చిరంజీవి
టాలీవుడ్లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా దర్శకుడు ఎవరు? కథ ఏమిటి? అనేదానిపై విభిన్న కథనాలు వినవస్తున్నాయి. సినిమా రంగంలో మంచి దశలో ఉండగానే చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చాలా ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. దివంగ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ధాటికి మెగాస్టార్, ఆ పార్టీ తట్టుకోలేకపోయాయి. చిరంజీవి తన సొంత జిల్లాలో కూడా గెలవలేకపోయారు. ఆ తరువాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఎన్నో ఆశలు, ఎంతో నమ్మకంతో గెలిపించిన తిరుపతి ప్రజలకు టాటా చెప్పి, రాజ్యసభకు వెళ్లిపోయారు. కేంద్ర మంత్రి అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తగిలింది. ప్రస్తుతానికి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఒక్కటే మిగిలింది. రాజకీయాలలో ఆశించిన స్థాయిని అందుకోలేకపోయారు. ఈ పరిస్థితులలో ఆయన మనసు మళ్లీ సినిమా రంగంవైపు మళ్లింది.
ఎంతోకాలంగా అభిమానులు కూడా ఆయన 150 చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. పలువురు సినీ రచయితలు పలు కథలతో ముందుకు వస్తున్నారు. ప్రముఖ దర్శకులు కూడా చిరంజీవిని డైరెక్ట్ చేయడానికి పోటీపడుతున్నారు. నిర్మాతలు ఇక సరేసరి. ఇప్పటివరకు చిరంజీవి రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కాస్త వెసులుబాటు వచ్చింది. దాంతో ఆయన కూడా మళ్లీ సినిమాలో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారు. మెగాస్టార్ 150వ చిత్రం అంటే మాటలుకాదుగదా! దానికి తోడు చిరంజీవితోపాటు రామ్చరణ్ కూడా ఆ చిత్రంలో నటించే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇంకేముంది ఆ చిత్రం ఓ రేంజ్లో, భారీ స్థాయిలో ఉంటుంది. సినిమా నిర్మాణం కూడా భారీబడ్జెట్తోనే జరుగుతుంది. ముందు కథ, దర్శకుడు, నిర్మాణ సంస్థ ఖరారైతే, ఆ తరువాత హీరోయిన్ లేక హీయిన్ల ఎంపిక వ్యవహారం ఉంటుంది.
మొన్నటి వరకు ఈ మెగా చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంపిక చేసినట్లు వినిపించింది. గతంలో ‘రమణ’ రీమేక్‌ను వినాయక్ సమర్థవంతంగా ‘ఠాగూర్’ పేరుతో తెలుగు తెరకెక్కించి చిరంజీవికి బ్లాక్‌బస్టర్ అందించారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రం బాధ్యతను కూడా వినాయక్కు అప్పగించాలన్న ఆలోచనతో చిరంజీవి ఉన్నట్లు చెబుతున్నారు. వినాయక్ కూడా చిరంజీవి 150వ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తానని స్వయంగా చెప్పారు. అంతేకాకుండా చిరంజీవితో కథా చర్చలు జరుగుతున్నట్లు కూడా తెలిపారు. చిరంజీవి కూడా తాను మళ్లీ నటించనున్నట్లు ప్రకటించారు. వి.వి.వినాయక్ ఆ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు కూడా ఆయనే తెలిపారు. మళ్లీ ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను పేరు వినవస్తోంది. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించే అవకాశం ఉందని టాలీవుడ్ సమాచారం. కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తన 150వ చిత్రానికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్న కథ కోసం చిరంజీవి వెతుకుతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతోపాటు మరి కొన్ని కథలను కూడా పరిశీలిస్తున్నారు. తమిళంలో విడుదలైన 'జిల్లా' చిత్రం చిరంజీవికి నచ్చింది. అయితే ఈ సినిమాపై మిశ్రమ స్పందన వినిపించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు మోహన్లాల్, విజయ్ నటించారు. మోహన్లాల్ పోషించిన పాత్రను చిరంజీవి, విజయ్ పాత్రను రామ్చరణ్తో చేయించాలని ఒక సందర్భంలో చిరంజీవి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అనుకూలమైన కథ దొరికి, తండ్రీ కొడుకులు ఇద్దరూ ఆ చిత్రంలో నటిస్తే మెగా అభిమానులకు పండుగే!