
బొత్స స్వయం కృతాపరాధమేనా?
విజయనగరంలో పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్తులపై జరిగిన దాడులు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో హాట్ టాఫిక్గా మారింది. ఈ పరిణామం ఆయన స్వయంకృతాపరాధమేనని ....సీమాంధ్ర మంత్రులే అంటున్నారు. బొత్స కుటుంబ ఆస్తులపై దాడుల అంశంలో రాజకీయ కోణమేమీ లేదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆయన పట్ల గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా నెలకొన్న అసంతృప్తి కూడా దాడులకు కారణం అయ్యాయనే వాదనలు వినిపిస్తున్నారు.
అగ్నికి ఆజ్యం పోసినట్లు కర్ణాటకలోని మాండ్యా పర్యటనకు వచ్చిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ను పీసీసీ చీఫ్ బొత్స కలిసి కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడానికి ఇదే అనువైన సమయమని చెప్పారంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ మూడు రోజుల క్రితం మీడియా సమావేశంలో పరోక్షంగా ఆరోపించిన నేపథ్యంలో ఒక్కసారిగా బొత్స టార్గెట్‌గా మారారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇక తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించడం ద్వారా పిసిసి చీఫ్ పదవి దక్కించుకున్న బొత్స పార్టీ అధ్యక్షుడిగా కూడా రాష్ట్ర విభజనను చాలా సందర్భాల్లో సమర్థించారు. తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని పలుమార్లు బాహాటంగా ప్రకటించిన ఏకైక సీమాంధ్ర కాంగ్రెస్ నేత బొత్సనే. రాష్ట్ర విభజనకు సహకరించడం వల్ల అధిష్టానం మెప్పుపొందవచ్చని.... తద్వారా తన లక్ష్యమైన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో బొత్స ముందుకు వెళ్లారు కూడా. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రికి, బొత్సకు ప్రచ్ఛన్న యుద్ధమే జరిగిందనేది బాహాటమే.
అలాగే రాష్ట్ర విభజన అంశంలో బొత్స కుటుంబ సభ్యుల వ్యవహరించిన తీరు కూడా స్థానిక ప్రజల ఆగ్రహానికి కారణం అయ్యింది. బొత్స కుటుంబంలో నలుగురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అయితే వారు ఏనాడూ సమైక్య ఉద్యమాన్ని సమర్థించలేదు. బొత్స సతీమణి విజయనగరం ఎంపీ అయిన ఝాన్సీ కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకించలేదు. ఎమ్మెల్యేలైన బొత్స సోదరుడు.... సమీప బంధువులిద్దరూ కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతివ్వకపోగా సమైక్యవాదులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు.
తొమ్మిదేళ్లుగా జిల్లాలోని బొత్స ఏకచ్ఛత్రాదిపత్యం వల్లే ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.... ఈ వాస్తవాన్ని బొత్స సంబంధీకులు గ్రహించకపోగా .... ప్రజలపై పెత్తనం చేయాలనుకోవడం వల్లే ఆయన కుటుంబ ఆస్తులపై దాడులు జరిగాయనేది సమాచారం. మరోవైపు బొత్స ఆస్తులపై దాడుల వెనుక ముఖ్యమంత్రి వర్గం ప్రమేయం ఉందని బొత్స సన్నిహిత నేతలు భావిస్తున్నారు. పార్టీలో కూడా ఇదే విషయమై చర్చ జరుగుతున్నది.
దాడుల నేపథ్యంలో విజయనగరంలో పరిస్థితి చేయి దాటడంతో కర్ఫ్యూ కొనసాగుతోంది. పోలీసు పహారాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా బొత్స ఆస్తులను రక్షించేందుకే విజయనగరంలో కర్ఫ్యూ విధించారని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. దిగ్విజయ్ సింగ్కు కేవలం బొత్స ఆస్తులు కనిపిస్తున్నాయే కానీ..కోట్ల ప్రజానీకం గోడు పట్టదా అంటూ వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అయితే బొత్స మాత్రం ఇప్పటికీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు వ్యవహరించటం గమనార్హం.