యువ.. ఎదురీదారు.. ఎదిగారు | Yuva uses a success formula to reach their goal | Sakshi
Sakshi News home page

యువ.. ఎదురీదారు.. ఎదిగారు

Published Fri, Sep 26 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

యువ.. ఎదురీదారు.. ఎదిగారు

యువ.. ఎదురీదారు.. ఎదిగారు

వారు కష్టాల కడలికి ఎదురీదారు. నమ్ముకున్న రంగాల్లో అనుకున్నది సాధించడానికి, జీవితంలో నిలదొక్కుకోవడానికి అన్ని పరీక్షలనూ తట్టుకున్నారు. తరగని ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా ఎదిగారు. బతుకుపోరులో విజేతలుగా నిలిచారు. యువతరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్న యువకుల విజయగాథలివి.
 - హనుమా/నాగరాజు
 
  అట్టడుగు స్థాయి నుంచి..
 జీవితంలో అధఃపాతాళాన్ని చూశాను. నేనప్పుడు ఒకటో క్లాసు. సొంతూరు రాజమండ్రి నుంచి.. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేశాం. నాన్న ఆర్మీలో జవాను. ఆయన జీతం తిండికే సరిపోయేది కాదు. ఇరుకు గదిలో మేం ఆరుగురం కాపురం. నేను తొమ్మిదో తరగతికి వచ్చేసరికి మా ఆర్థిక పరిస్థితి మరీ దిగజారింది. అప్పుడే ఇంట్లో ఉన్న చిల్లరంతా పోగేసి పతంగులు కొని పాతబస్తీలో అమ్మాను.
 
 అదే నా మొదటి సంపాదన. తర్వాత రోడ్లపై చిప్స్, సిటీబస్సుల్లో ఫ్రూటీ వంటివి అమ్మాను. కొంతకాలం హీరో జగపతిబాబు ఫ్యాన్స్‌కు జవాబులు రాసే ఉద్యోగం చేశా. ఏడో తరగతి నుంచి డిగ్రీ (బీఎస్సీ కంప్యూటర్స్) వరకు మెరిట్ స్కాలర్‌షిప్స్‌తోనే చదువు పూర్తిచేశా. ఊహ వచ్చాక నాదొకటే కల.. ఫారిన్ వెళ్లి బాగా సంపాదించాలని! డిగ్రీ పూర్తయ్యాక సత్యం కంప్యూటర్స్‌లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం వచ్చింది.
 
 ఖాళీ సమయాల్లో అక్కడే ఇంటర్నెట్ సాయంతో హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా. సత్యంలోనే వెబ్‌డిజైనర్ పోస్టు ఖాళీ అయితే, అది నాకిచ్చారు. నాకదే పెద్ద టర్నింగ్ పాయింట్. కంపెనీ తరఫున సింగపూర్ సహా వివిధ దేశాల్లో పనిచేశా. 2003-04లో సత్యం తరఫున వరల్డ్ బ్యాంకులో ప్రాజెక్ట్ డెవలపర్‌గా విధులు నిర్వర్తించా. అప్పటి నా జీతం నెలకు రూ.1.75 లక్షలు. సొంత కంపెనీ పెట్టాలనే ఆలోచనతో ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చేశా.
 
 ఫారిన్‌లో చదివొస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకొస్తారని మిత్రులు సలహా ఇవ్వడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలో చేరేందుకు యూకేలోని ససెక్స్ యూనివర్సిటీకి అప్లయ్ చేశా. వెంటనే ఆఫర్ లెటర్ వచ్చింది. వీసా కోసం చెన్నై బయలుదేరా. పాస్‌పోర్ట్ ఆఫీసు ముందు పెద్ద క్యూ. ఎంతకూ కదలడం లేదు. ఇక ఎలాగైనా కంపెనీ పెట్టాల్సిందేనని డిసైడ్ అయ్యాను.
 
  క్యూ మధ్యలోనే వదిలేసి తిరిగి సిటీకి వచ్చేశా. నేను రూ.65 లక్షలు, మిత్రులు మరో రూ.30 లక్షలు పెట్టి 2005లో నౌపాజ్ కంపెనీ స్థాపించాం. అంచెలంచెలుగా వందకోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. కొన్ని కారణాల వల్ల 2011లో నేను నా షేర్లు విత్‌డ్రా చేసుకున్నా. అదే ఏడాది పాసిబిలియన్ టెక్నాలజీస్, దానికి అనుబంధంగా ఐడియేటివ్ డిజిటల్ సంస్థలు ప్రారంభించా. ఇవి మొబైల్ యాప్స్ తయారు చేసే సంస్థలు. మా ఉత్పత్తులకు భారత్‌లో కంటే నెదర్లాండ్స్, అమెరికాల్లోనే మంచి బిజినెస్ ఉంది. నా భార్య మహాలక్ష్మి నేచురోపతి డాక్టర్. మా కంపెనీలో భాగస్వామి కూడా. కసితో పనిచేశా.. ఉన్నతి సాధించా.. అయినా చేయాల్సినవి ఇంకా ఉన్నాయి.
 - అయ్యప్ప, నౌపాజ్ కంపెనీ వ్యవస్థాపకుడు
 
