చిరంజీవి
ఊహాగానాలుగానీ, పుకార్లు గానీ సినిమా రంగంలో వచ్చినన్ని ఇంకెక్కడా రావు. 'ఆలు లేదు సూలు లేదు. అల్లుడి పేరు సోమలింగం' అన్నట్లు సినిమా గురించి ప్రకటనే చేయలేదు. అప్పుడే దర్శకుడిని కూడా మారుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంత ప్రచారం జరగడానికి అతనేమీ సాదాసీదా హీరో కాదు. అందుకే అంత ప్రచారం. తెలుగు సినిమా అభిమానులతోపాటు టాలీవుడ్ కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఆ హీరో కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులన్నీ మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కోసమే.
చిరు సినిమా నటనకు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత ఆయన రాజకీయాలలో బిజీ అయిపోయారు. ఇప్పుడు అక్కడ అంత బిజీ లేకపోవడంతో ఆయన దృష్టి మళ్లీ నటనవైపు మళ్లింది. దాంతో తన 150వ చిత్ర కథ కోసం కసరత్తు చేస్తున్నారు. మంచి కథ ఇస్తే కోటీ రూపాయలు ఇస్తానని సినిమా రచయితలకు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. తన సినీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత గల చిత్రంగా దీనిని రూపొందించడానికి ఆయన కృషి చేస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఈ సినిమా ఉండాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. ఈ మూవీకి ఠాగూర్ లాంటి బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చిన వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారని వినిపించింది. ఇప్పుడు ఆ బంపర్ ఆఫర్ మరో క్రియేటివ్ డైరెక్టర్‌కి దక్కే అవకాశం ఉందని అంటూన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో చిరంజీవి సినిమానే హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ తన తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' దర్శకుడు కృష్ణ వంశీకి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారని సమాచారం. ''గోవిందుడు అందరివాడేలే చిత్రం సూపర్ హిట్ కొట్టు నాన్నతో 150 చిత్రం పట్టు'' అని కృష్ణ వంశీతో రామ్ చరణ్ అన్నట్లు వినిపిస్తోంది. కృష్ణ వంశీ కూడా ఎంతోపట్టుదలతో గోవిందుడు అందరి వాడేలే చిత్రాన్ని సూపర్ హిట్ కొట్టే విధంగా రూపొందించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా సమయం దొరికిన ప్రతిసారి ఆయన మెగాస్టార్ను పొగడ్తలతో ముంచేస్తున్నారని కూడా వినవస్తోంది. అయితే కృష్ణ వంశీ కూడా అంత తక్కువేమీ కాదు. స్క్రీన్ప్లే నడపడంలో దిట్ట. ఏదిఏమైనా ఈ పరిస్థితులలో కృష్ణ వంశీకి 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఓ పెద్ద పరీక్షే. ఇక చిరంజీవి 150వ సినిమా విశేషాలు ఆయన పుట్టిన రోజు ఈ నెల 22న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
- శిసూర్య