బొత్సకు పెన్మత్స షాక్ | penmatsa sambasiva raju gives shock to botsa satyanarayana | Sakshi
Sakshi News home page

బొత్సకు పెన్మత్స షాక్

Published Sat, Mar 15 2014 9:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

బొత్సకు పెన్మత్స షాక్ - Sakshi

బొత్సకు పెన్మత్స షాక్

ఒకప్పటి తన రాజకీయ గురువు అయిన పెన్మత్స సాంబశివరాజును చిన్నచూపు చూసిన ఫలితం పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.. ఉరఫ్ సత్తిబాబుకు ఇప్పుడు తెలిసొస్తోంది. నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించి, సాంబశివరాజును ఒకప్పుడు తీవ్రంగా అవమానించిన బొత్సకు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి వైఎస్ఆర్సీపీలో చేరితే, తాజాగా బొత్స మరో ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కూడా అదే బాటలో నడిచారు. వీరిద్దరి చేరిక వెనుక సాంబశివరాజే ఉన్నారని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో కురువృద్ధుడి లాంటి సాంబశివరాజు ప్రస్తుతం విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు ఇప్పించి, ఒక రకంగా విజయనగరం జిల్లా మొత్తమ్మీద తన కుటుంబ ఆధిపత్యాన్ని చాటాలన్న తపన బొత్స సత్యనారాయణకు చాలా రోజుల నుంచే ఉంది. జడ్పీ చైర్ పర్సన్ గా పనిచేస్తున్న ఆయన భార్య ఝాన్సీ లక్ష్మిని ఎంపీ పదవికి పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆదేశిస్తే, మళ్లీ జడ్పీ పదవిని తన కుటుంబానికే ఇవ్వాలన్న షరతుతో అప్పట్లో బొత్స అంగీకరించారు. అలాగే, చీపురుపల్లి స్థానాన్ని తనకు తానుగా ఇచ్చిన మీసాల నీలకంఠం నాయుడితో ఎచ్చెర్ల కూడా ఖాళీ చేయించారు. ఒకరకంగా ఆయనను అవమానించి, ఈసారికి పోటీ నుంచి తప్పిద్దామనుకున్న బొత్సకు.. నీలకంఠం నాయుడు గట్టి షాకే ఇచ్చారు.

పోటీ మాత్రమే విరమించుకుంటారనుకున్న నాయుడు ఏకంగా పార్టీనే వీడిపోవడంతో బొత్స తీవ్ర ఆందోళన చెందారు. కోల్పోతున్న పట్టును నిలబెట్టుకోడానికి తీవ్ర ప్రయత్నాలే చేశారు. నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోతున్న విషయాన్ని తెలుసుకుని తెర వెనుక చాలా మంత్రాంగం నడిపారు. అటు మీసాల నీలకంఠంనాయుడిని, ఇటు బెల్లాన చంద్రశేఖర్, ఆయన అనుచరుల్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పిలిచి మాట్లాడారు. బంధుత్వం కలిపి ఒత్తిడి చేశారు. ఫోన్లు చేసి ప్రాధేయపడ్డారు. రకరకాలుగా ప్రలోభ పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను హుటాహుటిన చీపురుపల్లికి చేరుకుని, ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడే మకాం పెడతానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, బొత్స సత్యనారాయణ ఇక్కడే పోటీ చేస్తారని నేతలతో ప్రెస్‌ మీట్ పెట్టి చెప్పించారు. వదిలి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. దానికీ ఏమాత్రం స్పందన కనిపించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement