లగడపాటిని ఏకాకి చేస్తారా?
అందరిదీ ఒకదారైతే ఉలిపి కట్టెది మరొకదారి అన్న నానుడి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రా అక్టోపస్గా పేరుగాంచిన ఆయన పండగపూట 'తనదైన శైలి' ప్రదర్శించారు. హస్తినలో హడావుడి చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎంపీ పదవికి తాను చేసిన రాజీనామాను ఎలాగైనా ఆమోదింపజేసుకుంటానని బీరాలు పలికి చివరకు తుస్సుమనిపించారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు లగడపాటి ప్రకటించారు. దీన్ని ఇప్పటివరకు ఆమోదించకపోవడంతో స్పీకర్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజీనామాలు చేసిన తోటి ఎంపీలతో కలిసి అంతకుముందు స్పీకర్ ఆఫీస్కు వెళ్లిన లగడపాటి- దసరా రోజున మాత్రం ఒంటరిగా ముందడుగు వేశారు. తానొక్కడికే చిత్తశుద్ధి ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు. స్పీకర్ లేకపోవడంతో తన ఆవేదనను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు.
తన రాజీనామా ఆమోదం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దయాదాక్షిణ్యాలపై ఆధారపడివుందని లగడపాటి కుండబద్దలుకొట్టారు. వేరే రాష్ట్రాల ఎంపీలు రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించారని, తమవి మాత్రంపెండింగ్లో పెట్టారని వాపోయారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తే యూపీఏ ప్రభుత్వ బలం 213కు పడిపోతుందన్నారు. రాష్ట్రంలో సమన్యాయం ఎవరు కోరుకోవడం లేదని, సమైక్యాంధ్రే కావాలనుకుంటున్నారని చెప్పారు. మూడు ప్రాంతాలు అంగీకరిస్తేనే రాష్ట్ర విభజన చేయాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును మూడు ప్రాంతాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే యూపీఏ ప్రభుత్వానికి ముప్పు తప్పదన్న భయంతో కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. సీఎం కిరణ్, సీనియర్ నేతలను అస్త్రాలుగా ప్రయోగించి రాజీనామాలపై వెనక్కు తగ్గేలా ఎంపీలపై ఒత్తిడి తేవాలని తలపోస్తున్నట్టు తెలుస్తోంది. దూకుడు ప్రదర్శిస్తున్న లగడపాటిని ఒంటరిని చేసేందుకు కూడా అధిష్టానం వెనుకాడదన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల దూకుడుకు కళ్లెం వేసిన కాంగ్రెస్ పెద్దలు తాజాగా ఎంపీలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఎంపీలు రాజీనామాలకు కట్టుబడతారా, అధిష్టానంతో రాజీ పడతారా అనేది వేచి చూడాల్సిందే!