
సాక్షి,న్యూఢిల్లీ: మంచుదుప్పటి కప్పుకున్న దేశ రాజధాని రాబోయే వారం రోజుల్లో మరింత వణకనుంది. పొగమంచు, చలిగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజధానిలో వచ్చే వారం ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలకు పడిపోతుందని ఐఎండీ తెలిపింది. రాజధాని ప్రాంతంలో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 7.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.
జనవరి 4 తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు దిగివస్తాయని పేర్కొంది. ఉత్తరాది నుంచి శీతలగాలులు ఢిల్లీని తాకుతున్నాయని, గాలుల ఉధృతి అధికమయ్యే కొద్దీ ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని ఐఎండీ అధికారులు తెలిపారు.