గర్ల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్...
ప్రస్తుతం కుర్రకారు 24 గంటలూ మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లో స్టేటస్‌లు, చాటింగ్‌లతో చాలా బిజీగా ఉంటున్నారు. రాత్రుళ్లు నిద్ర నటిస్తూ, దుప్పట్లు ముసుగేసుకుని అందులో నుంచే మెసేజ్‌లు పంపిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ అయితే ఇక ప్రపంచాన్నే కాదు తమ గురించి తామే మర్చిపోయేంత బిజీగా ప్రవర్తిస్తారు. యూత్‌లో కామన్‌గా కనిపించే ఇటువంటి కాన్సెప్ట్‌తో తీసినదే 'now a days' షార్ట్ ఫిల్మ్.
ఇంజనీరింగ్ చదివిన నెల్లూరువాసి శశిధర్‌రెడ్డి పర్లపల్లి ప్రస్తుతం బెంగళూరు ఐబీఎంలో పనిచేస్తున్నాడు. ‘మోరల్ వాల్యూస్‌కి విలువిచ్చే అక్కినేని నాగేశ్వరరావుకి ఈ చిత్రాన్ని డెడికేట్ చేశా. లైఫ్‌లో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని ఎవరో ఈ-మెయిల్ చేస్తే, దానిని డెవలప్ చేసి తీసిందీ చిత్రం. ఏడాది కష్టపడ్డా. రేణూదేశాయ్, ఆది, నరేష్ తదితర సినీ ప్రముఖులు ఈ చిత్రం బాగుందంటూ ట్వీట్ చేశారు’ అని శశిధర్ చెప్పారు.
స్టోరీ: శ్రుతికి అరుణ్ మెసేజ్ పంపడంతో ఈ చిత్రం కథ మొదలవుతుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసు కోకుండానే రోజూ మెసేజెస్ ఇచ్చుకుంటూనే ఉంటారు.
అరుణ్ మాటలను బట్టి అతను ఐఐటీ చదువుతున్నాడనుకుంటుంది శ్రుతి. కొన్ని రోజులకు తాను చేస్తోంది తప్పేమో అనుకుంటాడు. తాను అరుణ్ కాదని, ఐఐటీ చదవడం లేదని శ్రుతికి వాస్తవం వివరిస్తాడు. దానికి.. ‘నేను శ్రుతి కాదు. నీ ఫ్రెండ్ రాముని’ అంటూ రిప్లై వస్తుంది. కోపంతో ఊగిపోతున్న అరుణ్.. పక్క రూమ్‌లోనే ఉన్న రాముని కొట్టడానికి వెళతాడు. డోర్ తియ్యగానే.. రూమ్‌లో ఉన్నవాళ్లంతా హ్యాపీ బర్త్‌డే అంటూ విష్ చేస్తారు. ‘ఏరా.. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నీ బర్త్‌డే కూడా మర్చిపోతావా’ అంటూ అంతా కలసి హాయిగా నవ్వేసుకొంటారు.
కామెంట్: యూత్ చాలావరకు మొబైల్ ఫోన్ మాయలో పడి ఏది వాస్తవమో కూడా గ్రహించకుండా విలువైన సమయం వృథా చేస్తున్నారు. టెక్నాలజీని అవసరానికి మించి వాడితే నష్టపోయేది లైఫే అనే మెసేజ్ ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. ఈ ఫిల్మ్ అవార్డులు కూడా అందుకుంది.
డా. వైజయంతి