట్టుగానే ఆర్థిక స్వావలంబన లేని మహిళలకు ఇందులో శిక్షణ ఇప్పించి జ్యూట్ ఉత్పత్తుల తయారీతో ఎంతోకొంత నిలబడేలా చేస్తున్నారు. అంతేకాక విద్య, వైద్య, న్యాయ రంగాల్లో రాణించిన మహిళలతో వీరికి ఆయా రంగాలపై అవగాహ న కల్పిస్తున్నారు.
కాలంతో పరుగు..
మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఉత్పత్తులనూ మారుస్తోంది చంటి ప్రసన్న కేంద్రం. కేవలం బ్యాగులు, వాల్ హ్యాంగిగ్స్ వంటి వాటికే పరిమితం కాకుండా సూట్‌కేస్‌లు, స్టోలర్స్, డోర్‌మ్యాట్స్, కర్టెన్స్, టేబుల్‌క్లాత్స్, టేబుల్ కార్నర్స్ లాంటివీ తయారు చేయిస్తోంది. ‘మా పెద్దమ్మాయి రాజీవి ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసేది. తను ఒకసారి లెదర్ స్టోలర్ తెచ్చింది. అరే.. ఇలాంటిది జ్యూట్‌లోనూ తయారు చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు ఆ స్టోలర్ మోడల్ తీసుకొని జ్యూట్ స్టోలర్‌ను తయారు చేశారు మా కేంద్రంలోని ఆడవాళ్లు. వాటికి ఆస్ట్రేలియాలో ఎంత డిమాండుందో’ అని చెప్పారు లక్ష్మీవాసన్. లక్ష్మీ చిన్న కూతురు రజని ఆస్ట్రేలియాలో ఉంటుంది. అమ్మ చేస్తున్న ప్రయత్నం మెచ్చి, ఆ వస్తువులు నచ్చి వాటిని ఆస్ట్రేలియాలకు తీసుకెళ్లింది. అక్కడ వాటికి ఊహించని డిమాండ్ రావడంతో ఇప్పుడూ ఇక్కడి ఉత్పత్తులను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నారు లక్ష్మీవాసన్.
చేయాల్సింది ఎంతో..
‘ఫారిన్ కంట్రీస్‌లో జ్యూట్‌కి చాలా క్రేజ్. ఆ కమర్షియల్ సక్సెస్‌ను మనమూ చూడాలంటే ఇక్కడా దీని వాడకాన్ని బాగా ప్రాచుర్యంలోకి తేవాలి. ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీగా పనిచేస్తూ ఎంతోమంది స్త్రీలకు ఆసరాగా నిలబడుతున్న చంటి ప్రసన్న కేంద్రం వంటి సంస్థలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఇప్పటి వరకు ఈ కేంద్రం కొన్ని వందల మందికి జ్యూట్ వస్తువుల తయారీలో శిక్షణనిచ్చింది ఉచితంగా. ఇంకా ఇస్తూనే ఉంది. మొన్ననే రామంతాపూర్, ఇక్కడ కలిపి 50 మంది దాకా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. వాళ్లందరికీ కొన్న రేట్‌కే జ్యూట్‌ను ఇచ్చి వస్తువులను తయారు చేయిస్తున్నాను. మార్కెటింగ్ చేసుకోలేనివారికి నేనే ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్ పెట్టించి అమ్మిస్తున్నాను.
ఇంట్లో వృద్ధులు కూడా ఎవరి మీద ఆధారపడకుండా రోజుకో గంట జ్యూట్ లేసులు అల్లి యాభై రూపాయలు సంపాదించుకోవచ్చు. ఏ ఫండ్స్ లేకుండా ఇంతమందికి ఆధారంగా నిలుస్తున్న మా ఈ శ్రమను ఓ పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం సహాయం అందిస్తే దీన్ని వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను’ అని తన మనసులో మాట చెప్పారు లక్ష్మీవాసన్. ఆమె కోరుకున్నట్టుగానే చంటి ప్రసన్న కేంద్రం ఓ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌గా మారి ఎందరో మహిళలకు ఉపాధితోపాటు పర్యావరణ పరిరక్షణ జరగాలని ఆకాంక్షిద్దాం!.
- సరస్వతి రమ