నవయువం: ఆట అపూర్వం ఆలోచన ఆదర్శం
ఫుట్‌బాల్ వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవడం కన్నా నా చిన్ని ప్రపంచంలో బెస్ట్‌మ్యాన్ అనిపించుకోవడమే గొప్ప అనిపిస్తుంటుంది. కెరీర్ అంతా అయిపోయాక... నేను మిగుల్చుకునేది ఏమిటి అని ఆలోచించినప్పుడు... ‘మెస్సీ ఒక డీసెంట్ గై’ అనిపించుకుంటే చాలనిపిస్తుంది’.
అతడి ఆట అపూర్వం... అతడికున్న ఆదరణ అద్వితీయం... అతడి సంపాదన, పేరు, ఫేమ్... అన్నీ అఖండమైనవే. వీటన్నిటితో పాటు అతడి ఆలోచన ఆదర్శప్రాయం. ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ, నిండుకుండలాంటి వ్యక్తిత్వంతో వ్యవహరిస్తూ, మంచి ఆటగాడిగానే కాకుండా ఆలోచనాపరుడిగా కూడా పేరు తెచ్చుకున్న యువకుడు లయనల్ మెస్సీ. అర్జెంటీనాకు చెందిన ఈ ఫుట్‌బాల్ క్రీడాకారుడి ఆటతీరు గురించి ఫుట్‌బాల్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కానీ ఇతడి ఆలోచన తీరు గురించి ఎంతైనా చెప్పవచ్చు.
మెస్సీ ఆట తీరే కాదు.. అతడి ఆటిట్యూడ్ కూడా ఆదర్శప్రాయమే! ఫుట్‌బాల్ అంటే ఆసక్తిలేకపోయినా, మెస్సీ ఆలోచన తీరు మాత్రం ఆసక్తిదాయకమైనదే. ‘అన్‌బిలీవబుల్ టాలెంట్.. ఇన్ క్రెడిబుల్ హంబుల్..’ ప్రఖ్యాత టైమ్ మ్యాగజిన్ మెస్సీకి ఇచ్చినకితాబు ఇది. 2012లో ప్రపంచంలో అత్యంత ప్రభావాత్మకమైన వందమంది వ్యక్తుల జాబితాలో 24 ఏళ్ల మెస్సీకి స్థానం ఇచ్చింది టైమ్స్ మ్యాగజీన్. ఈ జాబితాలో అత్యంత పిన్నవయసులో స్థానం సంపాదించిన వ్యక్తిగా, ఇందులో స్థానం దక్కిన ఏకైక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా తన నైపుణ్యంతో ప్రభావమంతమైన వ్యక్తిగా ఎదగడం ఒక ఎత్తయితే.. ‘హంబుల్’ (విధేయత) విషయంలో మెస్సీకి గుర్తింపు ఎలా దక్కింది? ప్రత్యేకించి పాతికేళ్ల లోపు వయసులోనే అద్భుతమైన క్రేజ్, లెక్కలేనంత డబ్బు చేతికి వచ్చినా.. వాటన్నింటికీ మించి అతడి ‘విధేయత’ కు గుర్తింపు రావడం అంటే.. అది మెస్సీ వ్యక్తిత్వంలోని గొప్పదనమే! మరి గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తున్న అతడి నియమాలు ఏమిటి? అతడి ఆలోచనలు ఏమిటి? అనే విషయాల గురించి పరిశీలిస్తే.. ఎంత పేరున్న ఆటగాడయినా.. మెస్సీ మాటల్లో బిడియం, చేష్టల్లో సౌమ్యం కనిపిస్తుంది. వివిధ సందర్భాల్లో మెస్సీ వ్యవహరించిన తీరే దీనికి రుజువు.
డబ్బు స్ఫూర్తి కాలేదు..
ప్రస్తుతం సాకర్ ప్లేయర్‌లలో అత్యంత ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వారిలో మెస్సీ ముఖ్యుడు. కానీ... ‘మనీ నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ కాదు. డబ్బు సంపాదించుకోవడంలో చాలా సౌలభ్యాలు ఉంటాయని అర్థమైంది. కానీ సంతోషం మాత్రం ఫుట్‌బాల్‌తోనే ముడిపడి ఉంది. ఫుట్‌బాల్‌పై నాకున్న ఇష్టమే కావల్సినంత స్ఫూర్తిని ఇస్తోంది. ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా సంపాదన లేకపోయినా... ఫుట్‌బాల్‌పై ప్రేమ ఇసుమంతైనా తగ్గేది కాదు...’ అంటూ డబ్బు గురించి పట్టింపులేదని అంటాడు మెస్సీ.
టీమ్ స్పిరిట్..
‘వ్యక్తిగత రికార్డులు, రివార్డుల కన్నా.. టీమ్ పరమైన సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎన్ని గోల్స్ చేశాను అనేదానికన్నా.. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్ ఎన్ని గోల్స్ తేడాతో గెలిచిందనే లెక్కనే పరిశీలిస్తుంటాను...’ అంటాడు మెస్సీ.
హోమ్‌సిక్ ఉంది..
‘నా మాతృదేశంలో తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఉండటాన్ని ఆటకోసం త్యాగం చేస్తున్నాను! నా ఇష్టాన్ని త్యాగం చేస్తున్నాను. మరో లక్ష్యం కోసం ఈ త్యాగాన్ని చేస్తున్నాను. ఏది చేసినా నా కల సాకారం చేసుకోవడం కోసమే!’ అంటూ హోమ్‌సిక్ గురించి చిన్నపిల్లాడిలా చెబుతూ తర్వాత తనను తానే ఊరడించుకుంటాడు.
హ్యాపియెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్..
మెస్సీకు ఉన్న స్టార్ హోదాను చూసి అందరూ ఇలా అనుకుంటుండవచ్చు. మెస్సీ కూడా అప్పుడప్పుడు ఇలాగే ఫీలవుతాడట. ‘నాకు మరీ ఆనందం కలిగిన సందర్భాల్లో ‘ఐ యామ్ ది హ్యాపియెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్’ అనుకుంటాను. ఇలా అనుకోవడంతో ఆ సంతోషం రెట్టింపు అవుతుంది...’ అంటూ సంతోషానికి ఒక సీక్రెట్ చెబుతాడు మెస్సీ.
- జీవన్