రాజధాని పేరుతో రొచ్చు రాజకీయం
రాష్ట్రాన్ని చీల్చేశారు.. ఇక మిగిలిన కొద్దిపాటి ప్రాంతాన్ని, అక్కడి మనుషులను, వారి మనసులను చీల్చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరం ఎక్కడుండాలనే పేరుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల మధ్య లేనిపోని విభేదాలు రేకెత్తిస్తున్నారు. ఇన్నాళ్లూ ఒక్కతాటి మీద ఉన్న సీమాంధ్ర ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఉద్యమం ఉధృతంగా జరిగినప్పుడు ఎక్కడా మచ్చుకు కూడా కనిపించని నాయకులంతా ఇప్పుడు గొంతు విప్పుతున్నారు. రాజధాని నగరం తమ ప్రాంతంలో ఉండాలంటే తమ ప్రాంతంలో ఉండాలంటూ పిచ్చిపిచ్చి వాదనలు లేవదీస్తున్నారు. నిపుణుల కమిటీ ఒకదాన్ని నియమిస్తున్నామని, వాళ్లు ఆరు నెలల్లోగా కొత్త రాజధాని నగరం ఎక్కడుండాలో శాస్త్రీయంగా నిర్ణయిస్తారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణ విషయమై కేంద్రం నియమించిన జీవోఎంలో సభ్యుడు జైరాం రమేష్ చెప్పినా.. అది ఏమాత్రం పట్టించుకోకుండా, తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలు చూసుకుని అక్కడే రాజధాని ఉండాలంటూ మైకులు పట్టుకుని ఊదరగొడుతున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ రాజధాని ఉండాలంటున్నారో ఒక్కసారి చూద్దామా..
విశాఖపట్నం.. కిశోర్ చంద్రదేవ్
అరకు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిశోర్ చంద్రదేవ్.. సమైక్య ఉద్యమ సమయంలో ఎక్కడా కనిపించలేదు, కనీసం దానికి మద్దతుగా కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం విశాఖపట్నాన్నే కొత్త రాష్ట్రానికి రాజధానిగా చేయాలని వాదిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం బాగా వెనకబడిందని, ఇక్కడ రాజధాని నగరం పెడితే ఇటు ఉత్తరాంధ్రతో పాటు అటు గోదావరి జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని అంటున్నారు.
విజయవాడ.. పార్థసారథి
కొత్త రాష్ట్రం మొత్తానికి కేంద్రస్థానంలో ఉన్నది విజయవాడేనని, ఇక్కడ రాజధానికి కావల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని, ఇదైతే అటు రాయలసీమకు, ఇటు కోస్తాకు, ఉత్తరాంధ్రకు కూడా అనుకూలంగా ఉంటుందని మాజీ మంత్రి పార్థసారథి చెబుతున్నారు. ప్రభుత్వ భూములు, విమానాశ్రయం కూడా ఉన్నాయన్నది ఆయన వాదన.
కాకినాడ.. పళ్లంరాజు
తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగానే పనికిరాకుండా, ఒక మూలన ఉన్న కాకినాడ నగరాన్ని ఏకంగా రాష్ట్రానికే రాజధాని చేయాలని కేంద్ర మంత్రి పళ్లంరాజు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇదే వాదనను లేవనెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలోనే రాజమండ్రి కేంద్రంగా ఎక్కువ కార్యకలాపాలు జరుగుతాయి. దాన్ని వదిలేసి.. కాకినాడను రాజధాని చేయాలంటున్నారు.
తిరుపతి.. చింతా మోహన్
తాను చిత్తూరుకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, ఆ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిని కొత్త రాష్ట్రం రాజధాని నగరంగా చేయాలని ఎంపీ చింతా మోహన్ అంటున్నారు. ఇదైతే అందరికీ అందుబాటులో ఉంటుందని, అన్ని ప్రాంతాల వాళ్లూ వచ్చి వెళ్లడానికి కూడా వీలుగా ఉంటుందని, రేణిగుంటలో విమానాశ్రయం ఉందని ఆయన వాదిస్తున్నారు.
కర్నూలు.. టీజీ వెంకటేశ్
గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలునే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేయాలని టీజీ వెంకటేశ్ వాదిస్తున్నారు. ఇంతకుముందు తాము రాజధాని నగరాన్ని వదిలేసుకుని నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ అలాంటి అన్యాయమే జరిగితే ఊరుకునేది లేదని.. కర్నూలును రాజధాని చేయకపోతే రాయలసీమ నాలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని టీజీ అంటున్నారు.