  కెమెరానే నమ్ముకుని..
 చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అందుకే ఇంటర్ అయిపోగానే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేశా. జేఎన్‌టీయూలో ఫొటోగ్రఫీ కోర్సులో చేరాను. సెకండియర్‌లోనే నా ఫ్రెండ్‌తో కలసి ఎస్సార్ నగర్‌లో స్టూడియో ఓపెన్ చేశా. తొలిరోజుల్లో స్టూడియో అద్దె డబ్బులకు కూడా తడుముకోవాల్సి వచ్చేది. గణపతి నవరాత్రులకు కాలనీలో ఫ్రీగా ఫొటోలు తీశాను. ఎవరైనా అడిగితే ప్రింట్లు తీసి ఇచ్చేవాడిని. తొమ్మిదిరోజులు పూర్తయ్యాక నాకొచ్చింది అరవై రూపాయలే. కానీ నా గురించి కాలనీలో అందరికీ తెలిసింది. నెలాఖరు నాటికి నా అకౌంట్లో వెయ్యి రూపాయల మిగులు కనిపించడానికి ఏడేళ్లు పట్టింది. కాస్త బిజీ కాగానే స్టూడియోను కృష్ణానగర్‌కు షిఫ్ట్ చేసేశా.
 
  అక్కడ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో టైఅప్ అయ్యా. తక్కువ ధరకు ఆర్టిస్ట్‌లకు ఫొటో షూట్స్ చేసేవాడిని. సినీ పరిచయాలు మొదలవడంతో ‘6టీన్స్’ సినిమాకు ఫొటోషూట్ చేసే అవకాశం వచ్చింది. సుమంత్ హీరోగా చేసిన ‘సత్యం’ సినిమా డెరైక్టర్ సూర్యకిరణ్ నాకు మంచి స్నేహితుడు. అనుకోకుండా ఓ రోజు సుమంత్ ఫ్రెండ్ బ్యాచ్‌లో నన్ను ఓ పాత్ర చేయమన్నారు. అందులో ‘రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా..’ పాట నేను రాసిందే. రాజేష్‌తో కలసి పాడాను కూడా. తర్వాత శంకర్‌దాదా ఎంబీబీఎస్, జల్సా, నమో వెంకటేశ మూవీల్లో కనిపించా. అయితే, సినిమాలను నమ్ముకోవాలా.. లెన్స్ పట్టుకోవాలా అన్న డైలమాలో నా మనసు ఫొటోలే తీయమని చెప్పింది. వెంటనే సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశా. ఫుల్‌టైమ్ ఫొటోగ్రాఫర్‌గా మారాక చిరంజీవి, రామ్‌చరణ్ తేజ్, కాజల్, తమన్నా, తాప్సీ వంటి టాలీవుడ్ తారలకు ఫొటో షూట్స్ చేశా. లాక్మే, లారియల్ వంటి ఫ్యాషన్ పెరేడ్స్‌కూ వర్క్ చేశా. విదేశాల్లోని తెలుగువారి పెళ్లిళ్లకు కూడా ఫొటోలు తీశాను.
 
 మనదేశంలో ఫేస్‌బుక్ వెరిఫై చేసిన మొట్టమొదటి ఫొటోగ్రఫీ పేజీ నాదే. ఇప్పటికి దీనికి 8 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. నాకు నచ్చిన కళ ఫొటోగ్రఫీ, నా జీవిత భాగస్వామి ప్రియ.. ఈ రెండూ కలిసొచ్చేలా ‘ఫోట్రియా’ పేరుతో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించా. యూఎస్, యూకే, న్యూజిలాండ్ సహా దేశంలోనూ పలు నగరాల్లో ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌లు నిర్వహించా. ప్రస్తుతం యాభై మందికి శిక్షణ ఇస్తున్నా. వారిలో ముప్ఫయి మందికి ఉచితంగానే నేర్పిస్తున్నా. ఫ్యూచర్‌లో సిటీలోని ఫొటోగ్రాఫర్లందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు అసోసియేషన్ ఏర్పాటు చేయాలని ఉంది.               
 - కచాక్ వెంకీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement