సిటీకి కొత్తందం!
►400 నగరంలో నెలకు జరిగే ప్లాస్టిక్ సర్జరీలు
►60% ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొనేవారిలో అబ్బాయిల సంఖ్య
►500 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 40 ఏళ్ల పైబడ్డవారు
►3500 ఏడాదిలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 30 ఏళ్లలోపు యువకుల సంఖ్య
అందమనేది తాత్కాలికం కాకూడదు.. అది శాశ్వతంగా మనకే సొంతం కావాలి. ఇన్నాళ్లూ ఇలా ఉండిపోవచ్చు, కానీ ఇకపై మనల్ని చూస్తే కళ్లు తిప్పుకోకూడదు.. అందరి దృష్టినీ ఆకర్షించాలి. బ్యూటీపార్లర్లలో ఫేషియల్సూ, మేకప్ ఆర్టిస్టుల క్రియేటివిటీ తాత్కాలికం.. అందం మనవద్ద లేదనేది గతం. అలా ఉండకూడదనుకుంటే ఓ ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదిద్దాం.. యవ్వనం మరింతకాలం పదిలంగా ఉండాలంటే వేరే మార్గం లేదు.. ఇదీ నగర యువత ఆలోచన.
కళ్లూ, ముక్కూ, పొట్ట, హెయిర్‌స్టైలూ ఇవన్నీ సహజత్వంలో కాస్త బాగాలేకపోవచ్చు. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు కదా అంటున్నారు కొత్తతరం యువత. అందంగా ఉన్నామంటే దాన్నుంచి వచ్చే ఆత్మవిశ్వాసం కూడా బోల్డెంత ఉంటుందనేది ఆలోచన. చప్పిడిముక్కు, బాల్డ్‌హెడ్, నడుముల కింద టైర్లు, బట్టతల వంటి మాటలకు కొత్త అర్థాలు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదీల్లో అందంగా ఉండాలన్న స్పృహ బాగా పెరిగిందని, ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నవారిలో 80 శాతం మంది పెళ్లికి ముందు వస్తున్నవారేనని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా.వెంకటరమణ అంటున్నారు.
ముప్ఫై ఏళ్ల వయసు లోపే..
►ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీరాకృతిని మార్చుకోవాలని కోరుకుంటున్న వారిలో 80 శాతం మంది 30 ఏళ్ల లోపువారే. వారిలోనే ఎక్కువ మంది పెళ్లికి ముందు వస్తున్న వారే.
►ఆకృతిని మార్చుకునే వారిలో ముక్కు (రినోప్లాస్టీ), నడుముల కింద ముడతలు, లాసిక్ (కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ ఎక్కువ.
►ఈ మధ్య కొవ్వులు తొలగించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
►శరీరాకృతి ముఖ్యంగా నడుముకింద ముడతలు తొలగించుకోవాలని అనుకుంటున్న వారిలో అబ్బాయిలు ఎక్కువ.
►ముక్కు సరిచేసుకునే వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. దీన్నే షేప్ కరక్షన్ అంటారు.
►మొటిమలు పోయాక ఏర్పడ్డ మచ్చలు తొలగించుకున్న వారి సంఖ్య పెళ్లికి ముందు వస్తున్న వారిలో ఎక్కువగా ఉంది.
జాగ్రత్తలు లేకపోతే ఎలా
► సాధారణంగా ఏదైనా జబ్బుకు శస్త్రచికిత్స జరిగితే భవిష్యత్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్లుకూడా తీసుకోవాల్సి ఉంది.
► ఉదాహరణకు నడుముకింద ముడతలు తొలగించుకునేందుకు కొవ్వులు తీస్తాం. ఆ తర్వాత మళ్లీ రాకుండా చూసుకునేందుకు జీవనశైలి మార్చుకోవాలి. లేదంటే మళ్లీ కొవ్వులు ఏర్పడితే దానికి అర్థమేముంటుంది?
► నాణ్యమైన ఉపకరణాలు, శస్త్రచికిత్సల విధానాలు వచ్చాక చాలా వరకూ ఇలాంటి
►సర్జరీలు సక్సెస్ అవుతున్నాయి. అది కూడా డాక్టర్‌ని బట్టి ఉంటుంది.
►చాలామందిలో ఇలాంటివి చేయించుకున్నాక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి.
► శరీరాకృతిని కాపాడుకోవడానికి వ్యాయామం అనేది అత్యంత ముఖ్యమైన అంశం.
ప్రెజెంటేషన్ : జి.రామచంద్రారెడ్డి