బర్డ్ లవర్స్ | peoples are enjoyed with Bird Watching Tours | Sakshi
Sakshi News home page

బర్డ్ లవర్స్

Published Wed, Nov 5 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

బర్డ్ లవర్స్

బర్డ్ లవర్స్

ఎప్పుడు చూసినా పని.. పని. దానితో బిల్డయ్యే ఒత్తిడి. కాదంటే... ట్రాఫికర్.. కూడా వచ్చే పొల్యూషన్. ప్రకృతిలోని అందాలు మాయమై... ఆహ్లాదం ఆవిరైన కాంక్రీట్ జంగిల్‌లో ఇంతకంటే ఏం ఊహించగలం! పచ్చదనపు పరిమళాలు... వాటిపై విహరించే పక్షి జాతులు... ఓహ్! తలుచుకొంటేనే అర్థమవుతుంది ఎంతగా మిస్సవుతున్నామో సహజ సౌందర్యాన్ని.

సిటీవాసుల ఊహలకే పరిమితమైన ఈ ‘అందాన్ని’ అలా అలా ఉల్లాసంగా ఆసాంతం ఆస్వాదించేయవచ్చంటుంది ‘బర్డ్ వాచర్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’. ముప్ఫై నాలుగేళ్ల కిందట నగరంలో ప్రారంభించిన ఈ సొసైటీ సభ్యులు రెగ్యులర్‌గా బర్డ్ వాచింగ్ టూర్స్‌కు వెళ్లి.. పక్షుల కిలకిలా రావాలతో మైమరిచిపోతున్నారు.
 
ప్రపంచంలో బాగా పాపులర్ హాబీ... పక్షులను వీక్షించడం. పక్షుల్లో పది వేలకు పైగా జాతులున్నాయనేది అంచనా. దానికి తగ్గట్టుగానే వాటి ప్రేమికులు... పరిశీలకులూ ఉన్నారు. అమెరికాలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకరు బర్డ్ వాచర్! భారత్‌లోనూ ప్రతి నగరంలో ఈ సొసైటీలున్నాయి. కొత్త పక్షి జాడ కనుక్కోవడం, వాటిని తొలిసారి చూసిన అనుభూతి పంచుకోవడం వీరి ప్రధాన యాక్టివిటీ. 1980లో ఆశిశ్ పిట్టి, తేజ్ కుమార్, షాఫాత్ ఉల్లా తదితర పక్షి, పర్యావరణ ప్రేమికులు కొందరు కలిసి బీఎస్‌ఏపీ ప్రారంభించారు. ‘ప్రపంచ పక్షి జాతుల్లో 12 శాతం.. అంటే దాదాపు 1000 రకాలు భారత్‌లో ఉన్నాయి. 20 గ్రాముల బరువుండే  తేనె పిట్ట నుంచి 5 కేజీల బరువుండే రాబందు వరకు వీటిలో భాగమే.

ఇదీ లెక్క...
ఇంగ్లాండ్, అమెరికాల్లోని బర్డ్ సొసైటీలు వందల ఏళ్ల నాటివి. వారిలా మన వద్ద పక్షులకు సంబంధించిన కచ్చితమైన రికార్డులుండవు. నాకు గుర్తున్నవరకు... 1960లో బాలానగర్ దాటితే వైల్డ్‌లైఫ్‌లోకి ఎంటర్ అయినట్టే. ఇప్పుడు ల్యాంకోహిల్స్ ప్రాంతంలో కాజాగూడా, టోలీచౌకీలో చిరుతపులి కనపడటం అప్పుడు సాధారణం. సిటీ విస్తరిస్తున్నప్పుడు అడవులు అంతరించటమూ సహజమే. ఈ క్రమంలో చెరువులూ మాయమయ్యాయి. ఫలితంగా... వాటిని ఆధారంగా చేసుకున్న జీవులు కూడా మాయమవుతాయి. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టు పక్కల 100- 120 రకాల పక్షులు చూడగలం. 1990లో ఇళ్ల చుట్టూ కింగ్‌ఫిషర్  సహా ఒక డజన్ పక్షులు కనిపించేవి. ఇప్పుడు బుల్‌బుల్ , తేనెపిట్ట మినహా వేరే కనిపిం చటం లేదు’ అంటారు బీఎస్‌ఏపీ హానరీ సెక్రటరీ షాఫత్‌ఉల్లా.

నెలలో ఓ ఆదివారం...
ప్రతినెలా ఒక ఆదివారం తప్పకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో బర్డ్ వాచింగ్ టూర్ ఉంటుంది. జూ, నర్సాపూర్ అడవి, అనంతగిరి హిల్స్, పోచారం, గండిపేట్, షామీర్‌పేట్, హిమాయత్‌సాగర్... ఇలా విజిట్ చేసి అక్కడి పక్షులు, వాతావరణానికి ముప్పు కలిగించే అంశాలుంటే వెంటనే అటవీ శాఖవారికి సమాచారం ఇస్తారు ఈ సొసైటీ సభ్యులు. అలాగే వారంలో ఓ రోజు జర్మన్ సెంటర్ సహకారంతో అక్కడ పక్షులు, పర్యావరణానికి సంబంధించిన చిత్రాలు, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ల వంటివి నిర్వహిస్తారు. ఏటా జనవరిలో రాష్ట్రంలోని వెట్ ల్యాండ్స్ సర్వే చేస్తారు. ఈ వివరాలన్నింటితో ‘పిట్ట’ అనే ఓ ఆన్‌లైన్ మ్యాగజైన్ కూడా ముద్రిస్తున్నారు.
 
లివ్.. లెట్ లివ్...
జంతువులు, పక్షులకు కూడా మనలాగే భూమి మీద బతికే హక్కు ఉంది. అనేక కారణాలతో వాటి ఆవాసాలు మాయమవుతున్నాయి. అవి ఎక్కడా ఆవాసం ఏర్పరచుకొనే వీలు లేకుండా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో వాటి హక్కులు, రక్షణ కోసం గళమెత్తడమే మా లక్ష్యం అంటారు బర్డ్ వాచర్స్. పక్షుల పరిరక్షణకు పెద్దగా ఏమీ చేయాల్సిన పనిలేదని... ప్రతి ఇంట్లో ఓ చెట్టు పెంచితే చాలనేది వీరి అభిప్రాయం. ప్రస్తుతం 350 మంది సభ్యులున్న ఈ సొసైటీలో చేరాలంటే జ్ట్టిఞ://ఠీఠీఠీ.ఛట్చఞ.జీ/ను బ్రౌజ్ చేయవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement