
రేడియో జర్నీ
టీవీ, ఇంటర్నెట్ వంటి అధునాతన ప్రసార మాధ్యమాల తాకిడికి తట్టుకుని, కాలానికి అనుగుణంగా రూపు మార్చుకుంది రేడియో. ఈ క్రమాన్ని తెలుపుతూ సినీ నిర్మాత మధుర శ్రీధర్ ట్యాంక్‌బండ్ హోటల్ మారియట్‌లో ‘జర్నీ ఆఫ్ రేడియో’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రేడియో జాకీల్లోనూ, అభిమానుల్లోనూ నూతనోత్సాహాన్ని నింపారు. ఈ నెల 6 వరకు ప్రదర్శన కొనసాగుతుందని వెల్లడించారు.
- కోట కృష్ణారావు
దక్కన్ రేడియో నుంచి ఎఫ్‌ఎం రేడియో వరకు...
నిజాం జమానా నాటి దక్కన్ రేడియో నుంచి ఎఫ్‌ఎం రేడియో వరకు ‘ఆకాశవాణి’ పయనంలోని మైలురాళ్లన్నింటినీ ఈ ప్రదర్శనలో కొలువుదీర్చారు. ఆనాటి రేడియో రూపురేఖల నుంచి ప్రస్తుత స్వరూపం వరకు ఎలా మారిందనే దానికి నిదర్శనంగా ఫొటోలను ప్రదర్శనలో ఉంచారు. 1940లలో రేడియో రిసీవర్ ట్రూటోన్ మోడల్ రేడియోను ఎక్కువగా ఉపయోగించేవారు. 1947లో డియోరా ఆగా ఆర్‌ఎస్‌జెడ్-50 రేడియో ఓ వెలుగు వెలిగింది. శ్రీలంక రేడియో స్టేషన్‌గా పిలుచుకునే సిలోన్ రేడియో స్టేషన్, మొట్టమొదటి ఎవర్ రివల్యూషనరీ బాస్‌వేవ్ రేడియో, తొలిసారిగా రేడియో-టేప్‌రికార్డర్లు టూ-ఇన్-వన్‌గా మార్కెట్‌లోకి వచ్చిన తీరు, తొలితరం ట్రాన్సిస్టర్ రేడియోలు, రేడియో కార్యక్రమాలను ప్రచురించే ఫస్ట్ రేడియో టైమ్స్ మ్యాగజైన్, దేశంలోని ఆకాశవాణి కేంద్రాల సంఖ్య, ఎఫ్‌ఎం రేడియో కేంద్రాల సంఖ్య, రేడియో వ్యాఖ్యాతల పేర్లు, నాటి నుంచి నేటి వరకు రేడియోలో సాగిన వినోద, విజ్ఞాన కార్యక్రమాలు, ఎంఎస్ సుబ్బులక్ష్మి సుప్రభాతం మొదలుకొని రోజంతా సంగీతంతో పసందు చేసిన గాయకులు, సంగీత దర్శకుల ఫొటోలతో పాటు సమాచారాన్ని ప్రదర్శనలో ఉంచారు.
మరిన్ని విశేషాలు...
- దక్షిణ భారతదేశంలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో రేడియో కార్యక్రమాలు 1938 జూన్ 16 నుంచి వెలువడ్డాయి.
- ఎయిర్ చెన్నై తెలుగు రేడియోకు సంబంధించి
మొట్టమొదటి వ్యాఖ్యాత ఉమామహేశ్వరరావు.
- ఎయిర్‌చెన్నైలో మొట్టమొదటి తెలుగు కార్యక్రమం అనార్కలి. దీనికి వ్యాఖ్యాతగా భానుమతి
వ్యవహరించారు.
- 1947 నాటికి ఇండియాలో 2,75,000 రేడియో సెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో వీటికి లెసైన్స్ తప్పనిసరిగా ఉండేవి.
- రేడియో కార్యక్రమాల్లో ప్రాముఖ్యత సంతరించుకున్న వివిధభారతి కార్యక్రమం 1957లో
ఫ్రారంభమైంది.
- ఆలిండియా రేడియో పేరు 1956 నుంచి అధికారికంగా ఆకాశవాణిగా మారింది.
- ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ చానల్ రేడియో సిటీ. 2001, జూలై 3న ప్రారంభమైంది.
ఎఫ్‌ఎంతో మళ్లీ ఊపిరి
రేడియో ఒక వారసత్వ సంపద. ఆధునిక యుగంలో చోటు చేసుకున్న మార్పుల ఫలితంగా కనుమరుగైపోతుందనుకున్న రేడియో, మళ్లీ ఎఫ్‌ఎం కేంద్రాల కారణంగా ఊపిరి పోసుకుంది. ట్రాఫిక్‌లో ఉన్నా, ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఉన్నా... రేడియో పంచే వినోదం, విజ్ఞానం ఆపారం. రేడియో ప్రస్థానంలో నాటి, నేటి వైభవాన్ని మరోసారి గుర్తు చేసుకునేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు మధుర శ్రీధర్ చెప్పారు. రేడియో జాకీలను, అభిమానులను... ఇలా రేడియోతో అనుబంధం ఉన్నవారందరినీ ఈ ప్రదర్శనతో ఒకచోటుకు చేర్చడం మధురానుభూతిని ఇచ్చిందన్నారు. బాల్యంలో పొలాల్లో రైతుల భుజాలపై కూర్చుని రేడియో వింటూ సాగిన తన జీవితం, క్రమేపీ రేడియోతో అపారమైన అనుబంధాన్ని ముడి వేసుకుందన్నారు. ఈ ప్రదర్శన ద్వారా రేడియోలో సుదీర్ఘకాలం వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన జోత్స్న, ఇలియాస్‌లను సత్కరించారు.