అయిననూ... టచ్ మీ నాట్!
బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఇంకా నరేంద్ర మోడీ వ్యవహారంలో అలక వీడినట్లు కనిపించటం లేదు. మోడీ అభ్యర్థిత్వంపై అద్వానీ కొంతవరకు రాజీపడ్డా మనస్పూర్తిగా సమర్థించడం లేదన్న విషయం మరోసారి బయటపడింది. ప్రధానమంత్రి అభ్యర్ధిగా మోడీ పేరును ఖరారు చేస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో మొదట విభేదించిన అలకబూనిన అద్వానీ.. ఆ తరువాత బుజ్జగింపులు,...చర్చల అనంతరం పార్టీ నిర్ణయాన్ని అంగీకరించారు. ఆతర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించిన బీజేపీ భీష్ముడు .... మోడీపై ప్రశంసల జల్లు కూడా కురిపించారు.
అయితే మోడీ విషయంలో.... అద్వానీ ఇప్పట్లో మెట్టు దిగేలా కనిపించట్లేదు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధిగా మోడీ పేరును ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సారిగా వీరిద్దరూ ఒకే బహిరంగ వేదికపై దర్శనమిచ్చారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో బుధవారం జరిగిన బహిరంగ సభలో మోడీ, అద్వానీల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. అద్వానీ ప్రియశిష్యుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ సూచకంగా అద్వానీకి పాదాభివందనం చేయగా ఆయనను ఆలింగనం చేసుకున్న అద్వానీ.. ఆతర్వాత మోడీ తన పాదాలకు నమస్కరించినప్పుడు ఏ విధమైన స్పందన లేకుండా ఎటో చూస్తూ ఉండిపోయారు.
వేదికపై మోడీ వినమ్రంగా వంగి చేతులు జోడించి ఆశీస్సులు కోరగా, అద్వానీ ఆయన వైపు చూడకుండానే నమస్కరించడంతో.. పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. ఈ సంఘటనపై మోడీతో పాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అయినా మోడీ మొహంపై నవ్వు పులుముకుని సర్దుకున్నారు. అంతటితో సరిపెట్టని అద్వానీ.... తన మాటలతో పరోక్షంగా మోడీపై విమర్శలు చేశారు. పార్టీ కార్యకర్తలు కష్టించి పనిచేయడంవల్లే బీజేపీ నేడు ఇంతటి స్థితికి చేరుకుందని, అంతేకానీ నాయకుల అనర్గళ ఉపన్యాసాల వల్ల కాదని అద్వానీ చురకలు అంటించారు.
మొత్తం మీద పార్టీ కార్యక్రమాల్లో అద్వానీ పాల్గొంటున్నా... మోడీ విషయంలో మాత్రం ఇంకా సానుకూలంగా లేరనే విషయం మరోసారి స్పష్టం అవుతోంది. ఇద్దరు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నప్పటికీ పార్టీ విధాన నిర్ణయంపై ఉభయులు ఏకాభిప్రాయానికి వచ్చారనే సంకేతాలు మాత్రం వారి కలయిక ఇవ్వకపోవడం గమనార్హం.