
నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రి ప్రభుత్వ వ్యవహారాలలో బిజీబిజీగా ఉంటే, కొడుకు పార్టీ వ్యవహారాలు చక్కదిద్దడంలో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. ఎన్నికల సందర్భంలోగానీ, మరే ఇతర అంశాల విషయంలోనైనా అసంతృప్తి చెందిన నేతలను బజ్జగించే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పార్టీని పటిష్టపరచాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొందరు తనను పనికట్టుకొని ఓడించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో తెలుగు దేశం పార్టీ రెండుగా చీలిపోయింది. ఓ వర్గం పార్టీకి దూరం కానుంది. అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర తనకన్నా తన ప్రత్యర్థివర్గం మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతోందని తుమ్మల కలత చెందుతున్నారు. ఈ పరిస్థితులలో తుమ్మల తన వర్గంవారితో కలసి టిఆర్ఎస్లో చేరనున్నట్లు తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కూడా తుమ్మల కలిసినట్లు తెలిసింది.
ఒక పక్క తుమ్మల టిఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరుగుతుంటే, ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిధంగా ‘తుమ్మలన్నా..! రా కదలిరా..!! బంగారు తెలంగాణలో ఖమ్మం జిల్లా అభివృద్ధి నీతోనే సాధ్యం’ ఇట్లు తుమ్మల అభిమానులు.. అంటూ సత్తుపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. తుమ్మల అనుచరులు కూడా పార్టీని వీడేందుకు గ్రామగ్రామాన సమాలోచనలు జరుపుతున్న నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీలు వెలువడటం చర్చనీయాంశమైంది. పార్టీ పుట్టినప్పటి నుంచి వివిధ హోదాలలో, పదవుల్లో పని చేసినవారు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటా అన్న ఆలోచనలో పడ్డారు. తుమ్మల పార్టీ మారితే ఖమ్మం జిల్లాలో టిడిపి కోలుకోవడం కష్టం. అంతేగాక ఈ ప్రభావం తెలంగాణలోని ఇతర జిల్లాలపై కూడా పడే ప్రమాదం ఉంది.
ఈ నేపధ్యంలో నారా లోకేష్ రంగంలోకి దిగారు. తుమ్మల పార్టీ మారకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరితో చెప్పిస్తే అతను వింటారో వారితోనే చెప్పించాలనుకున్నారు. తుమ్మల పార్టీ మారకుండా బుజ్జగించమని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణ మూర్తిని లోకేష్ కోరారు. ఏవిధంగానైనా తుమ్మల టిడిపిని విడువకుండా ఉండేందుకు తన ప్రయత్నాలు తను చేస్తున్నారు.
- శిసూర్య