'గోవిందుడు అందరివాడేలే'లో రామ్ చరణ్ తేజ
రామ్ చరణ్ కొత్త చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' నిర్మాణం పూర్తి కాలేదు. షూటింగ్ జరుగుతూనే ఉంది. అప్పుడే ఈ సినిమా ఫ్లాప్ అంటూ వదంతులు వ్యాపించాయి. విడుదలకు చాలా సమయం ఉన్నది. అయినా రామ్ చరణ్ ఈ తాజా సినిమా ప్రాజెక్ట్కు అప్పుడే ఫ్లాప్ టాక్ వెంటాడుతోంది. మేకింగ్ స్టిల్స్ గురించి ఎవరు నోరు విప్పినా, ఫిల్మ్ నగర్ గాసిప్స్ విన్నా సరే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి చాలా విషయాలే బయటకు వచ్చాయి.
నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు కృష్ణ వంశీలతో హీరో రామ్ చరణ్కు అస్సలు పొసగడం లేదని సమాచారం. కథను మళ్ళీ మార్చాలంటూ చరణ్ డిమాండ్ చేస్తున్నాడని ఫిల్మినగర్ వర్గాల టాక్. మల్టీస్టారర్గా మరో నటుడిని తీసుకోవాలని చరణ్ కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇలా సినిమా యూనిట్పై ఒత్తిడి పెరుగుతోందని చరణ్పై విమర్శలు జోరుగా వినవస్తున్నాయి. అంతేగాక ఆ టార్చర్కు తట్టుకోలేక కృష్ణవంశీ అపోలో ఆసుపత్రిలో చేరినట్లు కూడా ప్రచారం నడిచింది.
హీరో విక్టరీ వెంకటేష్ తాజా వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని సినీ విమర్శకులు అంటున్నారు. మల్టీస్టారర్ సినిమాలపట్ల ఆసక్తి చూపే తన వద్దకి చాలా కథలు వస్తున్నాయని, కానీ ఏవీ తనకి నచ్చడం లేదని వెంకటేష్ చెప్పారు. గోవిందుడు అందరివాడేలే కథతో కృష్ణవంశీ తన వద్దకు వచ్చిన విషయాన్ని కూడా వెంకీ ప్రస్తావించాడు. అంటే, కథ నచ్చకే తానూ తప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రామ్‌చరణ్ తేజ సినీరంగ ప్రవేశం చేసి ఏడేళ్లు పూర్తి అయింది. ఇప్పటి వరకు ఆయన ఏడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. వాటిలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు చిత్రాలు మంచి హిట్ సాధించాయి. ఇన్ని సినిమాలు విజయం సాధించడం తండ్రి చిరంజీవి అభిమానుల వల్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా తండ్రిలా మాస్ పల్స్ ప్రకారం నడవడం వల్లే ఈ క్రెడిట్ సాధించినట్లు భావిస్తున్నారు.
విడుదలకు ముందే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంపై ఫ్లాప్ అంటూ ప్రచారం జరుగుతుందంటే ఎవరో కావాలని చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ - చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీపై అభిమానులకు చాలా ఆశలు ఉన్నాయి. దర్శకుడు కృష్ణ వంశీ సామాన్యుడు కాదు. కథ, కథనంలో కొత్తదనం చూపించగల దిట్ట. వీరి కలయికలో వస్తున్న చిత్రం చూడకుండా ఇలా పుకార్లు వ్యాపించడం ఏమిటి? ఇందులో చరణ్ ఇంతకు ముందు నటించిన పాత్రలకు భిన్నంగా కొత్త గెటప్లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు షూటు, బూటులో కనిపించిన చరణ్ పల్లెటూరి చిన్నవాడి గెటప్లో కనిపించడం కొందరికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే ఎలా?
కుటుంబ సంబంధాలు, సంప్రదాయాల నేపథ్యంలో వినోదాత్మకంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ప్రధాన పాత్రలలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, తమిళ నటుడు రాజ్‌కిరణ్ నటిస్తున్నారు.
- సూర్యభరత్