ప్రథమ పౌరుడి విడిదిల్లు | president first home Residence of Viceroy | Sakshi
Sakshi News home page

ప్రథమ పౌరుడి విడిదిల్లు

Published Mon, Oct 27 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

ప్రథమ పౌరుడి విడిదిల్లు

ప్రథమ పౌరుడి విడిదిల్లు

రాష్ట్రపతి నిలయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది కానీ హైదరాబాద్‌లో, అదీను బొలారంలో ఏమని సైబరాబాదీలు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే దారిలో సికింద్రాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో లోతుకుంట అనే ప్రాంతానికి దగ్గర్లో రాష్ట్రపతి నిలయం ఉంది. దీన్ని పురాతన, వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో, దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది.
 
బ్రిటీషు వారి పాలనలో అప్పటి ‘‘వైస్రాయ్ నివాసం’’ గా ఈ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత నిజాం ప్రభువులు స్వాధీన పరచుకున్నారు. స్వాతంత్య్రానంతరం, 1950లో కేంద్ర ప్రభుత్వం రూ.60 లక్షలకు కొనుగోలు చేసి దక్షిణాదిలో రాష్ట్రపతికి విడిదిగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి నిలయం ఢిల్లీతో పాటు, హైదరాబాద్‌లోని బొల్లారం, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలో రాష్ట్రపతి రిట్రీట్‌లు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తరాదికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోని స్థానిక ప్రజా సమస్యలపై ఒక అవగాహన కోసమని దక్షిణాది రాష్ట్రాల వారి కోసం హైదరాబాద్‌లో అలాగే మరొకటి సిమ్లాలో ఏర్పాటు చేశారు.

ఏడాదికోసారి..
ఏటా కొన్ని రోజులపాటు రాష్ట్రపతి దక్షిణాది పర్యటనకు వస్తుంటారు. వారం నుంచి పదిహేను రోజులుండే ఈ పర్యటన సమయంలో రాష్ట్రపతికి ఇదే భవనం విడిదిల్లు. ఆ సమయంలో స్థానిక పెద్దలను ఆయన కలుస్తున్నారు. ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, డా॥సంజీవరెడ్డి తదితరులందరూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం 15 రోజులు రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఇటీవల మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇక్కడ విడిది చేశారు.
 
భారీ నిర్మాణం..
25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్రపతి భవన నిర్మాణం జరిగింది. రాష్ట్రపతి నిలయం నిర్మాణ శైలి రాచఠీవీతో చూపరులను ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. మొత్తం ప్రాంగణంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. ఒక చక్కని హెర్బల్ గార్డెన్‌ను ఇటీవల అభివృద్ధి చేశారు. అనేక అరుదైన ఆయుర్వేద మొక్కలసాగు ఇక్కడ జరుగుతోంది.
 
సీపీడబ్ల్యూడీ నిర్వహణ

రాష్ర్టపతి నిలయం చుట్టూ ఎత్తయిన ప్రాకారాలతో, అధిక భాగం దట్టమైన పురాతన వృక్షాలతో నిండి ఉంటుంది. సెంట్రల్ పబ్లిక్ వర్‌‌క్స డిపార్‌‌టమెంట్ వారు రాష్ర్టపతి నిలయం నిర్వహణ చూస్తున్నారు. రాష్ర్టపతి ఇక్కడ బస చేయని రోజుల్లో గట్టి పోలీస్ భద్రత ఉంటుంది. లోనికి ఎవరినీ అనుమతించరు. ఏడాదిలో ఓ నెల రోజులు మాత్రం, అదీ రాష్ర్టపతి హైదరాబాద్ వస్తున్నారంటే, ఆయా ఏర్పాట్లు చూసే అధికారులు, సంబంధిత సిబ్బందితో రాష్ర్టపతి నిలయం సందడిగా పలు ప్రభుత్వశాఖల అధికారులతో నిండిపోతుంది. గత రెండుమూడేళ్లుగా రాష్ర్టపతి పర్యటన అనంతరం, ఒక వారం రోజులపాటు జంటనగరాల్లో సాధారణ పౌరులని ఈ నిలయాన్ని సందర్శించే అవకాశం కలిపిస్తున్నారు.

ఇతర రోజులలో ఈ విశాల ప్రాంగణంలో ఎలాంటి జనసంచారం ఉండదు. దీంతో రాష్ట్రపతి నిలయ ప్రాంగణం విషసర్పాలకు నెలవైంది.  రాష్ర్టపతి వచ్చే సందర్భంలో స్థానిక జూ అధికారులు విసృ్తత తనిఖీలు నిర్వహించి విషసర్పాలను పట్టి స్థానిక నెహ్రూ జూలాజికల్ పార్కుకి తరలిస్తున్నారు. ఇదంతా నిశితంగా పరిశీలిస్తున్న స్థానికులు రాష్ర్టపతి పర్యటన లేనిరోజుల్లో సాధారణ పౌరులు ఈ నిలయాన్ని సందర్శించేందుకు అనుమతించాలని కోరుతున్నారు. కాలుష్యం ఎరుగని ఈ ప్రశాంత ప్రాంగణం ఏడాదిలో సుమారు 10 నెలలు ఖాళీగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంగణంలోకి  ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో వాకింగ్‌కు అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు.
- మల్లాది కృష్ణానంద్, malladisukku@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement