ఉస్మానియా ఆస్పత్రిలో చింతచెట్టు
హిందీ సినిమాల్లో దక్కనీ మాండలికాన్ని కించపరుస్తూనే కాదు.. ప్రేమగా కూడా చాలా సందర్భాల్లో వాడారు. రేడియో, టీవీల్లో దిగువన ఉదహరించిన రెండు ప్రేమ గీతాలు చెవిన పడినపుడు ఒక ఫ్లాష్‌బ్యాక్ గుర్తొస్తుంది! ‘కల్ న మానా/ తూ పర్సోన మానా/ తూ బర్సోంసెన మాన...’ (నిన్నొప్పుకోలేదు/నీవు మొన్నొప్పుకోలేదు/ నీవు ఏళ్లు గడచినా ఒప్పుకోలేదు) ‘ఆజ్ కల్ పర్‌సూంకె బాతే నహీ తెరెమెరె సదియోంసె పెహ్‌చాన్ హై’ (ఈరోజు నిన్న మొన్న సంగతి కాదు/ మన పరిచయం యుగయుగాలది)
హైద్రాబాద్‌కు వచ్చిన కొత్త. సమాచారం-ప్రచారశాఖ కమిషనర్‌గా ఉద్యోగం. ‘ఆంధ్రప్రదేశ్’గా ఏర్పడిన తొలి సంవత్సరాలు. హైద్రాబాద్ స్టేట్‌లో సమాచారశాఖ అంటూ ఒకటి ఉండేది కాదు. హైద్రాబాద్‌కు చెందిన రికార్డులు ? ఉర్దూ భాషలో దక్కనీ మాండలీకంలో సాంప్రదాయక పద్ధతుల్లో రాసినవి అక్కడొకటి ఇక్కడొకటి లభించేవి. అప్పటి ప్రముఖ సంపాదకులు దివంగత నార్ల వెంకటేశ్వరరావు తరచూ రికార్డులను స్ట్రీమ్‌లైన్ చేయాలని చెప్పేవారు. ఉర్దూ, ఇంగ్లిష్‌లలో డ్రాఫ్ట్ చేసే పరిజ్ఞానం ఉండడం వలన నా పై ఈ బాధ్యత మోపారు.
పదము వినగ ప్రాణాలు కదలురా!
ఈ క్రమంలో ఒక పదం నన్ను ముప్పుతిప్పలు పెట్టింది. రికార్డుల్లో ‘మొన్నటి వరదలు...(పర్సూం -కి-తుగ్యాని)’ అనే పదం తరచూ కన్పించేది. కొన్ని నెలలుగా ఇక్కడే ఉన్నాను కదా! హైద్రాబాద్‌లో మొన్న వరద ఎక్కడ వచ్చింది? అటువంటిదేమీ లేదు! దాదాపు సిటీలోని అన్ని ప్రాంతాల వారినీ అడిగే వాడిని. ‘లేదే’ అని సమాధానం! ఒక మిత్రుడి వివరణతో నా ఆందోళన దూది పింజలా విడిపోయింది! హిందీలో లేదా ఉర్దూలో ‘కల్-పర్సూం-తర్సూం-తీన్ దిన్ పహెలే- హఫ్తా కె పహెలె-మహినె కె పహెలె-పిచ్‌లే సాల్ (నిన్న - మొన్న - ఆ మొన్న- మూడు రోజుల క్రితం-వారం క్రితం-నెలక్రితం-ఏడాది క్రితం)’లాంటి పదాలు వ్యవహారంలో ఉన్నాయి. హైద్రాబాదీల వ్యావహారిక భాషలో అంత సంక్లిష్టత ఉండదు. ‘కల్-పర్సూం (నిన్న-మొన్న)’ అంతే! మొన్నటికి ముందంతా మొన్నే! ఇంతకీ
రికార్డుల్లో ఉన్న ‘పర్సూం...’ ఏమిటనుకున్నారు?
అమ్జద్ హైద్రాబాదీ కవన ఘోష!
1908 సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 2 గంటల నుంచి (తెల్లవారితే 28) ఉదయం 6 గంటల వరకూ మేఘం బద్దలయ్యింది! ఉగ్రరూపం దాల్చిన మూసీ నది మూడోవంతు నగరాన్ని ముంచింది. 15 వేల మంది మరణించారు. వరదలో తల్లి సోఫియా బేగం, భార్య మెహబూబ్ ఉన్నీసా, కుమార్తె అజం ఉన్నీసాలు ‘అమ్జద్ హైద్రాబాదీ’ కళ్ల ఎదుటే మరణించారు. స్పృహతప్పిన 22 ఏళ్ల అమ్జద్ ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు తట్టుకున్నాడు. కొమ్మలకు వేలాడుతూ ప్రాణాలు నిలుపుకున్న 150 మందిలో అమ్జద్ ఒకడు! పార్సీ-ఉర్దూ-దక్కనీ ఉర్దూలలో ప్రముఖ కవిగా విఖ్యాతుడైన అమ్జద్ హైద్రాబాదీ కంటే గొప్పగా ఈ పెను విషాదాన్ని ఎవ్వరు వర్ణించగలరు? ఖయామత్-ఎ-సోగ్రా (మినార్లు మునిగిపోయాయి)లో ఒక చరణం...
ఇత్ని దర్‌యా మే భీ న డూబా అమ్జద్/ ఇంతటి వరదలోనూ మునిగి పోలేదు అమ్జద్ డూబ్‌నై వాలోంకొ బస్ ఏక్ చుల్లూ కాఫీ హై /మునగని వాడికి చాలు ఒక ప్రాయశ్చిత్తం ఈ వరదల ఫలితంగా తర్వాత కాలంలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యవంటి మేధావుల దార్శనికతతో దేశంలోనే ప్రణాళికాబద్ధమైన తొలి నగరంగా హైదరాబాద్ రూపొందింది! 1908 వరద తరచూ రికార్డుల్లోకి రావడం సహజం. అయితే అన్నింటా ‘మొన్నటి వరద...’గా! హైద్రాబాదీల సంభాషణల్లో ‘పర్సూం క్యా హువా మాలూం...’ తరచూ విన్పిస్తుంది! ‘మొన్నేమైందో తెలుసా..’ అంటే మొన్నటి నుంచి శతాబ్దాల క్రితం వరకూ! చరిత్ర చెత్తబుట్టను క్లీన్ చేయడానికి ఇంత కంటె మంచి పదం ఉందా?!