ధనుస్సు రాశి ఫలాలు | Ugadi Panchangam 2019 | Sagittarius Horoscope 2019-20 in Telugu - Sakshi
Sakshi News home page

వికారినామ సంవత్సర (ధనస్సు రాశి) రాశిఫలాలు

Published Sun, Mar 31 2019 12:28 AM | Last Updated on Tue, Apr 2 2019 6:37 PM

2019 To 2020  Sagittarius Zodiac Sign Horoscope - Sakshi

ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా సమస్యలు తీరుతాయి. లగ్నంలో శని కేతువుల సంచారం, సప్తమంలో రాహుగ్రహ సంచారం, లగ్న, ద్వితీయాలలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితం స్థిరంగా, ప్రశాంతంగా అభివృద్ధి పథంలో సాగుతుంది. మాట తప్పే మనుషులు, ఉపయోగించుకొని ప్రత్యుపకారం చేయని వాళ్ళు జీవితంలో అధికంగా కష్టం కలిగిస్తారు. అనువంశికంగా సంప్రాప్తించాల్సిన ఆస్తి అనుకున్నంత చేతికి రాదు. ఇతరుల ధనం మీద, స్వజనుల ఆస్తి మీద పెద్దగా ఆశ, ఆసక్తి ఉండదు. స్వార్జితంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. పథకం రచించడంలో, అమలు చేయడంలో మంచి నేర్పరితనం ఉంటుంది. ఎవరైనా తోడు లేకపోతే కార్యక్రమాలు చేయడానికి వెనకాడతారు. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదని భావిస్తారు. సంతాన సంబంధిత విషయంలో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆలోచనలు సంతానం మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయరు. ప్రభుత్వపరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను, లోపాలను అందరికంటే సులువుగా గ్రహిస్తారు. లెక్కలు అన్నీ కాగితం మీద లేకపోయినా అన్నీ గుర్తుంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలలో ఇతరుల మితిమీరిన జోక్యం కాలక్రమేణా ఇబ్బంది కలిగిస్తుంది. జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలలో ప్రావీణ్యత ఉంటుంది. సంపాదన బాగున్నా అందుకు తగిన ఖర్చులు ఉంటాయి. ధనం పొదుపు చేయాలన్న మీ ఆలోచన కొంతవరకు మాత్రమే ఆచరణలో సాధ్యమవుతుంది. అనవసరపు ఖర్చులు చేసే మీ వాళ్ళను అదుపులో పెట్టడంలో మీరు విఫలమవుతారు. ఉద్యోగపరంగా మీరు కోరుకున్న మార్పులు వస్తాయి. మిమ్ములను ఇబ్బంది పెట్టే ఉత్తర్వులు అందుకుంటారు. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు. ఇప్పుడు వారు మీ సహాయం తీసుకోవడమే నామర్దాగా భావిస్తారు. ఎవరి భాగస్వామ్యం లేకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంవత్సర ప్రథమార్ధంలో కొన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. దొంగలు స్నేహితులలోనే ఉన్నారని గ్రహిస్తారు. కుటుంబ పురోగతిపై దృష్టి సారిస్తారు. స్త్రీల సహాయ సహకారాలతో వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను అధిగమించగలుగుతారు.

చదువు కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఫలిస్తాయి. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు లాభిస్తాయి. స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. కాంట్రాక్టులు, సబ్‌–కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు అనుకూలిస్తాయి. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళకు సౌకర్యాలు ఏర్పరుస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో స్థిరాస్తుల వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. విద్య, వైద్య, అలంకార, వినోద సంబంధమైన వృత్తి ఉద్యోగాలవారికి అనుకూల కాలం. బంగారం, వెండి వంటి లోహ వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. అకౌంట్స్‌ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నిష్కారణమైన వేధింపులు, విమర్శలు కొంతకాలం మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి.ముఖ్యమైన సమయంలో విదేశాలలో ఉండే మీ మిత్రులు ఆదుకుంటారు. కొందరి మధ్య విభేదాలు పరిష్కరించడం వల్ల వాళ్ళు, వాళ్ళు ఏకమై మీకు సమస్యలు, ఆటంకాలు సృష్టిస్తారు. ఉపయుక్తమైన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్‌ యుక్తిగా చేజిక్కించుకుంటారు. చట్టపరమైన సమస్యలు, కోర్టులు, పోలీస్‌స్టేషన్‌లో వివాదాలు మొదలైనవి చికాకు పరుస్తాయి. పదిమందిలో ప్రతిష్ఠ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు స్త్రీల సహాయ సహకారాల వలన ఫలిస్తాయి. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని పక్కనపెట్టి మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తారు. వారికే ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు. ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవారికి లాభాలు తక్కువగా ఉంటాయి. కీళ్ళనొప్పులు, జీర్ణకోశ సంబంధమైన, చర్మసంబంధమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. స్పెక్యులేషన్‌ వల్ల గతంలో పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో మీ మాటలు, నిర్ణయాలు ఇతరులకు నచ్చవు. అయితే మీ నిర్ణయాలే అనుకూల ఫలితాలు రావడానికి కారణం అవుతాయి. మీరు భయపడినట్లుగా సంఘటనలు జరుగవు. కొండల వలె సమస్యలు వచ్చినా మబ్బుల వలె విడిపోతాయి. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శక్తి కొలది దానధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలతో పాటు పితృదేవతల జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార విషయాలలో మార్పులకు మీరు అంగీకరించని కారణంగా అగ్రిమెంట్స్‌ వాయిదా పడతాయి. ప్రత్యర్థివర్గంలోని గ్రూపు రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు.

