మనోరంజితం పటచిత్రం
వేలాది శ్లోకాల్లో ఇమిడి ఉన్న రామాయణ, మహాభారతాలను తన ప్రతిభతో చిత్రరూపం ఇచ్చి మన ముందుంచారు బెంగాలీ ఆర్టిస్ట్ రంజిత్ చిత్రకార్. పటచిత్ర ప్రతిభతో రామాయణానికి చిత్ర రూపం ఇస్తూ 45 షీట్లలో బంధించారు. అంతే మనోరంజకంగా మహాభారతాన్ని చిత్రరాజంగా మలచారు. బంజారాహిల్స్‌లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో సోమవారం మొదలైన ‘పటచిత్ర’ ప్రదర్శన అందర్నీ ఆకర్షిస్తోంది.
ఈ నెల 14 వరకు జరుగుతున్న ఎగ్జిబిషన్‌లో ఎయిడ్స్ నియంత్రణ, అడవుల సంరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా చిత్రాలు కొలువు దీరాయి. ‘పదేళ్ల వయసు నుంచే పటచిత్ర ఆర్ట్ నేర్చుకున్నాను. కఠోర సాధనతోనే ఈ రంగంలో పేరు సాధించగలిగాను. శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ, లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఢాకా యూనివర్సిటీ, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్‌లలో నా ఆర్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. నా ఇద్దరు కుమారులు కూడా పటచిత్ర పెయింటింగ్ చేస్తున్నార’ని కుంచెకారుడు రంజిత్ చిత్రకార్ తెలిపారు.
వాంకె శ్రీనివాస్
రంగుల కళ
మదిలోని అందమైన ఊహలకు రంగులు అద్దితే.. కలలకు రూపమిచ్చి కళాఖండాలుగా కళ్లముందు పెడితే.. ఎంత అద్భుతం..! ఇలాంటి అందమైన అద్భుతమే మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్‌ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఆవిష్కరించారు. ‘మిలాంజ్’ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మరో లోకాన్ని ఆవిష్కరించారు.
ఈ నెల 7న ప్రారంభమైన ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే కళాశాలలో పెయింటింగ్ ఓనమాలు దిద్ది, పేరొందిన ఫైన్‌ఆర్ట్స్ కళాశాలల్లో మాస్టర్‌స డిగ్రీలు పొంది అంతా కలసి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మండుతున్న అగ్గిపుల్లపై పెద్దపులి, పూలకుండిలోని మొక్క ఆకును అందుకునేందుకు ప్రయత్నిస్తున్న జిరాఫీ.. సీతాకోక చిలుక ఏనుగును పట్టుకుని ఎగిరిపోవడం.. వంటి ఎన్నో చిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.