బక్కచిక్కిపోతున్న రూపాయి
డాలర్తో పోల్చితే రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడంతో రూపాయి కొంత పుంజుకుంది. కానీ రెండు వారాలు కూడా కాకముందే మళ్లీ పతనం దిశలో కింద కిందకు వెళుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉంది.
రూపాయి రోజు రోజుకు కిందకు పోతుండటంతో కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతోంది. గత నెల 31వ తేదీ బుధవారం డాలర్తో పోల్చితే 55.65 రూపాయలు కాగా, ఈరోజు 61.27కి పడిపోయింది. రూపాయి విలువ రోజురోజుకు దిగజారిaపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ పతనం ఇలాగే కొనసాగి 70 వరకు పడిపోతుందనే అంచనాలు వస్తుండటంతో అటు ఆర్థిక శాఖ, ఇటు రిజర్వ్ బ్యాంకు పలు చర్యలు చేపడుతున్నాయి. కానీ ఇవేవీ ఫలితం ఇస్తున్న దాఖలాలు లేవు. రూపాయి పతనంతో దిగుమతులు భారమవుతున్నాయి. రెండు నెలల్లో పెట్రోల్ ధర నాలుగు సార్లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ ధర దాదాపు 78 రూపాయలకు చేరింది. రూపాయి గనుక 70కి చేరితే లీటర్ ధర 100 రూపాయలకు చేరే ప్రమాదం ఉంది. ఒక్క పెట్రోల్ మాత్రమే కాకుండా అనేక రకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గినా, రూపాయి విలువ పడిపోవడంతో మనదేశంలో బంగారం ధర పెరుగుతూ ఉంది.
రూపాయి పతనం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం లేదు. ఇందువల్ల రూపాయిని నిలబెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద నగదు సరఫరాను తగ్గించారు. మార్కెట్లో వడ్డీరేట్లు పెరిగేలా చేశారు. ఈ చర్యల నేపథ్యంలో వారం కింద రూపాయి 55 వరకు బలపడింది. కానీ మళ్లీ అంతలోనే 61 దాకా వచ్చింది. ఇలాగే వదిలేస్తే 65 దాకా వెళ్లిపోతుందేమోనని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పతనాన్ని అడ్డుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ చర్యల్లో భాగంగా ప్రధానంగా విదేశాల్లో జరుగుతున్న రూపాయి లావాదేవీలను నియంత్రించనుంది. ఈ లావాదేవీలను టెక్నికల్‌గా నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్డిఎఫ్) అని పిలుస్తున్నారు. సింగపూర్, లండన్, న్యూయార్క్ నగరాల్లో ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. ఎం.ఎన్.సి. బ్యాంకులు, ఫండ్లు, పెద్ద పెద్ద ఇండియన్ కంపెనీలు ఈ లావాదేవీల కొనుగోళ్లు, అమ్మకాల్లో పాల్గొంటున్నాయి. గత పదేళ్లుగా ఈ తరహా లావాదేవీలు బాగా పెరిగాయి.
మన దేశంలో రూపాయి గమనాన్ని ఇవి ప్రభావితం చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఎన్డిఎఫ్లను అదుపు చేయాలని నిర్ణయించింది. ఈ పరిస్థితులలో వచ్చే నెల 4న రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన సారధ్యంలో రూపాయి బలపడుతుందని పలువురు భావిస్తున్నారు. రాజన్ తనకు ఉన్న అనుభవంతో ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెస్తారని ఆశిద్దాం.