చెప్పుకోదగిన కారణం లేకుండా ముఖ్యమైన వ్యక్తులు దూరం అవుతారు. ఎదుటివారి మనోభావాలను గౌరవించకపోయినా, వారు చెప్పే విషయాలను ఓపిగ్గా వినండి. మీ వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడ్డాయన్న ఆరోపణలు రాకుండా జాగ్రత్త వహించండి. అపోహలతో చేసే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సెక్యూరిటీకి ప్రాధాన్యతనివ్వండి. కొన్ని వ్యాపారాలలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. ఖర్చులు అధికం కావడం వల్ల లాభాలు అంతగా కనబడవు. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని పూర్తిగా వినియోగించుకోలేరు. అందరినీ ధిక్కరించి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేయగలుగుతారు. మీ మిత్రవర్గానికి శత్రువులైన వారందరికీ మీరు శత్రువుగా ఉండవలసిన అవసరం లేదని గ్రహించండి. చాలా విషయాలలో మీకు కృషి కన్నా అదృష్టం వల్లనే మేలు జరుగుతుంది. పునర్వివాహం కోసం ప్రయత్నాలు చేసుకునేవారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ సంస్థలోని భాగస్వాములు, సహోద్యోగుులు ఓర్వలేని వారు ఉంటారు. ఇది మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. మీకంటే పెద్దస్థాయి కలిగిన వారితో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. మీ స్వయంకృతాపరాధాలే ఇబ్బందికి గురిచేస్తాయి. దురభ్యాసాలకు బానిసలైన సిబ్బంది వల్ల నష్టం కలుగుతుంది. కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మీ స్వప్రయోజనాలు రక్షించుకోవడానికి ఎవరు సహకరించలేని పరిస్థితులలో, విధిలేని పరిస్థితులలో లంచాలు ఇచ్చి కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటారు. వ్యక్తిగత సంభాషణ ద్వారా ప్రత్యర్థుల కార్యక్రమాలు బయటపడతాయి. ఉద్యోగపరంగా దొర్లిన తప్పులకు వెంటనే సంజాయిషీ ఇచ్చి, సమస్య పెద్దది కాకుండా జాగ్రత్త వహిస్తారు. విందు వినోదాలు మీకు లాభించేవి కావని గుర్తించండి. ఇతరుల నుంచి విలువైన వస్తువులను కానుకలుగా స్వీకరించవద్దు. ఆంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారిని రానివ్వకండి. ముఖ్యమైన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు ఎవరూ ఊహించని చోట భద్రపరచండి. మనోధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితాన్నే ఒక మలుపు తిప్పబోతున్న విషయం ఆ క్షణాన మీకు తెలియదు. వృత్తి ఉద్యోగాలపరంగా ఏదో ఒక వర్గానికి కాపు కాయవలసిన పరిస్థితి నుండి తప్పుకుంటారు. సభలు, సమావేశాలు ప్రధాన ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. బహిరంగ సభలలో ప్రసంగించవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వరంగ సంస్థల ద్వారా మేలు పొందుతారు. పైరవీలు చేసి ప్రభుత్వపరమైన ఆర్డర్లు సంపాదిస్తారు. అదృష్టం కలిసివస్తుంది. అధిక శ్రమకు ఓర్చి, వత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యూహ ప్రతివ్యూహాలు నిత్యకృత్యం అవుతాయి. ఊహించని పరిణామాలు ఏర్పడినా ధైర్యంగా ఉంటారు. కష్టపడి సంపాదించుకున్న రాజకీయ పదవులు ఊహించినంతగా ఉపయోగపడవు.  మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. అయితే మిత్రుల నుండి వచ్చే చిన్నపాటి సమస్యలు తలనొప్పిగా మారుతాయి.

