ప్లీజ్... ప్రాణాలు తీయొద్దు!
'ఆవేశంలోనే నా కూతుర్ని చంపుకున్నా'... కులాంతర వివాహం చేసుకున్న కన్నకూతుర్ని కడతేర్చిన తండ్రి నోటి నుంచి వచ్చిన మాటలివి. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అతడీ దుశ్చర్య పాల్పడ్డాడు. సమాజం ఎంత ముందుకు పోతున్నా కొన్ని జాడ్యాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి ఇలాంటి పరువు తక్కువ హత్యలే రుజువు. పరువు పేరుతో జరుగుతున్న ఈ దారుణాలు నానాటికీ పెరుగుతుండడమే అత్యంత ఆందోళన కలిగించే అంశం.
గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు దీప్తిని ఆమె తండ్రే హత్య చేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా అంగీకరించాడు. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ పెళ్లి చేసుకోవడమే తాము చేసిన నేరమా అంటూ దీప్తి భర్త కిరణ్‌కుమార్ ప్రశ్నిస్తున్నాడు. కులాంతర వివాహం చేసుకోవడం పాపమా అంటూ నిలదీస్తున్నాడు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో కుల దురహంకారం ఒకటి. వేరే సామాజిక వర్గానికి చెందిన వారిని ప్రేమించారనో, పెళ్లిచేసుకున్నారనో పెద్దలు పిల్లలు ఉసురు తీస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా రోజూ జరుగుతున్నాయి. పరువు పోయిందనే అక్కసుతో అకారణంగా ప్రేమికుల ప్రాణాలు తీస్తున్నారు కుల దురహంకారులు.
ఆధునికత వైపు వడివడిగా అడుగులు వేస్తున్న నవ నాగరికులు మానవత్వం మర్చిపోతున్నారు. నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. విచక్షణ విడిచిపెడుతున్నారు. సాంకేతికపరంగా ఎంత ఎదిగినా మానవ సంబంధాల విషయంలో కుంచించుకుపోతున్నారు. కుల, మత, ప్రాంత వైషమ్యాలతో విద్వేషాలు పెంచుకుంటున్నారు. ప్రాణాలు దీయడానికి వెనుకాడడం లేదు. ఉన్నత చదువులు చదివిన వారు సైతం ఈవిధంగా వ్యవహరిస్తుండడం విస్మయపరుస్తోంది. పిల్లల ప్రేమను ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు కానీ, వారి ప్రాణాలు తీయకండి. వారిని ఆదరించకపోయినా వారి బతుకు వారిని బతకనీయండి.