బెల్లు కొట్టి చెప్పాల్సిన సత్యం | A bell ring makes more thril in childwood | Sakshi
Sakshi News home page

బెల్లు కొట్టి చెప్పాల్సిన సత్యం

Published Sun, Oct 12 2014 1:32 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

బెల్లు కొట్టి చెప్పాల్సిన సత్యం - Sakshi

బెల్లు కొట్టి చెప్పాల్సిన సత్యం

నవ్వింత: గంట చాలా విశిష్టమైంది. మా చిన్నప్పుడు ఫైరింజన్ గంటలు కొట్టుకుంటూ పోతుంటే ఆ దృశ్యం చూడటానికి గబగబా రోడ్డు మీదకు వచ్చేవాళ్లం. ఫైరింజన్ వెనక నిలబడి గణగణా గంటలు కొట్టేవాడు ఎంత గ్రేటో కదా అనుకునేవాణ్ణి. బుడుగంతటివాడు రైల్వే వింజనుడ్రైవరుకూ, జటకా పెలైటుకూ బీడీలు లంచమిచ్చి వాటిని తోలినట్టే ఒక్కసారైనా ఫైరింజను వాణ్ణి మంచిచేసుకుని వెనకెక్కి గంట కొట్టాలనుకునేవాణ్ణిగానీ, ఆ గంట నా హైటుకు సరిపోదేమో అని తర్కించుకుని దిగులుపడేవాణ్ణి.
 
 మళ్లీ చిన్నప్పటి రోజులకే వెళ్దాం. ఆయొక్క బడిగంట తాలూకు లాంగ్‌బెల్లు ఇచ్చే థ్రిల్లు గురించి చెప్పేదేముంది. గంట కొడుతున్నది చప్రాసీయే అయినా నిర్బంధంలో ఉన్న వేలాది పిల్లల్ని విముక్తి చేస్తున్న దేవదూతలా కనిపించేవాడు. హెడ్‌మాస్టర్‌కంటే గొప్పవాడులా అనిపించేవాడు. చప్రాసీ ఏ కారణం వల్లనైనా రాకపోతే గంటకొట్టడానికి విద్యార్థులందర్లోనూ ఓ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇక్కడ ఆరోగ్యకరమైన అన్న మాట ఎందుకంటే... అలా కొట్టడానికి రన్నింగ్ చేయడం వల్ల దక్కే ఆరోగ్యమన్నమాట! మహామహా ఇంగ్లిషు మీడియం విద్యార్థులైనా సరే, వాళ్ల రెండో రైమ్‌గా ‘డింగ్ డాంగ్ బెల్’ చదవాల్సిందే. (మొదటిది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్).
 
 చిన్నప్పుడు ఎడ్లబండిలో వెళ్లేప్పుడు ఎడ్లకు గంట లేకపోతే మూకీ సినిమాలా డల్‌గా ఉండేది. అదే ఎడ్లకు గంటలు, మువ్వలు కట్టివుంటే ఆ నడకే వేరు.  ఫైటింగ్ సినిమాలా హుషారుగా ఉండేది. ఇక చిన్నప్పటి సినిమాల గురించి చెప్పేదేముంది. రీలుపడిపోయిందేమో అన్న ఆదుర్దాతో మనం పడిపోయినా పర్లేదన్నట్లుగా పడుతూ లేస్తూ వచ్చేవాళ్లం. ఇంకా ట్రైలుపార్టే నడుస్తోందని తెలిపేస్తుంది సినిమాహాల్లో మోగే గంట తాలూకు గర్రుమనే శబ్దం. దాంతో హిచ్‌కాక్ సినిమా చూస్తూ అనుభవిస్తున్న ఉద్విగ్నతా... ఆ తదుపరి సస్పెన్స్ వీడిన రిలీఫునూ ఏకకాలంలో మనకు కలిగించి, గుండెనెంతో తేలిక చేస్తుందా బెల్లు.
 
 మా చిన్నప్పుడు చుట్ట అలవాటున్న ముసలాళ్లంతా ఘంట చుట్టే తాగేవాళ్లు. ఇతర బ్రాండులవీ లభ్యమైనప్పటికీ వాటిని కనీసం క్రీ‘గంట’ కూడా చూసేవారు కాదు. ఘంట చుట్ట వెలిగిస్తేనే మందపాటి గంట... సారీ... ఘంట మోగినట్టుగా దాంతాలూకు ఘాటు టంగు... సారీ ఠంగుమనేదట. ఆ చుట్టతాగుతూ ఠంగు ఠంగుమని దగ్గేవాళ్లు. మహాగాయకుడు ఘంటసాల అంతటి పేరుప్రఖ్యాతులు సాధించడానికీ ఆయన గొంతులో మోగే తియ్యటి గంటలు మన చెవికి చేరడమేనని నాలాంటి సంగీతం తెలియని వారికి ఓ దురభిప్రాయం. ఈ ఘంటసాల, పెదగంట్యాడ, చినగంట్యాడ లాంటి ఊళ్ల పేర్లన్నీ గంట పట్ల గౌరవంతో పెట్టుకున్నవేనని నా రీసెర్చీలో తేలిన వాస్తవం.
 
 దేవుడి తాలూకు కాలింగ్ బెల్ గంట అని చాలామంది ఇంతకుముందే వాక్రుచ్చారు. దేవుడంటే నమ్మకం లేకపోయినా శ్రీశ్రీకి గంటల పట్ల మాత్రం ఎంతో భక్తీ ఆసక్తి. అంతటివాడు సైతం పట్టణాలలో, పల్లెటూళ్లలో, బట్టబయలునా, పర్వతగుహలా, ఎడారులందూ, సముద్రమందూ, అడవుల వెంటా అగడ్తలంటా ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా గంటలు.. గంటలు.. గంటలు.. గంటలు... గణగణ గణగణ గణగణ గంటలు గంటలు అంటూ కవిత్వం రాశాడు. పైగా తన గంటల మహత్యం ఎంత గొప్పదో చెప్పడానికి అది ఎడ్గార్ అలెన్ పో కవిత్వం కానేకాదనీ, తనదేననీ ఘంటా బజాయించి మరీ చెప్పాడు.
 
 గంట మహత్యం ఎంత గొప్పదంటే... హైదరాబాద్‌కు వచ్చిన ప్రతివాడూ సాలార్‌జంగ్ మ్యూజియానికి వెళ్లి పెద్దగడియారంలోంచి ఓ చిట్టివాడూ, పొట్టివాడూ వచ్చి గట్టిగా గంట కొట్టే దృశ్యాన్ని అబ్బురంగా చూస్తాడు. ఈనాటి సినిమా ఫక్కీలో చెప్పాలంటే... గడియారం దగ్గరికి ఎప్పుడొచ్చావన్నది కాదన్నయ్యా ముఖ్యం... పన్నెండు గంటలు కొట్టే సమయానికి వచ్చావా లేదా అన్నదే పాయింటు. మూఢనమ్మకాలని కొందరు ఒకపట్టాన నమ్మరు గానీ సదరు పేరు పెట్టుకున్నందుకే గ్రాహంబెల్లు తన పేరుకు తగ్గట్టు గంటకొట్టి పిలిచే టెలీఫోన్ కనిపెట్టాడనీ, గోబెల్ అని నామకరణం జరిగినందుకే తన ప్రచారాలన్నీ గంటతో టముకేసినంత గట్టిగా చేయగలిగాడనీ కొందరు న్యూమరాలజిస్టులు నమ్మకంగా చెబుతుంటారు.
 
 ఏదైనా విషయం చాలా సేపు సాగిందనడానికి వాడుకగా, ‘అబ్బ గంటసేపు పట్టింది’ అనడం ఒక నుడికారం, తెలుగులో అదో పలుకుబడి. గంట అనేదాంట్లో శబ్దం, ధ్వని లేకపోయినా ఈ ప్రపంచాన్ని ఇరవైనాలుగ్గంటలూ... గంటలే నడిపిస్తున్నాయి. చిన్నప్పుడు బడి వదిలేముందు లాంగ్ బెల్ అనే అప్షన్ జీవితంలో ఉండదని మనకు అనుభవం మీద తెలిసొస్తుంది. పైగా మన బాస్ గదిలోంచి మోగే బెల్లుతో మన గుండె మాటిమాటికీ అవుతుంది గుభిల్లు. దీంతో పాటు ఈ రోజుల్లో గంటమోగే మొబైల్ అనే సాధనాన్ని జేబులో ఉంచుకుంటాడు. యుద్ధగంటలా మోగే ఆ సెల్లుబెల్లుతో ఏ అస్త్రం ఎటువైపు నుంచి వచ్చి బతుకు ఛిద్రం చేస్తుందో, క్షతగాత్రుల్లా మిగులుస్తుందో అన్న చింత ఎల్లరకూ ఉంటుంది. పెద్ద బిల్డింగుల్లో ఏవైనా అగ్నిప్రమాదపు చ్ఛాయలు కనిపించగానే గంటలు గణగణా మోగుతాయట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు చాలా సంప్రదాయాల్లో భవిష్యత్ ప్రమాద వెడ్డింగ్ బెల్స్ మోగిస్తారు!
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement