
2వ అంతస్తు
మిస్టరీ
ట్యాక్సీ వచ్చి ఏడంతస్తుల భవంతి ముందు ఆగింది. డ్రైవర్ పక్కన కూర్చున్న శిఖర్ డబ్బులిచ్చి కిందికి దిగాడు. ఓసారి బిల్డింగ్ వైపు చూసి, ట్యాక్సీ వెనుక డోరు తెరిచాడు. కాలికి అడ్డు పడకుండా చీరను కాస్త పైకి లాక్కుని కారు దిగింది, శిఖర్ భార్య పూనమ్. డిక్కీలో ఉన్న లగేజి తీసి కింద పెట్టాడు డ్రైవర్. ట్యాక్సీ వెళ్లిపోయింది. చెరో రెండు బ్యాగులూ పట్టుకుని భవంతి వైపు నడిచారు దంపతులిద్దరూ.
‘‘వావ్... భలే ప్రశాంతంగా ఉంది శిఖర్. మొత్తానికి మంచి చోటు సెలెక్ట్ చేశావ్’’ అంది పూనమ్ ఆనందంగా.
‘‘మరేమనుకున్నావ్ మీ ఆయనంటే. ఇక్కడికి నాకు ఆఫీసు చాలా దగ్గర. నీకు షాపింగ్ కాంప్లెక్సులు, డిపార్ట్‌మెంట్ స్టోర్లూ అంతకంటే దగ్గర. పైగా బోలెడంత ప్రశాంతత. మీ ఆయన ఏం చేసినా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కదా’’ అన్నాడు శిఖర్.
‘‘చాలు చాలు. ఇప్పటికే బాగా ఎక్కువయ్యింది సొంత డబ్బా. ముందు ఫ్లాట్‌కి వెళ్దాం పద. ఈ లగేజీ మోయలేక పోతున్నా’’ అంది పూనమ్ అతి కష్టంగా బ్యాగ్స్ తీసుకెళ్తూ.
అంతలో ఓ వ్యక్తి ఎదురొచ్చాడు. ‘‘హలో... కొత్తగా వచ్చినట్టున్నారు. ఏమైనా హెల్ప్ కావాలా?’’ అన్నాడు స్మైల్ ఇస్తూ.
శిఖర్, ప్రీతి ముఖాలు చూసు కున్నారు. ఇద్దరిలోనూ సంతోషం. ఏరియా, ఇల్లే కాదు... మనుషులు కూడా బాగున్నారు అనుకున్నారు మనసుల్లో.
‘‘ఫరవాలేదండీ. మేం తీసుకెళ్తాం, థాంక్యూ’’ అన్నాడు శిఖర్.
అతను తల అడ్డంగా ఊపాడు. ‘‘మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదండీ. పాపం ఆవిడ్ని చూడండి! ఆ బ్యాగ్స్ మోయలేకపోతున్నారు. నేను తెస్తాలెండి’’ అంటూ పూనమ్ చేతిలోని బ్యాగ్స్‌ని చనువుగా అందుకున్నాడు.
‘‘వద్దండీ. నేను తీసుకెళ్తాను’’ అంది పూనమ్ మొహమాటంగా.
‘‘భలేవారండీ. ఒకచోట ఉండాల్సిన వాళ్లం. ఈమాత్రం సాయం చేసుకోకపోతే ఎలా’’ అంటూ బ్యాగ్స్ పట్టుకుని లోనికి నడిచాడా వ్యక్తి. లిఫ్ట్ సమీపిస్తుండగా అడిగాడు... ‘‘ఏ ఫ్లోర్?’’
‘‘సెకెండ్ ఫ్లోర్. ఫ్లాట్ నంబర్ 201’’
శిఖర్ చెప్పాడో లేదో... ‘‘సెకెండ్ ఫ్లోరా?’’ అంటూ చేతిలోని బ్యాగ్స్‌ని కింద పెట్టేశాడతను. ‘‘సారీ బ్రదర్. నాకు అర్జంటుగా ఓ పని గుర్తొచ్చింది. వెంటనే వెళ్లాలి.
మీరు లిఫ్ట్‌లో పెకైళ్లిపోండి. మళ్లీ కలుస్తా’’ అనేసి వాళ్ల స్పందన కోసం ఎదురు చూడకుండా వడివడిగా వెళ్లిపోయాడు.
అతడు ఎందుకంత కంగారు పడ్డాడో, ఉన్నట్టుండి ఎందుకు వెళ్లిపోయాడో అర్థం కాలేదు ఇద్దరికీ. సరేలే మనకెందుకు అనుకుని లగేజ్ తీసుకుని లిఫ్ట్‌లో సెకెండ్ ఫ్లోర్‌కి బయలుదేరారు.
‘‘వావ్... పాలక్ పన్నీర్ అదిరింది డియర్. ఏమైనా నీ వంటే వంట’’... మురిసిపోతూ భార్యను పొగడుతూ తింటున్నాడు శిఖర్. ఆ కాంప్లిమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తోంది పూనమ్.
‘‘పాలక్ పన్నీర్ అంటే ఇంత పిచ్చేంటి శిఖర్ నీకు? మూడు పూటలా పెట్టినా తింటావే’’ అంది నవ్వుతూ.
శిఖర్ ఏదో అనబోయాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. శిఖర్ లేవబోయాడు. ‘‘నేను చూస్తాలే ఉండు’’ అంటూ పూనమ్ లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఒక మహిళ.
‘‘ఎవరు కావాలండీ?’’ అంది పూనమ్ ఆమెని తేరిపార చూస్తూ.
‘‘మేము 205లో ఉంటామండీ. అంటే లిఫ్ట్ పక్కనుంది కదా... ఆ ఫ్లాట్ అన్నమాట. నిన్ననే మా ఫ్రిజ్ పాడైపోయింది. మీ దగ్గర కొంచెం కూల్ వాటర్ ఉంటే ఇస్తారా?’’ అడిగిందామె మొహమాటపడుతూ.
‘‘దానిదేముంది! ఇప్పుడే తెస్తాను ఉండండి’’ అంటూ లోనికి వెళ్లింది పూనమ్. ఫ్రిజ్‌లోంచి ఓ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఇచ్చింది.
‘‘చాలా థ్యాంక్సండీ. మళ్లీ కలుస్తాను’’ అని చెప్పి వెళ్లిపోయిందామె. తలుపేసి వచ్చి భోజనం దగ్గర కూర్చుంది పూనమ్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసి పడకల మీదకు చేరారు. కాసేపటికి నిద్రలో జారుకున్నారు.
అర్ధరాత్రి కావస్తుండగా ఉలిక్కిపడి లేచింది పూనమ్. ‘‘శిఖర్... శిఖర్... త్వరగా లే’’ అంటూ భర్తని పట్టి కుదిపింది. అతడు కంగారుగా లేచాడు. ‘‘ఏమైంది పూనమ్’’ అన్నాడు ఆతృతగా.
‘‘అది విను... కుక్క. ఎక్కడో కుక్క ఏడుస్తోంది. నాకు భయమేస్తోంది’’ అంది బెరుకు బెరుకుగా. శిఖర్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
‘‘కుక్కలు ఒక్కోసారి అలానే ఏడుస్తాయి. వాటికీ భయాలూ బాధలూ ఉంటాయిగా. దీనికే భయపడితే ఎలా? ప్రశాంతంగా పడుకో’’ అంటూ పడుకోబెట్టాడు.
పడుకుందే కానీ నిద్ర పట్టడం లేదు పూనమ్‌కి. ఆ కుక్క హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆ ఏడుపు భయానకంగా ఉంది. దానికే బెదిరిపోతుంటే... ఉన్న ట్టుండి ఎవరో నడుస్తున్నట్టుగా అలికిడి. ఘల్లుఘల్లుమంటూ గజ్జల సవ్వడి. ఆ సవ్వడి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
నిలువెల్లా వణికిపోయింది పూనమ్. భర్తతో చెబుదామనుకుంది. అప్పటికే అతడు నిద్రలోకి జారిపోయాడు. దాంతో గుండె చిక్కబట్టుకుని ఉండిపోయింది. నిండా దుప్పటి కప్పేసుకుని, నిద్రపోయే ప్రయత్నం మొదలుపెట్టింది.
మరుసటి రోజు...
‘‘హలో... మీరే కదూ సెకెండ్ ఫ్లోర్‌లోకి కొత్తగా వచ్చింది?’’
ఆఫీసుకు వెళ్తోన్న శిఖర్‌కి సెండాఫ్ ఇవ్వడానికి కిందకు వచ్చిన పూనమ్‌ని పలుకరించింది వైశాలి. అవునన్నట్టు తలూపింది పూనమ్.
‘‘అయినా ఆ ఫ్లోర్‌లో తీసుకున్నా రెందుకు? ఇంకా వేరే ఫ్లాట్స్ ఉన్నాయిగా ఖాళీగా’’ అందామె.
‘‘ఏం... ఆ ఫ్లోర్‌లో తీసుకుంటే ఏమయ్యింది?’’ అంది పూనమ్.
‘‘రెండో అంతస్తులో ఎవరూ ఉండరండీ. ఉండలేరు కూడా. అందుకే కదా, అందులో అన్ని ఫ్లాట్లూ ఖాళీగానే ఉన్నాయి!’’
అయోమయంగా చూసింది పూనమ్. ‘‘అదేంటి? వేరేవాళ్లు కూడా ఉన్నారు కదా! రాత్రి ఒకావిడ వచ్చి నన్ను కూల్ వాటర్ కూడా అడిగింది.’’
చురుక్కున చూసింది వైశాలి. ఆ చూపులో ఆశ్చర్యం, భయం, ఆందోళన... ఇంకా ఏవేవో కనిపిస్తున్నాయి. ‘‘ఏ ఫ్లాట్ అని చెప్పింది?’’ అంది కంగారుగా.
‘‘205’’.
అంతే... హడలిపోయింది వైశాలి. ‘‘205వ ఫ్లాటా? దయచేసి నా మాట వినండి. మీరక్కడ ఉండొద్దు. వెంటనే వేరే ఫ్లోర్‌కి మారిపోండి.’’
ఆమె ఎందుకంత కంగారు పడుతోందో అర్థం కాలేదు పూనమ్. ఏమయ్యిందంటూ నిలదీసింది.
‘‘రెండేళ్లుగా ఆ ఫ్లాట్‌లో ఎవరూ ఉండటం లేదండీ. మీరు చూసింది మనిషిని కాదు... దెయ్యాన్ని.’’
ఉలిక్కిపడింది పూనమ్. ‘‘దెయ్యమా?’’ అంది అదురుతున్న పెదవులతో.
‘‘అవును... దెయ్యమే’’ అంటూ వైశాలి ఒక్కో విషయం చెబుతుంటే, విని కొయ్యబారిపోయిందామె.
ఆ భవంతి రెండో అంతస్తులో ఒకప్పుడు అన్ని ఫ్లాటులూ నిండుగానే ఉండేవి. కానీ అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తర్వాత, పరిస్థితులు మారిపోయాయి. ఫ్లాట్ నంబర్ 205లోకి ఇద్దరు దంపతులు అద్దెకు వచ్చారు. భార్య ఎంతో నెమ్మదస్తురాలు. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడేది. కానీ భర్త అందుకు వ్యతిరేకం. ఎప్పుడూ చిటపట లాడుతూ ఉంటాడు. అందరితోనూ అంటీ ముట్టనట్టుగా ఉంటాడు. భార్య కూడా అలాగే ఉండాలంటాడు. కానీ ఆమె అలా ఉండలేదు.
అందరితో కలివిడిగా ఉండటం ఆమె నైజం. దాంతో ఇద్దరూ తరచుగా గొడవ పడేవారు. అతడు ఆమెని దుర్భాష లాడేవాడు. చిత్ర హింసలు పెట్టేవాడు. ఒకరోజు మరీ హింసించేసరికి ఆమె తట్టుకోలేక మౌనంగా అయిపోయింది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. బయటకు రావడమే మానేసింది. తనలో తనే కుమిలి పోయింది. ఆ బతుకు వద్దనుకుందో ఏమో... ఓరోజు ఆత్మహత్య చేసుకుంది.
ఆ సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే అంతకంటే షాకిచ్చిన విషయం మరొకటుంది. ఆమె చనిపోయిన రోజు ఎక్కడి నుంచో ఓ నల్లకుక్క అపార్ట్ మెంట్‌కు వచ్చింది. అది తిన్నగా రెండో అంతస్తులోకి వెళ్లి, ఫ్లాట్ నంబర్ 205 తలుపు దగ్గర కూర్చుంది. దాన్ని తరిమే యాలని ఎంతో ప్రయత్నించారు. అది కదల్లేదు. కొట్టినా పారిపోలేదు. దాంతో అలా వదిలేశారు. దాని ప్రవర్తన విచి త్రంగా ఉండేది. అది మొరిగేది కాదు. ఎవరినీ కరిచేదీ కాదు.