మీ మీద అతిగా ఆధారపడుతున్న సన్నిహితుల పట్ల అసహనం ప్రదర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాల పట్ల జాగ్రత్త వహిస్తారు. బంధువులలో కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నైతిక బాధ్యతలను నెరవేర్చడానికి విశేషంగా కృషి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. ఇతరుల సలహాలను ఎక్కువగా మనస్సుకి తీసుకోరు. అందరి సలహాలు వింటున్నట్లుగా నటిస్తారు. మీకు తోచింది మీరు చేసుకుపోతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి  కావలసిన వనరులను సమీకరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఋణాలు కొంతవరకు తీరుస్తారు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మీ అంచనాలు ఫలిస్తాయి. కుటుంబంలో తలపెట్టిన వివాహాది శుభకార్యాలను దిగ్విజయంగా నిర్వహిస్తారు. విద్యాసంబంధమైన విషయాలు, సివిల్‌ సర్వీస్‌లకు సంబంధించి విషయాలు సానుకూల పడతాయి. జీవితాశయం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తులకు మంచి ధర వస్తుంది. స్థిరాస్థులు వేటినీ అమ్మకూడదని కుటుంబపరంగా నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులు ఈ సంవత్సరం బాగా రాణిస్తారు. మీరు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీపరీక్షలలో చాలా తేలికగా విజయం సాధిస్తారు. పన్నులు వసూలు చేసే అధికారులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. యోగాసనాలు, మెడిటేషన్‌ వల్ల లాభం పొందుతారు. సహోదర సహోదరీవర్గంతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. తల్లిదండ్రులపట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి, పరోపకారం చేస్తారు. రాజకీయరంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని ప్రయోజనాలను వదులుకొని మీ పెద్దరికాన్ని, మర్యాదని నిలుపుకుంటారు. జనాకర్షణ పెరుగుుతుంది. మీ సంతానం ప్రతిభ విదేశాలలో రాణిస్తుంది. ప్రభుత్వపరమైన స్కాలర్‌షిప్పులు లభిస్తాయి. ప్రింటింగ్, అడ్వర్టైజ్‌మెంట్‌ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. విద్యాసంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. విద్యాసంస్థలు లాభాల బాటలో నడుస్తాయి. అతీంద్రియశక్తుల గురించి, మానవాతీతశక్తుల గురించి మిమ్మల్ని భయపెట్టాలని అనుకునేవారిని దూరంగా ఉంచుతారు. సమష్టిగా నూతన వ్యవహారాలు నిర్వహిస్తారు. నిర్వహించే కార్యక్రమాలపైన స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎవరికి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వాలో చక్కగా నిర్ణయిస్తారు. మిమ్మల్ని వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతాయి. కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం, విద్య కోసం చేసే ప్రయత్నాలు రెండవసారి ఫలిస్తాయి. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. నూతన గృహనిర్మాణం, వాహన సౌఖ్యం కలుగుతుంది. ఎన్ని సాధించినా ప్రశాంతత మాత్రం లభించదు. ఉపయోగం కాదు అని మీరు భావించిన కార్యక్రమాలు మీకు ఉపయుక్తంగా మారుతాయి. ఇతరులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ కొంత కాలం మీ దగ్గర భద్రపరచవలసి వస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. 

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏకాంత జీవితం గడుపుతున్న వారికి తోడు లభిస్తుంది. అభిప్రాయ భేదాలు పట్టువిడుపు లేని ధోరణి వలన ఆత్మీయులతో విభేదాలు సంభవిస్తాయి. విభేదాలను రూపు మాపుకోవడానికి ఓర్పు వహిస్తారు. కుటుంబంలోని కొన్ని నైతిక బాధ్యతలకు మీ వంతు సహాయం చేస్తారు. సామాజిక సేవాసంస్థలలో ప్రధాన పాత్ర వహిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. చోరభయం పొంచి వుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా సంసార జీవితం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన విషయాలలో ఉపశమనం లభిస్తుంది. వీసా కోసం ప్రయత్నించే వారికి ప్రారంభంలో కొంత గడ్డుకాలాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. దూరప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలలో మీ ప్రతిభ రాణిస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కుల, మత, వర్గ, సామాజిక వివక్ష మీ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తాయి. అనేక సంబంధాలు చూసి చాలాకాలంగా వివాహం కాకుండా ఇబ్బందిపడుతున్న వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. పునర్వివాహం చేసుకునే వారికి ఇది అనుకూల కాలం. మీ సృజనాత్మక చర్యతో చేసే వ్యాపారాలు బాగుంటాయి. బ్యూటీపార్లర్లు, హోటళ్ళు నడిపేవారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం పట్ల మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. వీలైనంత వరకు వివాదస్పదమైన విషయాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ప్రతిభ కనబరుస్తారు. యాంకరింగ్‌ రంగంలో రాణిస్తారు. సాంస్కృతిక  కళారంగాలలో మంచి ఖ్యాతి లభిస్తుంది. ఆంతరంగిక విషయాలు బయటకు తెలియడం వలన చిక్కుల్లో పడతారు. సహోదర సహోదరీవర్గాన్ని ఆదుకుంటారు. కీళ్ళనొప్పులు, గైనిక్‌ ప్రాబ్లమ్స్‌ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. పొదుపు చేసిన ధనం అక్కరకు వస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి సంభవం. అనేకమందికి సలహాలు ఇచ్చి మేధావిగా, మంచి స్నేహితురాలిగా పేరు తెచ్చుకున్న మీరు సొంత విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి కంగారుపడతారు. స్త్రీకి  స్త్రీయే శత్రువు అన్న సామెత మీ విషయంలో నిజమవుతుంది. మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మీ మీద పెత్తనం చేసే స్త్రీల విషయంలో కాస్త ఆలస్యంగా ప్రతిఘటిస్తారు. సంతానసాఫల్య కేంద్రాలలో మోసపోయే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement