ల్యాప్టాప్‌లతో పోటీ పడలేకపోతున్నట్యాబ్లెట్స్
ఎక్కడికి కావాలంటే అక్కడకు సునాయాసంగా తీసుకువెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ట్యాబ్లెట్స్ ల్యాప్ టాప్‌లతో పోటీ పడలేకపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత కొత్త పుంతలు తొక్కినా నెట్ వినియోగంలో మాత్రం ల్యాప్ టాప్‌లు తమ సత్తాను చాటుతూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నాయి. మార్కెట్లోకి ఎన్ని ట్యాబ్లెట్స్ వచ్చినా యువత మాత్రం ల్యాప్‌టాప్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగానికి ట్యాబ్లెట్స్ కంటే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తేలింది.
ఇంటర్నెట్ కోసం 69 శాతం మంది ల్యాప్‌టాప్‌లపై, 64 శాతం మంది స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడుతున్నారు. కేవలం 24 శాతం మంది ట్యాబ్లెట్లను వాడుతున్నారని సర్వే ద్వారా తెలిసింది. హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్ నగరాల్లోని రెండు వేల మంది వినియోగదార్లపై డెలాయిట్ ఆన్‌లైన్ సర్వే నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించింది. ల్యాప్ టాప్‌లో ట్యాబ్లెట్ కంటే బ్యాటరీ, మోమోరీలతోపాటు ప్రాసెసర్ స్పీడ్ బాగా కలిసి వస్తాయని ఐటి నిపుణులు సైతం చెపుతున్నారు.
ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 60 శాతం మంది డేటా కోసం మొబైల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తుండగా, ల్యాప్‌టాప్ వినియోగిస్తున్న వారిలో 80 శాతం మంది ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుతున్నారు. విభిన్న డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది మొబైల్ కస్టమర్లు వైఫైకి మళ్లుతున్నారు. ట్యాబ్లెట్ కొనుగోలు సమయంలో కస్టమర్లకు బ్రాండ్ తొలి ప్రాధాన్యత కాగా, మన్నిక, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ జీవిత కాలం, డిజైన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదే స్మార్ట్‌ఫోన్లకైతే బ్యాటరీ సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తోంది. డిజైన్, మన్నిక, బ్రాండ్, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా సామర్థ్యం తర్వాతి ప్రాధాన్యతలని డెలాయిట్ వెల్లడించింది. ఐతే ల్యాప్‌టాప్‌లలో ఇవన్నీ ఉండటం వాటికి బాగా కలిసివచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.
s.nagarjuna@sakshi.com