అసలక్కడి నుంచి కదిలేది కాదు. ఏం తినేదో, తాగేదో అర్థమయ్యేది కాదు. కానీ అర్ధరాత్రి అయ్యే సరికి భయంకరంగా ఏడవడం మొదలు పెట్టేది. ఆ తర్వాత కాసేపటికి రెండో అంతస్తు అంతటా మువ్వల సవ్వడి వినిపించేది. మొదట్లో ఎవరూ పట్టించు కునేవారు కాదు. ఎవరో ఏ పనిమీదో తిరుగుతున్నారేమోలే అనుకునేవారు. కానీ ఓరోజు ఎవరు తిరుగుతున్నారో చూద్దా మని బయటకు వచ్చిన ఓ వ్యక్తికి జుత్తు విరబోసుకుని తిరుగుతోన్న మహిళ కని పించింది. ఆమె కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆమె అతని వైపు రాబోయింది.
అతను చప్పున లోనికి వెళ్లి తలుపేసేసు కున్నాడు. దాంతో అక్కడ జరుగుతున్న దేమిటో అందరికీ అర్థమైపోయింది. చని పోయిన మహిళ దెయ్యమై తిరుగుతోందని తెలిసిపోయింది. వెంటనే ఆ అంతస్తులో ఉంటున్నవాళ్లందరూ ఫ్లాట్లు ఖాళీ చేసేశారు. కానీ ఆమె భర్త మాత్రం అక్కడే ఉన్నాడు. అతడు ఓరోజు ఉన్నట్టుండి గుండె నొప్పితో చనిపోయాడు. రెండు రోజులైనా తలుపు తీయడం లేదని పాల వాడు చెబితే తలుపులు బద్దలు కొట్టి చూశారు. కుళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న అతడి మృతదేహం కనిపించింది.
అంతే... ఇక ఆ రోజు నుంచీ రెండో అంతస్తులో నివసించడానికి ఎవరూ సాహసించలేదు. తెలియక ఎవరైనా వచ్చినా... కుక్క ఏడుపు, గజ్జెల శబ్దం విని హడలిపోయేవారు. కొందరైతే దెయ్యాన్ని చూసి జడుసుకుని వెళ్లిపోయారు. ఇవన్నీ తెలియక పూనమ్, శిఖర్‌లు ఓ ఏజెంటు ద్వారా ఆ ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నారు. చివరికి వారికీ అదే అనుభవం ఎదురయ్యే సరికి అపార్ట్‌మెంట్ వదిలి వెళ్లిపోయారు.
మహారాష్ట్రలో ఆ భవంతి ఇప్పటికీ ఉంది.
రెండో అంతస్తులో నేటికీ దెయ్యం తిరుగుతోంది. అయితే ఆమె వివరాలు ఎవరిని అడిగినా చెప్పరు. ఆమె పేరు ఎవరూ నోటితో ఉచ్ఛరించరు. ‘సెకెండ్ ఫ్లోర్ బాబీ (రెండో అంతస్తు వదిన) అంటారు. ఆమె ఎవ్వరికీ చెడు చేయదు. ఎవ్వరి ప్రాణాలనూ హరించదు. కేవలం మౌనంగా సంచరిస్తుంది. చిత్రహింసలు అనుభవించిన చోట ఆవేదనతో తిరుగాడు తుంది. శాడిస్టు భర్తల కారణంగా తనువులు చాలిస్తోన్న ఎందరో అభాగ్య మహిళలకు గుర్తుగా తన ఉనికిని చాటుతోంది!
ఆ నల్ల కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎందుకు ఆ ఫ్లాట్ దగ్గరే ఉంటోందో, ఎందుకని ప్రతి రాత్రీ ఏడుస్తోందో ఎంతకీ అంతు పట్టదు. దానికీ ఆమెకీ సంబంధం ఏదైనా ఉందా? లేక ఆమె ఆత్మే దానిలో ప్రవేశించిందా?